Shubman Gill: ₹450 కోట్ల కుంభకోణం.. శుభ్‌మన్ గిల్,మరో ముగ్గురు క్రికెటర్లకు సీఐడీ సమన్లు
ఈ వార్తాకథనం ఏంటి
క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. నలుగురు భారత క్రికెట్ ఆటగాళ్లకు గుజరాత్ రాష్ట్ర సీఐడీ క్రైం బ్రాంచ్ నోటీసులు పంపించింది.
శుభమన్ గిల్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, మోహిత్ శర్మ ఈ నోటీసులు అందుకున్నవారు.
వీరికి నోటీసులు అందజేయడానికి కారణం 450 కోట్ల రూపాయల భారీ స్కాంలో వీరి పాత్ర ఉందని భావించటమే.
ఇప్పుడు ఈ స్కాంలో ఏముంది, ఈ క్రికెటర్లకు నోటీసులు ఎందుకు పంపించారో తెలుసుకుందాం.
వివరాలు
నలుగురు క్రికెటర్లకు నోటీసులు జారీ
భూపేంద్రసింగ్ అనే వ్యక్తి భారతదేశంలో పోంజీ స్కీమ్ నిర్వహణకు పేరుగాంచాడు. అతనికి BZ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే కంపెనీ ఉంది.
గుజరాత్ రాష్ట్రంలో 2020 నుంచి 2024 మధ్య కాలంలో అతను 17 కార్యాలయాలను ప్రారంభించి, "లక్ష పెట్టుబడికి మూడు లక్షల లాభం" అని చెప్పి 11 వేల మందినుంచి 450 కోట్లు సేకరించాడు.
అయితే ఆ తర్వాత కంపెనీలు మూసివేసి తప్పించుకున్నాడు. ఈ కేసులోనే నలుగురు క్రికెటర్లకు నోటీసులు జారీ చేశారు.
ఈ కేసులో భూపేంద్రసింగ్ ను విచారించగా, నలుగురు క్రికెటర్లు ఈ స్కీమ్‌లో పెట్టుబడులు పెట్టినట్లు బయటపడింది.
వివరాలు
స్కీమ్ కింద వసూలు చేసిన 450 కోట్ల రూపాయలతో భూపేంద్రసింగ్ ఇళ్లు, స్థలాలు, భూములు
శుభ్ మన్ గిల్: రూ. 1.95 కోట్లు పెట్టుబడి పెట్టారు.
మోహిత్ శర్మ: రూ. 50 లక్షలు పెట్టుబడి పెట్టారు.
సాయి సుదర్శన్: రూ. 45 లక్షలు పెట్టారు.
రాహుల్ తెవాటియా: సుమారు రూ. 1 కోటి పెట్టుబడి పెట్టినట్లు సమాచారం.
గుజరాత్ సీఐడీ అధికారికంగా శుభ్ మన్ గిల్ పెట్టుబడి మొత్తాన్ని వెల్లడించగా, మిగతా క్రికెటర్ల వివరాలను ఇంకా ప్రకటించలేదు.
ఈ స్కీమ్ కింద వసూలు చేసిన 450 కోట్ల రూపాయలతో భూపేంద్రసింగ్ ఇళ్లు, స్థలాలు, భూములను కొనుగోలు చేశారని పోలీసులు చెబుతున్నారు.
క్రికెటర్లు ఈ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టడంతో, అది ఒక ఆమోదయోగ్యమైన ప్రణాళికగా కనిపించి, మరింత మంది ఆ ఫిర్యాదులలో భాగమయ్యారని విచారణలో తేలింది.
వివరాలు
పోలీస్ కస్టడీలో భూపేంద్రసింగ్
క్రికెటర్ల పేరు వాడుకొని ప్రజలను ఆకర్షించినట్లు పోలీసులు చెబుతున్నారు.
భూపేంద్రసింగ్ కంపెనీలో పెట్టుబడి పెట్టిన ప్రజలు చివరికి మోసపోయి, పెట్టిన మొత్తాన్ని కూడా తిరిగి పొందలేకపోయారని అంటున్నారు.
ప్రస్తుతం భూపేంద్రసింగ్ పోలీస్ కస్టడీలో ఉన్నాడు. అతని వద్ద నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా నలుగురు క్రికెటర్లకు నోటీసులు పంపారు.
శుభ్ మన్ గిల్ ప్రస్తుతం ఆస్ట్రేలియా టూర్‌లో ఉండగా, భారత్‌కు వచ్చిన వెంటనే విచారణకు హాజరవుతారని భావిస్తున్నారు.