LOADING...
Devika: దేవిక అరుదైన ఘనత.. థాయ్‌లాండ్‌ సూపర్‌-300 టైటిల్‌ సొంతం
దేవిక అరుదైన ఘనత.. థాయ్‌లాండ్‌ సూపర్‌-300 టైటిల్‌ సొంతం

Devika: దేవిక అరుదైన ఘనత.. థాయ్‌లాండ్‌ సూపర్‌-300 టైటిల్‌ సొంతం

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 02, 2026
10:31 am

ఈ వార్తాకథనం ఏంటి

అంచనాలను మించి రాణిస్తున్న భారత రైజింగ్‌ స్టార్‌ షట్లర్‌ దేవిక సిహాగ్‌ తన కెరీర్‌లోనే అత్యంత గొప్ప విజయాన్ని సాధించింది. ఆదివారం ముగిసిన థాయ్‌లాండ్‌ మాస్టర్స్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌-300 బ్యాడ్మింటన్‌ టోర్నీలో దేవిక చాంపియన్‌గా అవతరించింది. దేవిక కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌-300 టైటిల్‌ కావడం విశేషంగా నిలిచింది. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో 68వ స్థానంలో ఉన్న, రెండుసార్లు జూనియర్‌ వరల్డ్‌ చాంపియన్‌గా నిలిచిన గో జిన్‌ వె (మలేసియా)తో జరిగిన ఫైనల్లో దేవిక ఆధిపత్యం చెలాయించింది. తొలి గేమ్‌ను 21-8తో సులభంగా సొంతం చేసుకున్న ఆమె.. రెండో గేమ్‌లో 6-3 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ దశలో గాయం కారణంగా గో జిన్‌ వె మ్యాచ్‌ నుంచి వైదొలగడంతో దేవికకు టైటిల్‌ ఖరారైంది.

Details

ప్రైజ్‌మనీ 18,750 డాలర్లు

ఈ విజయం ద్వారా దేవికకు 18,750 డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.17 లక్షల 19 వేలు) ప్రైజ్‌మనీగా లభించింది. అదనంగా 7,000 ర్యాంకింగ్‌ పాయింట్లు కూడా ఆమె ఖాతాలో చేరాయి. పీవీ సింధు, సైనా నెహ్వాల్‌ తర్వాత థాయ్‌లాండ్‌ సూపర్‌-300 టైటిల్‌ను గెలుచుకున్న మూడో భారతీయ క్రీడాకారిణిగా దేవిక ప్రత్యేక గుర్తింపు పొందింది. అంతేకాదు.. ఈ టోర్నీలో దేవిక తన ప్రత్యర్థుల నుంచి ఒక్క గేమ్‌ కూడా కోల్పోకుండా టైటిల్‌ గెలవడం మరో విశేషం. ఈ విజయంతో ప్రస్తుతం ప్రపంచ 63వ ర్యాంక్‌లో ఉన్న దేవిక.. మంగళవారం విడుదలయ్యే తాజా ప్రపంచ ర్యాంకింగ్స్‌లో టాప్‌-40లోకి ప్రవేశించే అవకాశముందని తెలుస్తోంది.

Details

గెలుపోటములు గురించి ఆలోచించలేదు

టైటిల్‌ గెలిచిన అనంతరం దేవిక స్పందిస్తూ.. 'చాలా ఆనందంగా ఉంది. నా కెరీర్‌లో ఇదే తొలి సూపర్‌-300 లెవెల్‌ టైటిల్‌. ఈ సీజన్‌లో మరిన్ని టోర్నీల్లో పాల్గొంటాను. థాయ్‌లాండ్‌ ఓపెన్‌లో అన్ని మ్యాచ్‌ల్లో బాగా ఆడాను. కొత్త విషయాలు నేర్చుకున్నాను. ఫైనల్లో గెలుపోటముల గురించి ఆలోచించలేదు. నా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాలనే లక్ష్యంతోనే బరిలోకి దిగాను' అని పేర్కొంది. ప్రస్తుతం దేవిక బెంగళూరులోని పదుకొనే-ద్రవిడ్‌ సెంటర్‌ ఫర్‌ స్పోర్ట్స్‌ ఎక్స్‌లెక్స్‌లో ఉమేంద్ర రాణా మార్గదర్శకత్వంలో శిక్షణ పొందుతోంది.

Advertisement