LOADING...
FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026లో వరుస రికార్డులు.. గోల్స్, ప్రేక్షకుల హాజరులో కొత్త చరిత్ర
ఫిఫా ప్రపంచకప్ 2026లో వరుస రికార్డులు.. గోల్స్, ప్రేక్షకుల హాజరులో కొత్త చరిత్ర

FIFA World Cup: ఫిఫా ప్రపంచకప్ 2026లో వరుస రికార్డులు.. గోల్స్, ప్రేక్షకుల హాజరులో కొత్త చరిత్ర

వ్రాసిన వారు Moogati Shabari
Jun 26, 2026
01:06 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఫిఫా ప్రపంచకప్ 2026 టోర్నీ ఎన్నో అరుదైన రికార్డులను సొంతం చేసుకుంటూ కొత్త చరిత్రను లిఖిస్తోంది. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక గోల్స్ నమోదైన ఎడిషన్‌గా నిలవడమే కాకుండా, అత్యధిక మంది అభిమానులు స్టేడియాలకు హాజరైన టోర్నీగా కూడా గుర్తింపు పొందింది. విశేషం ఏమిటంటే.. నాకౌట్ దశ ప్రారంభం కాకముందే ఈ రెండు ఘనతలను సాధించడం టోర్నీ ప్రత్యేకతను మరింత పెంచింది.

వివరాలు

గోల్స్ పరంగా కొత్త చరిత్ర..

అమెరికా, టర్కీ మధ్య జరిగిన గ్రూప్-డి మ్యాచ్ ప్రపంచకప్ చరిత్రలో మరో మైలురాయికి వేదికగా నిలిచింది. ఈ పోరులో అమెరికా డిఫెండర్ ఆస్టన్ ట్రస్టీ చేసిన గోల్‌తో టోర్నీలో మొత్తం గోల్స్ సంఖ్య 173కు చేరింది. దీంతో 2022లో ఖతార్‌లో జరిగిన ప్రపంచకప్‌లో 64 మ్యాచ్‌ల్లో నమోదైన 172 గోల్స్ రికార్డు అధిగమించబడింది. ఇంకా విశేషం ఏమిటంటే.. ఈసారి కేవలం 59 మ్యాచ్‌లకే ఆ రికార్డు చెరిగిపోయింది. అనంతరం ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో టర్కీ 3-2 తేడాతో విజయం సాధించడంతో టోర్నీలో మొత్తం గోల్స్ సంఖ్య 177కు చేరుకుంది. ఈసారి ప్రపంచకప్‌లో జట్ల సంఖ్యను 32 నుంచి 48కు పెంచడంతో మ్యాచ్‌ల సంఖ్య కూడా 64 నుంచి 104కు విస్తరించింది.

వివరాలు

ప్రేక్షకుల హాజరులోనూ అరుదైన ఘనత..

గోల్స్‌తో పాటు ప్రేక్షకుల హాజరు విషయంలోనూ ఫిఫా ప్రపంచకప్ 2026 కొత్త ప్రమాణాలను నెలకొల్పింది. ఇప్పటివరకు మొత్తం 36,05,357 మంది అభిమానులు స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లను ప్రత్యక్షంగా వీక్షించారు. ప్రపంచకప్ చరిత్రలో ఇదే అత్యధిక ప్రేక్షకుల హాజరుగా నమోదైంది. దీంతో 1994లో అమెరికాలో జరిగిన ప్రపంచకప్ సందర్భంగా నమోదైన సుమారు 35 లక్షల మంది ప్రేక్షకుల హాజరు రికార్డు కూడా బద్దలైంది. అదనంగా, జూన్ 17న జరిగిన నాలుగు మ్యాచ్‌లకు కలిపి 2,81,223 మంది అభిమానులు హాజరుకావడంతో అత్యధిక రోజువారీ ప్రేక్షకుల హాజరు రికార్డు కూడా ఈ టోర్నీ పేరిట నమోదైంది.

Advertisement

వివరాలు

ఫిఫా అధ్యక్షుడి ఆనందం..

ఈ చారిత్రక విజయాలపై ఫిఫా అధ్యక్షుడు జియాన్నీ ఇన్ఫాంటినో సంతోషం వ్యక్తం చేశారు. ఖతార్ ప్రపంచకప్‌లో నమోదైన గోల్స్ రికార్డును అధిగమించడం 2026 టోర్నీ విజయానికి నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. ఈ ప్రపంచకప్ అభిమానులకు మరపురాని అనుభూతిని అందించిందని, జట్ల అటాకింగ్ ఈ విజయాలకు కారణమైందని వెల్లడించారు. ప్రేక్షకుల హాజరు రికార్డు ప్రపంచవ్యాప్తంగా ఫుట్‌ బాల్‌కు ఉన్న ఆదరణను, ప్రజలను ఒకే వేదికపైకి తీసుకువచ్చే ఈ ఆట శక్తిని ప్రతిబింబిస్తోందని ఆయన అన్నారు. ప్రపంచంలోని వివిధ దేశాల నుంచి వచ్చి 16 ఆతిథ్యనగరాల్లో పండుగ వాతావరణాన్ని సృష్టించిన అభిమానులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. టోర్నీలో ఎన్నో అద్భుతమైన మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయని, మరిన్ని రికార్డులు నమోదయ్యే అవకాశం ఉందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

Advertisement