IND vs PAK: PCB డిమాండ్లను తిరస్కరించిన ICC!
ఈ వార్తాకథనం ఏంటి
2026 టీ20 ప్రపంచకప్‌లో భారత్-పాకిస్తాన్ మ్యాచ్ అంశం చుట్టూ వివాదం ముదిరింది. పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB) ప్రతిపాదించిన కొన్ని కీలక డిమాండ్లను ఐసీసీ తిరస్కరించినట్లు సమాచారం. దీంతో ఈ వ్యవహారం పాకిస్తాన్ ప్రభుత్వ స్థాయికి చేరగా, తుది నిర్ణయం కోసం ఎదురు చూపులు కొనసాగుతున్నాయి. లాహోర్‌లో జరిగిన సమావేశంలో ఐసీసీతో పాటు Pakistan Cricket Board (PCB), Bangladesh Cricket Board (BCB) ప్రతినిధులు ఈ అంశంపై చర్చలు జరిపారు. ఈ సందర్భంగా PCB తన వైఖరిని పునఃపరిశీలించాలని ఐసీసీ సూచించినట్లు తెలుస్తోంది. PCB చైర్మన్ మొహ్సిన్ నఖ్వీ ఈ విషయంపై పాకిస్తాన్ ప్రధాని షాబాజ్ షరీఫ్‌తో భేటీ అయి తుది నిర్ణయం తీసుకునే అవకాశముందని సమాచారం.
వివరాలు
PCB ప్రతిపాదనలకు ఐసీసీ ఆమోదం తెలపలేదని వార్తలు
ఈ వివాదానికి మూలంగా PCB, BCBలు ప్రతిపాదించిన కొన్ని అంశాలే కారణమని తెలుస్తోంది. భారత్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లను మళ్లీ ప్రారంభించడంతో పాటు భారత్-పాకిస్తాన్-బంగ్లాదేశ్ మధ్య ట్రై సిరీస్ నిర్వహించాలని PCB, BCBలు కోరాయి. అయితే ఈ ప్రతిపాదనలకు ఐసీసీ ఆమోదం తెలపలేదని వార్తలు వినిపిస్తున్నాయి. ద్వైపాక్షిక సిరీస్‌లపై నిర్ణయం తీసుకునే అధికారం ఆయా దేశాల క్రికెట్ బోర్డులు, ప్రభుత్వాలదేనని ఐసీసీ స్పష్టం చేసినట్లు సమాచారం. ఇదిలా ఉండగా, సెప్టెంబర్‌లో భారత్-బంగ్లాదేశ్ మధ్య జరగాల్సిన సిరీస్ కూడా అనిశ్చితిలో పడింది.
వివరాలు
భారత్-పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు
ఈ పరిణామాల నేపథ్యంలో ఫిబ్రవరి 15న కొలంబోలో జరగాల్సిన భారత్-పాకిస్తాన్ గ్రూప్ మ్యాచ్ జరిగే అవకాశాలు కనిపించడం లేదు. ఈ మ్యాచ్ నుంచి తప్పుకుంటామని పాకిస్తాన్ ఇప్పటికే ప్రకటించినట్లు వార్తలు రావడంతో టోర్నమెంట్ సన్నాహాల్లో అనిశ్చితి నెలకొంది. బంగ్లాదేశ్‌కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ వివాదం చివరకు ఎలా ముగుస్తుందో, భారత్-పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుందా లేదా అన్న దానిపై క్రికెట్ అభిమానుల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.