FIFA World Cup 2026: ఫుట్‌బాల్ అభిమానులకు శుభవార్త.. ఫిఫా ప్రసార హక్కులను సొంతం చేసుకున్న సంస్థ ఇదే!
ఈ వార్తాకథనం ఏంటి
భారత ఫుట్ బాల్ అభిమానులకు శుభవార్త అందింది. 2026 ఫిఫా వరల్డ్ కప్‌తో పాటు 2034 వరకు జరిగే పలు ఫిఫా టోర్నీల ప్రసార హక్కులను జీ నెట్‌వర్క్ సోమవారం సొంతం చేసుకుంది. ఎనిమిదేళ్ల కాలపరిమితితో కుదిరిన ఈ ఒప్పందం ద్వారా 2034 వరకు మొత్తం 38 ఫిఫా ఈవెంట్‌ల ప్రసార హక్కులు జీ నెట్‌వర్క్‌కు దక్కనున్నాయి. 2026 ఫిఫా వరల్డ్ కప్ అమెరికా, కెనడా, మెక్సికో దేశాల్లో సంయుక్తంగా జూన్ 11 నుంచి ప్రారంభం కానుంది. టోర్నీ ఆరంభానికి కేవలం 10 రోజుల ముందే ఈ కీలక ఒప్పందం ఖరారైంది. అయితే ఈ ప్రసార హక్కుల ఒప్పందానికి సంబంధించిన ఆర్థిక వివరాలను జీ నెట్‌వర్క్ లేదా ఫిఫా అధికారికంగా వెల్లడించలేదు.
వివరాలు
60 మిలియన్ డాలర్ల వరకు తగ్గించినట్లు సమాచారం
కాగా, 2026 మరియు 2030 ఫిఫా వరల్డ్ కప్‌లను కలిగి ఉన్న భారతీయ ప్రసార హక్కుల ప్యాకేజీ కోసం ఫిఫా తొలుత సుమారు 100 మిలియన్ డాలర్ల ధరను నిర్ణయించినట్లు గతంలో వార్తలు వచ్చాయి. అనంతరం ఆ మొత్తాన్ని 60 మిలియన్ డాలర్లకు తగ్గించినట్లు కూడా సమాచారం వెలువడింది. ఈ హక్కుల కోసం భారతదేశంలోని ప్రముఖ క్రీడా ప్రసార సంస్థ జియోస్టార్ సుమారు 20 మిలియన్ డాలర్ల బిడ్ సమర్పించినట్లు తెలిసింది. అయితే ఆ ఆఫర్‌ను ఫిఫా తిరస్కరించినట్లు నివేదికలు పేర్కొన్నాయి.
వివరాలు
ఫిఫా ఈవెంట్‌లను జీ నెట్‌వర్క్ వేదికగా వీక్షించే అవకాశం
మరోవైపు, సోనీ సంస్థ కూడా ఈ ప్రసార హక్కుల ప్యాకేజీపై చర్చలు జరిపింది. అయితే చివరకు బిడ్ దాఖలు చేయకుండా వెనక్కి తగ్గింది. దీంతో 2026 నుంచి 2034 వరకు జరిగే ఫిఫా టోర్నీలను భారతీయ ప్రేక్షకులకు అందించే హక్కులు జీ నెట్‌వర్క్‌కు దక్కాయి. ఈ ఒప్పందంతో భారత ఫుట్‌బాల్ అభిమానులు రానున్న ప్రపంచకప్‌లతో పాటు పలు ప్రతిష్ఠాత్మక ఫిఫా ఈవెంట్‌లను జీ నెట్‌వర్క్ వేదికగా వీక్షించే అవకాశం పొందనున్నారు.