LOADING...
Abhishek Sharma: 26 బంతుల్లో ఫిఫ్టీ.. కానీ అభిషేక్‌ ఖాతాలో అనవసర రికార్డు!
26 బంతుల్లో ఫిఫ్టీ.. కానీ అభిషేక్‌ ఖాతాలో అనవసర రికార్డు!

Abhishek Sharma: 26 బంతుల్లో ఫిఫ్టీ.. కానీ అభిషేక్‌ ఖాతాలో అనవసర రికార్డు!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 27, 2026
04:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌ 2026లో భారీ అంచనాల మధ్య బరిలోకి దిగిన టీమిండియా విధ్వంసకర ఓపెనర్‌ అభిషేక్ శర్మ ప్రారంభంలో మాత్రం తీవ్ర నిరాశ కలిగించాడు. హ్యాట్రిక్ డకౌట్లు సహా వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమై, నాలుగో మ్యాచ్‌లో కూడా కేవలం 15 పరుగులకే ఔటయ్యాడు. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 26న జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌కు ముందు అతనిపై భారీ ఒత్తిడి నెలకొంది. అయితే ఈసారి ఆ ఒత్తిడిని సమర్థంగా ఎదుర్కొని కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేశాడు. మొత్తంగా 30 బంతులు ఎదుర్కొని 4 ఫోర్లు, 4 సిక్సర్లతో 55 పరుగులు చేసి అవుటయ్యాడు.

Details

శిఖర్ ధావన్‌తో కలిసి మూడో స్థానం

అయితే 26 బంతుల్లో ఫిఫ్టీ సాధించినప్పటికీ, అతని టీ20 కెరీర్‌లో ఇది రెండో నిదానమైన (బంతుల పరంగా) అర్ధశతకంగా నమోదైంది. అంతకుముందు 2024లో హరారే వేదికగా జింబాబ్వేపైనే 33 బంతుల్లో ఫిఫ్టీ పూర్తి చేసి, తన కెరీర్‌లో అత్యంత నిదానమైన అర్ధశతకాన్ని నమోదు చేశాడు. సాధారణ ఆటగాడికి 26 బంతుల్లో ఫిఫ్టీ అంటే గొప్ప ఘనతే. కానీ అభిషేక్‌ లాంటి దూకుడు ట్రాక్ రికార్డు ఉన్న ఆటగాడికి ఇది కొంత 'అనవసర రికార్డు'గానే నిలిచింది. తాజా ఇన్నింగ్స్‌తో మరో మైలురాయిని కూడా చేరుకున్నాడు. భారత ఓపెనర్లలో అత్యధిక ఫిఫ్టీ ప్లస్ స్కోర్లు సాధించిన జాబితాలో శిఖర్ ధావన్‌తో కలిసి మూడో స్థానంలో నిలిచాడు.

Details

అగ్రస్థానంలో రోహిత్ శర్మ

ఈ జాబితాలో రోహిత్ శర్మ (32 ఫిఫ్టీ ప్లస్‌) అగ్రస్థానంలో ఉండగా, కేఎల్ రాహుల్ (21) రెండో స్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ జాబితాలోని ఆటగాళ్లతో పోలిస్తే అభిషేక్‌ అతి తక్కువ మ్యాచ్‌లు ఆడాడు. అతని కెరీర్‌ ఇంకా ప్రారంభ దశలోనే ఉండటంతో భవిష్యత్తులో రోహిత్‌ను కూడా అధిగమించే అవకాశం ఉంది. మ్యాచ్ విషయానికొస్తే, అభిషేక్‌తో పాటు ప్రతి భారత బ్యాటర్ రాణించడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 256 పరుగుల భారీ స్కోరు నమోదు చేసింది. ఇది టీ20 ప్రపంచకప్ చరిత్రలో భారత్‌కు అత్యధిక స్కోరు. భారత ఇన్నింగ్స్‌లో అభిషేక్ 55, ఇషాన్ కిషన్ 38, సూర్యకుమార్ 33, హార్దిక్ పాండ్యా 50 నాటౌట్, తిలక్ వర్మ 44 నాటౌట్ చేశారు.

Advertisement

Details

97 నాటౌట్‌తో బ్రియాన్ బెన్నెట్ ఒంటరి పోరాటం

చేజింగ్‌లో జింబాబ్వే ఎప్పుడూ గెలుపు దిశగా సాగలేదు. ఓపెనర్ బ్రియాన్ బెన్నెట్ 97 నాటౌట్‌తో ఒంటరి పోరాటం చేసినా ఫలితం దక్కలేదు. కెప్టెన్ సికందర్ రజా 31 పరుగులు చేశాడు. చివరకు జింబాబ్వే నిర్ణీత ఓవర్లలో 184 పరుగులకే పరిమితమై 72 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. భారత బౌలర్లలో అర్షదీప్ సింగ్ మూడు వికెట్లు సాధించగా, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్, శివమ్ దూబే తలో వికెట్ తీశారు. ఈ విజయంతో భారత్ సెమీస్ అవకాశాలను సజీవంగా ఉంచుకుంది. మార్చి 1న కోల్‌కతాలో వెస్టిండీస్‌తో జరగనున్న మ్యాచ్ భారత్‌కు డూ ఆర్ డైగా మారింది. ఆ మ్యాచ్‌లో గెలిస్తే భారత్ సెమీస్‌కు అర్హత సాధిస్తుంది.

Advertisement