Murali Sreeshankar: వైద్యులే నమ్మలేదు.. కానీ చరిత్ర సృష్టించిన శ్రీశంకర్!
ఈ వార్తాకథనం ఏంటి
పట్టుదల ఉంటే ఎంతటి లక్ష్యమైనా సాధించవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఆ మాటలను తన జీవితంతో నిజం చేసి చూపించిన భారత స్టార్ లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్. గ్లాస్గో వేదికగా జరిగిన కామన్వెల్త్ గేమ్స్-2026లో లాంగ్ జంప్‌లో రజత పతకం సాధించి మరోసారి దేశానికి గర్వకారణంగా నిలిచాడు. అయితే ఈ సిల్వర్ మెడల్ వెనుక దాగి ఉన్న అతడి పోరాటం చూస్తే.. అది బంగారు పతకంతో సమానమని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. గత కామన్వెల్త్ గేమ్స్‌లోనూ రెండో స్థానంలో నిలిచి రజత పతకం గెలిచిన శ్రీశంకర్ ఒక్కసారిగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందాడు. లాంగ్ జంప్‌లో భారత అథ్లెట్లు కూడా ప్రపంచ స్థాయిలో సత్తా చాటగలరని నిరూపించాడు.
వివరాలు
పారిస్ ఒలింపిక్స్ కు దూరం
అనంతరం ప్రతి అంతర్జాతీయ టోర్నీలోనూ నిలకడైన ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు.
2023 ఆసియా గేమ్స్‌లో కూడా పతకం సాధించి తన ప్రతిభను మరోసారి చాటాడు. దీంతో 2024 పారిస్ ఒలింపిక్స్‌లో కూడా అతడు పతకం సాధిస్తాడనే అంచనాలు అభిమానుల్లో బలంగా నెలకొన్నాయి.
అందుకు తగ్గట్టుగానే కఠినమైన సాధన కూడా కొనసాగించాడు. అయితే అంతా అనుకున్నట్లుగానే సాగుతుందనుకున్న సమయంలో విధి అతడికి గట్టి పరీక్ష పెట్టింది.
ట్రైనింగ్ సమయంలో మోకాలికి తీవ్ర గాయం కావడంతో శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చింది. ఒలింపిక్స్‌కు కొద్ది రోజుల ముందే ఈ గాయం కావడంతో పారిస్ బరిలో అడుగుపెట్టాలన్న కల కళ్లముందే చెదిరిపోయింది.
సర్జరీ అనంతరం చాలా కాలం రిహాబిలిటేషన్ సెంటర్‌లోనే గడపాల్సి వచ్చింది. దీంతో పారిస్ ఒలింపిక్స్‌కు పూర్తిగా దూరమయ్యాడు.
వివరాలు
అనేక అవమానాలు ఎదురయ్యాయి
లాంగ్ జంప్ వంటి ఈవెంట్‌లో ఫిట్‌నెస్ అత్యంత కీలకం కావడంతో, ఒక దశలో తిరిగి పోటీల్లో పాల్గొనడమే కష్టమనే పరిస్థితి ఎదురైంది. తన కెరీర్ ఇక ముగిసిపోయిందేమో అన్న సందేహం కూడా అతడిని వెంటాడింది.
ప్రపంచంలోని అత్యుత్తమ లాంగ్ జంపర్లలో ఒకరిగా గుర్తింపు పొందిన శ్రీశంకర్‌ను ఇక మైదానంలో చూడలేమేమోనని అభిమానులు కూడా ఆందోళన చెందారు. అయితే నిజమైన ఛాంపియన్లు కష్టాల ముందు తలవంచరు.
శ్రీశంకర్ తన జీవితంతో మరోసారి నిరూపించాడు. ఆటపై ఉన్న ప్రేమ, తిరిగి నిలబడాలనే పట్టుదల అతడిని మళ్లీ ట్రాక్‌పైకి తీసుకొచ్చాయి.
తన గాయం తర్వాత చాలామంది వైద్యులు కెరీర్ ముగిసిపోయిందని భావించారని, ఆ సమయంలో తనకూ అనేక అనుమానాలు వచ్చాయని శ్రీశంకర్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
వివరాలు
రజత పతకం కైవసం
తీవ్రమైన గాయం నుంచి కోలుకుని మళ్లీ లాంగ్ జంప్ చేయడం చాలా కష్టమని చాలామంది అన్నారు. కానీ సర్జరీ కోసం ఖతార్‌కు వెళ్లిన తర్వాత నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది.
ఆరు నెలల్లోనే మళ్లీ ట్రాక్‌పైకి వస్తాననే నమ్మకం కలిగింది.
అయితే నా శరీరం ఎలా స్పందిస్తుందో దానిపైనే అంతా ఆధారపడి ఉంటుందని వైద్యులు కూడా హెచ్చరించారని కామన్వెల్త్ గేమ్స్‌కు ముందు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పేర్కొన్నాడు.
ఆ మాటలను ఇప్పుడు చేతల్లో చూపించాడు శ్రీశంకర్. తీవ్ర గాయాన్ని జయించి తిరిగి అత్యున్నత స్థాయిలో పోటీ పడుతూ కామన్వెల్త్ గేమ్స్-2026లో రజత పతకాన్ని సొంతం చేసుకున్నాడు.