LOADING...
BCB: బంగ్లా ఆటగాళ్ల భద్రతపై స్పష్టత.. భారత్‌లో ఎలాంటి ముప్పు లేదన్న ఐసీసీ
బంగ్లా ఆటగాళ్ల భద్రతపై స్పష్టత.. భారత్‌లో ఎలాంటి ముప్పు లేదన్న ఐసీసీ

BCB: బంగ్లా ఆటగాళ్ల భద్రతపై స్పష్టత.. భారత్‌లో ఎలాంటి ముప్పు లేదన్న ఐసీసీ

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 13, 2026
09:30 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో జరగనున్న టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో పాల్గొనడంలో బంగ్లాదేశ్‌ ఆటగాళ్లకు భద్రతాపరమైన ఎలాంటి ఇబ్బందులు ఉండవని అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) తేల్చినట్లు సమాచారం. తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డు (బీసీబీ) చేసిన విజ్ఞప్తిపై ఐసీసీ సానుకూలంగా స్పందించలేదని తెలుస్తోంది. భారత్‌కు ఆటగాళ్లను పంపలేమంటూ బీసీబీ పేర్కొన్న కారణాలు తమను సంతృప్తిపరచలేదని ఐసీసీ భావించినట్లు సమాచారం. భారత్‌లో బంగ్లా ఆటగాళ్లకు ముప్పు వాటిల్లే అవకాశం పెద్దగా లేదని ఐసీసీ రూపొందించిన నివేదికలో స్పష్టమైంది. ఫిబ్రవరి 7 నుంచి ఆరంభమయ్యే టీ20 ప్రపంచకప్‌కు భారత్‌తో పాటు శ్రీలంక కూడా ఆతిథ్యమిస్తున్న విషయం తెలిసిందే.

Details

బంగ్లాదేశ్ లో హిందువులపై దాడులు

గతేడాది ఛాంపియన్స్‌ ట్రోఫీ కోసం భారత జట్టు తమ దేశానికి వెళ్లకపోవడంతో ఈ టోర్నీకి పాకిస్థాన్‌ జట్టు భారత్‌లో పర్యటించడంలేదు. అందుకు బదులుగా తమ మ్యాచ్‌లన్నింటినీ శ్రీలంకలో ఆడనుంది. ఇదిలా ఉండగా భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతినడం, అలాగే బంగ్లాదేశ్‌లో హిందువులపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. ఈ నేపథ్యంలో బంగ్లా పేసర్‌ ముస్తాఫిజుర్‌ను ఐపీఎల్‌ వేలంలో కోల్‌కతా నైట్‌రైడర్స్‌ ఎంపిక చేయడంపై భారత అభిమానుల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఈ పరిణామాల నేపథ్యంలో బీసీసీఐ ఆదేశాల మేరకు కేకేఆర్‌ ముస్తాఫిజుర్‌ను విడుదల చేసింది. ఈ సంఘటనను ప్రస్తావిస్తూ భారత్‌లో తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన ఉందని బీసీబీ పేర్కొంది.

Details

శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరిన బీసీబీ

టీ20 ప్రపంచకప్‌లో తమ మ్యాచ్‌లను కూడా శ్రీలంకకు తరలించాలని ఐసీసీని కోరింది. అయితే భారత్‌లోని పరిస్థితులు, బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల భద్రతపై ఐసీసీ తన ప్రతినిధులతో సమగ్ర అధ్యయనం చేయించింది. ఆ అధ్యయనం అనంతరం బంగ్లా జట్టుపై ఉన్న భద్రతా ఆందోళనలు అనవసరమని ఐసీసీ తేల్చింది. ఈ విషయాన్ని త్వరలోనే బీసీబీకి స్పష్టం చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో బంగ్లాదేశ్‌ జట్టు టీ20 ప్రపంచకప్‌ కోసం భారత్‌కు రావడం తప్పనిసరి కానుంది. ఒకవేళ టోర్నీని బహిష్కరిస్తే, ఆ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల పాయింట్లు ప్రత్యర్థి జట్లకు వెళ్లిపోతాయి. అంతేకాదు, ఐసీసీ నుంచి క్రమశిక్షణ చర్యలు ఎదుర్కొనే పరిస్థితి కూడా బంగ్లాదేశ్‌కు తప్పదని తెలుస్తోంది.

Advertisement