Hylo Open: హైలో ఓపెన్‌లో భారత షట్లర్ల డబుల్ ధమాకా.. సింధు, లక్ష్యసేన్‌కు టైటిల్స్!
ఈ వార్తాకథనం ఏంటి
భారత స్టార్ బ్యాడ్మింటన్ క్రీడాకారులు పీవీ సింధు, లక్ష్యసేన్ హైలో ఓపెన్ సూపర్ 500 టోర్నీలో సత్తాచాటారు. ఆదివారం జరిగిన ఫైనల్ పోరుల్లో విజయాలు సాధించి మహిళల, పురుషుల సింగిల్స్ టైటిళ్లను భారత్‌కు అందించారు. ఇటీవల వరుస పరాజయాలతో ఇబ్బందిపడుతున్న సింధు.. ఈ టోర్నీలో అద్భుత ప్రదర్శనతో ఛాంపియన్‌గా నిలిచింది. మరోవైపు లక్ష్యసేన్ కూడా తన ప్రత్యర్థిని ఓడించి టైటిల్‌ను సొంతం చేసుకున్నాడు.
వివరాలు
సింధు అలవోక విజయం..
మహిళల సింగిల్స్ ఫైనల్లో పీవీ సింధు 21-12, 21-14తో ప్రపంచ 25వ ర్యాంకర్,డెన్మార్క్ క్రీడాకారిణి లీనె కైర్స్‌ఫెల్ట్‌పై విజయం సాధించింది.
కేవలం 39నిమిషాల్లోనే ముగిసిన ఈ మ్యాచ్‌లో సింధు పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. తొలి గేమ్‌ను ఆరంభం నుంచే దూకుడుగా ఆడింది.
క్రాస్‌కోర్ట్ విన్నర్‌తో బోణీ కొట్టిన ఆమె.. ఆ తర్వాత 3-3తో స్కోరు సమమైనప్పటికీ ఏమాత్రం ఒత్తిడికి గురికాలేదు. చక్కని నెట్‌ప్లేతో వరుస పాయింట్లు సాధిస్తూ 8-5తో ఆధిక్యంలోకి వెళ్లింది. విరామ సమయానికి 11-8తో నిలిచింది.
విరామం తర్వాత కూడా సింధు తన జోరును కొనసాగించింది. అద్భుతమైన బ్యాక్‌హ్యాండ్ విన్నర్‌తో 17-12తో ఆధిక్యాన్ని పెంచుకుంది.
ప్రత్యర్థికి తిరిగి పుంజుకునే అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించి తొలి గేమ్‌ను సొంతం చేసుకుంది.
వివరాలు
అదే దూకుడును ప్రదర్శించిన సింధు
రెండో గేమ్‌లోనూ సింధు అదే దూకుడును ప్రదర్శించింది. ఆరంభంలోనే 10-6తో ఆధిక్యంలోకి వెళ్లగా.. ఆ తర్వాత స్కోరును 17-11కు చేర్చింది.
మరోవైపు లీనె నెట్‌ప్లేలో ఇబ్బందులు ఎదుర్కొంది. దీంతో సింధుకు పాయింట్లు సాధించడం మరింత సులువైంది.
అటాకింగ్ రిటర్న్‌తో ఆరు ఛాంపియన్‌షిప్ పాయింట్లను దక్కించుకున్న సింధు.. చివరకు ప్రత్యర్థి చేసిన తప్పిదంతో మ్యాచ్‌ను ముగించింది.
31 ఏళ్ల సింధుకు ఈ సీజన్‌లో ఇది రెండో టైటిల్. అంతకుముందు జులైలో జపాన్ ఓపెన్‌లోనూ ఆమె విజేతగా నిలిచింది.
వివరాలు
లక్ష్యసేన్ దూకుడు.. రెండో గేమ్‌లో ఏకపక్షం!
పురుషుల సింగిల్స్‌లో భారత షట్లర్ లక్ష్యసేన్ కూడా విజేతగా నిలిచాడు. ఫైనల్లో ఇండోనేసియా ఆటగాడు జోనాథన్ క్రిస్టీని 21-17, 21-10తో ఓడించాడు.
తొలి గేమ్‌లో ఇద్దరి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. హోరాహోరీగా సాగిన ఈ గేమ్‌లో లక్ష్యసేన్ పట్టుదలతో ఆడి 21-17తో ఆధిక్యాన్ని అందుకున్నాడు.
రెండో గేమ్‌లో మాత్రం లక్ష్య తన ఆటతీరును మరింత మెరుగుపర్చుకున్నాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థిపై ఒత్తిడి పెంచాడు.
జోనాథన్‌కు కోలుకునే అవకాశం ఇవ్వకుండా వరుస పాయింట్లు సాధించి 21-10తో గేమ్‌తో పాటు మ్యాచ్‌ను కైవసం చేసుకున్నాడు.
ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక ఆల్ ఇంగ్లాండ్ టైటిల్‌ను త్రుటిలో చేజార్చుకున్న లక్ష్యసేన్.. హైలో ఓపెన్‌లో మాత్రం పట్టుదలతో ఆడి ఛాంపియన్‌గా నిలిచాడు.