Smriti Mandhana: జింబాబ్వేతో రెండో వన్డేలో డకౌట్.. కెప్టెన్‌గా స్మృతి మందాన ఖాతాలో చెత్త రికార్డు..!
ఈ వార్తాకథనం ఏంటి
జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధాన డకౌట్‌గా వెనుదిరిగింది. కేవలం రెండు బంతులు మాత్రమే ఎదుర్కొన్న ఆమె..నోమ్వెలో సిబాండా బౌలింగ్‌లో షాట్ ఆడేందుకు ప్రయత్నించి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరింది. దీంతో మందాన ఖాతాలో ఓ అనవసర రికార్డు చేరింది. మహిళల వన్డే క్రికెట్‌లో భారత ఓపెనర్‌గా అత్యధికసార్లు డకౌట్ అయిన ఆటగాళ్ల జాబితాలో ఆమె మూడో స్థానానికి చేరుకుంది. ఇప్పటివరకు మందాన ఐదుసార్లు డకౌట్ అయింది. ఈ జాబితాలో జయ శర్మ తొమ్మిది డకౌట్లతో తొలి స్థానంలో ఉండగా..జెమీమా రోడ్రిగ్స్ ఆరుసార్లు డకౌట్ అయి రెండో స్థానంలో కొనసాగుతోంది. మందానతో పాటు అంజు జైన్, పూనమ్ రౌత్ కూడా ఓపెనర్లుగా ఐదుసార్లు డకౌట్ అయ్యారు.
వివరాలు
కెప్టెన్‌గా తొలి పూర్తి స్థాయి సిరీస్
అనఘా చోప్రా నాలుగుసార్లు డకౌట్‌గా వెనుదిరిగింది.
ఇలా భారత మహిళల క్రికెట్‌లో ఓపెనర్లుగా ఆడిన ఆటగాళ్ల డకౌట్ల జాబితాలో మందాన చోటు సంపాదించడం అభిమానులను నిరాశకు గురిచేసింది.
హర్మన్‌ప్రీత్ కౌర్ తర్వాత ఈ నెలలో స్మృతి మందాన భారత మహిళల జట్టు పూర్తి స్థాయి కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టింది.
జింబాబ్వేతో జరుగుతున్న సిరీస్ ఆమెకు కెప్టెన్‌గా తొలి పూర్తి స్థాయి సిరీస్.
అయితే, నాయకత్వ బాధ్యతలు చేపట్టిన తర్వాత బ్యాటర్‌గా మాత్రం ఆమె ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది.
రెండో వన్డేలో డకౌట్ కావడం ఆమె వ్యక్తిగత ప్రదర్శనపై చర్చకు దారితీసింది.
వివరాలు
టీ20లు, తొలి వన్డేలోనూ పెద్దగా ప్రభావం చూపని మందాన
జింబాబ్వేతో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో స్మృతి మందాన రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 56 పరుగులు చేసింది.
ఆ తర్వాత జరిగిన తొలి వన్డేలోనూ ఆమె పెద్దగా రాణించలేకపోయింది. 34 బంతులు ఎదుర్కొని 32 పరుగులు చేసి వెనుదిరిగింది.
ఇప్పుడు రెండో వన్డేలో ఒక్క పరుగు కూడా చేయకుండానే ఔటవడంతో ఆమె ప్రదర్శనపై అంచనాలు మరింత పెరిగాయి.
భారత జట్టులో సీనియర్ ఓపెనర్‌గా కొనసాగుతున్న మందానపై భారీ అంచనాలు ఉన్నాయి.
మరోవైపు, కెప్టెన్‌గా కొత్త బాధ్యతలను కూడా నిర్వహించాల్సి ఉంది.
ఈ నేపథ్యంలో రానున్న మ్యాచ్‌ల్లో ఆమె బ్యాటింగ్‌లో తిరిగి పుంజుకుంటుందా? జట్టుకు కీలక పరుగులు అందిస్తుందా? అనేది ఆసక్తికరంగా మారింది.