Loading...
India Vs Zimbabwe: రెండో వన్డేలోనూ అదే దూకుడు...జింబాబ్యేపై టీమిండియా ఘనవిజయం
రెండో వన్డేలోనూ అదే దూకుడు...జింబాబ్యేపై టీమిండియా ఘనవిజయం

India Vs Zimbabwe: రెండో వన్డేలోనూ అదే దూకుడు...జింబాబ్యేపై టీమిండియా ఘనవిజయం

వ్రాసిన వారు Balachander Sharma
Oct 26, 2026
09:16 am

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు జింబాబ్వేపై మరోసారి తన ఆధిపత్యాన్ని చాటుకుంది. రెండో వన్డేలో బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి 121 పరుగుల భారీ విజయాన్ని అందుకుంది. మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (126), ఆల్‌రౌండర్ దీప్తి శర్మ (106 నాటౌట్) శతకాలతో చెలరేగగా.. యువ స్పిన్నర్ వైష్ణవి శర్మ (4/39) బంతితో ప్రత్యర్థిని దెబ్బతీసింది. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను భారత్ మరో మ్యాచ్ మిగిలుండగానే 2-0తో సొంతం చేసుకుంది. ఇప్పటికే టీ20 సిరీస్‌ను 3-0తో క్లీన్‌స్వీప్ చేసిన మంధాన సేన.. వన్డేల్లోనూ అదే జోరును కొనసాగిస్తోంది.

Details

భారత్‌కు భారీ స్కోరు.. శతకాలతో హర్మన్, దీప్తి మెరుపులు

టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 328 పరుగులు సాధించింది.

అయితే ఇన్నింగ్స్ ఆరంభంలోనే కెప్టెన్ స్మృతి మంధాన (0), షఫాలీ వర్మ (8) వికెట్లు కోల్పోవడంతో జట్టు ఒత్తిడిలో పడింది. ఈ దశలో ప్రతీకా రావల్ (61), హర్మన్‌ప్రీత్ కౌర్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. మూడో వికెట్‌కు 124 పరుగులు జోడించి జట్టుకు గట్టి పునాది వేశారు.

ప్రతీకా ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన దీప్తి శర్మ.. హర్మన్‌ప్రీత్‌తో కలిసి జింబాబ్వే బౌలర్లపై విరుచుకుపడింది. హర్మన్‌ప్రీత్ 121 బంతుల్లో 15 ఫోర్లతో 126 పరుగులు చేయగా..

దీప్తి 86 బంతుల్లో 15 ఫోర్లతో 106 పరుగులు చేసి అజేయంగా నిలిచింది.

Details

భారత బౌలర్ల దెబ్బకు జింబాబ్వే విలవిల

329 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే 48.5 ఓవర్లలో 207 పరుగులకే ఆలౌటైంది.

ముపచిక్వ (49), టిరిపానో (46), బిజా (34) మాత్రమే చెప్పుకోదగ్గ స్కోర్లు చేశారు. ఒక దశలో 104/1తో మెరుగ్గా కనిపించిన జింబాబ్వే.. ఆ తర్వాత భారత బౌలర్ల ధాటికి వరుసగా వికెట్లు కోల్పోయింది.

వైష్ణవి శర్మ 4 వికెట్లు తీయగా, దీప్తి శర్మ 3 వికెట్లతో సత్తా చాటింది. హర్మన్‌ప్రీత్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.

ఈ విజయంతో భారత్ తన ఆల్‌రౌండ్‌ బలాన్ని మరోసారి నిరూపించుకుంది. బుధవారం జరిగే చివరి వన్డేలోనూ గెలిచి సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలనే లక్ష్యంతో బరిలోకి దిగనుంది.

ADVERTISEMENT