ప్రతిభ కలిగిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు సీఎం కప్ టోర్నీ.. 15 నుంచి ప్రారంభం
తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు పెద్దపీట వేస్తోంది. ప్రతిభ కలిగిన ప్లేయర్లను ప్రోత్సహించేందుకు ఈనెల 15 నుంచి 31 వరకు మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో సీఎంకప్ పేరిట టోర్నిలు నిర్వహిస్తోంది. మండల, రాష్ట్ర స్థాయిలో వీటిని నిర్వహించనున్నారు. మట్టిలో మాణిక్యాలను వెలికి తీసేందుకు ఇప్పటికే గ్రామ గ్రామాన క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేసింది. ఈటోర్నీలో 15-36 ఏళ్లలోపు పురుషులు, మహిళలు పాల్గొనేందుకు అర్హులుగా నిర్ణయించారు. సీఎంకప్ ఏర్పాట్లపై క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస గౌడ్, సాట్స్ చైర్మన్ ఆంజినేయ గౌడ్ తో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈనెల 15, 16, 17 తేదీల్లో మూడురోజుల పాటు మండల కేంద్రాల్లో అథ్లెటిక్స్, ఫుట్ బాల్ (పురుషులు), కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలను నిర్వహించనున్నారు.
రాష్ట్ర స్థాయి పోటీలు ఈనెల 28 నుంచి ప్రారంభం
ఈనెల 22 నుంచి 24 వరకు జిల్లా స్థాయిలో పోటీలను నిర్వహించనున్నారు. ఇందులో అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, హ్యాండ్‌బాల్, స్విమ్మింగ్, రెజ్లింగ్ వంటి పోటీలను నిర్వహిస్తారు. రాష్ట్రస్థాయి పోటీలను హైదరాబాద్ లో ఈనెల 28 నుంచి 31 వరకు చేపట్టనున్నారు. మొత్తం 18 క్రీడా విభాగాల్లో ఈ టోర్నీలు చేపడుతారు. సీఎంకప్ టోర్నీలో క్రీడల నిర్వహణ కోసం ప్రతి మండలానికి రూ.15వేలు, జిల్లాలకు రూ.75 వేలు కేటాయించారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా వ్యవహరించనున్నారు.