IND VS ZIM: టీమిండియాకు కఠిన సవాల్.. జింబాబ్వేతో సూపర్-8 మ్యాచ్ నేడు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా కీలక దశలోకి అడుగుపెట్టింది. సూపర్-8 దశలో రెండో మ్యాచ్‌గా గురువారం జింబాబ్వేతో భారత్ తలపడనుంది. ప్రత్యర్థిపై గెలవడం అంత కష్టమైన పని కాకపోయినా, మొదటి సూపర్-8 మ్యాచ్‌లో 76 పరుగుల భారీ తేడాతో ఓడిపోవడంతో భారత జట్టు నెట్ రన్‌రేట్ (-3.80) తీవ్రంగా పడిపోయింది. అందుకే కేవలం విజయం సరిపోదు, భారీ గెలుపే ఇప్పుడు లక్ష్యం. సెమీఫైనల్ అవకాశాలు సజీవంగా ఉంచాలంటే తన చివరి సూపర్ 8 (వెస్టిండీస్‌తో) పోరులోనూ టీమ్‌ఇండియా మంచి విజయం సాధించాల్సి రావొచ్చు. ఇప్పటికే ఒక్కో మ్యాచ్ గెలిచిన దక్షిణాఫ్రికా (3.800), వెస్టిండీస్ (5.350) గ్రూప్-1లో మెరుగైన రన్‌రేట్‌తో ముందంజలో ఉన్నాయి. కాబట్టి టాప్-2లో స్థానం సంపాదించాలంటే భారత్ సమష్టిగా మెరుగైన ప్రదర్శన చేయాల్సిందే.
వివరాలు
అభిషేక్ పుంజుకునేనా?
ప్రస్తుతం భారత జట్టు ఎదుర్కొంటున్న ఇబ్బందులకు ప్రధాన కారణం బ్యాటింగ్ లోపాలే. గ్రూప్ దశలో ఏదోలా అగ్రస్థానంలో నిలిచిన టీమ్‌ఇండియా,సూపర్-8 తొలి మ్యాచ్‌లో మాత్రం పూర్తిగా విఫలమైంది. ముఖ్యంగా దక్షిణాఫ్రికాపై చాలా మంది బ్యాటర్లు పరిస్థితులకు తగిన విధంగా ఆడకుండా, నిర్లక్ష్య షాట్లతో వికెట్లు కోల్పోయారు. టాప్ ఆర్డర్‌లో అభిషేక్ శర్మ వైఫల్యం జట్టుకు పెద్ద దెబ్బగా మారింది.ఇప్పటివరకు నాలుగు మ్యాచ్‌ల్లో అతను కేవలం 15 పరుగులే చేశాడు. సగటు 3.75 మాత్రమే. అందులో మూడు డకౌట్లు ఉండటం ఆందోళనకరం.అతను తన సహజ శైలిలో దూకుడుగా ఆరంభం ఇచ్చి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
వివరాలు
ఇతర బ్యాట్సమెన్ సంగతి ఏంటి ?
ఈ కీలక సమయంలో అతను తిరిగి ఫామ్‌లోకి రావడం అత్యవసరం. అయితే అతను దూకుడును కొనసాగిస్తాడా? లేక నియంత్రణతో ఆడతాడా? అన్నది ఆసక్తికర అంశం. మరో ఓపెనర్ ఇషాన్ కిషన్ కూడా గత రెండు మ్యాచ్‌ల్లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అతను మళ్లీ జోరందుకోవాలని జట్టు భావిస్తోంది. అభిషేక్, ఇషాన్ ఇద్దరూ మంచి ఆరంభం ఇస్తే భారత జట్టుకు అర్ధం గెలుపే అని చెప్పొచ్చు. సూర్యకుమార్ యాదవ్ ఇప్పటివరకు 180 పరుగులు చేసినా,అతని స్ట్రైక్‌రేట్ 127 మాత్రమే ఉండటం పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. తిలక్ వర్మ కూడా వేగంగా పరుగులు చేయడంలో ఇబ్బంది పడుతున్నాడు. అతని స్ట్రైక్‌రేట్ 118 మాత్రమే.
వివరాలు
జట్టులో శాంసన్, అక్షర్!
శివమ్ దూబె, హార్దిక్ పాండ్య జోరు పెంచకపోయుంటే టోర్నీలో ఓ మాదిరి స్కోర్లు చేయడానికి కూడా టీమ్‌ఇండియా ఇబ్బందిపడేది కాబట్టి మొత్తం బ్యాటింగ్ విభాగం సమష్టిగా మెరుగైన ప్రదర్శన చేయాలి. ముఖ్యంగా స్పిన్నర్లను ధైర్యంగా ఎదుర్కోవడం కీలకం. తండ్రి అనారోగ్యం కారణంగా ఇంటికి వెళ్లిన రింకు సింగ్ మళ్లీ జట్టుతో కలిశాడు. అయినప్పటికీ ఈ మ్యాచ్‌లో అతనికి తుది జట్టులో చోటు దక్కే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. సంజు శాంసన్ ఆడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అతన్ని అభిషేక్‌తో కలిసి ఓపెనింగ్‌కు పంపవచ్చని సమాచారం. ఇషాన్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కు రావొచ్చు. పవర్‌ప్లే సమయంలో ఎడమచేతి బ్యాటర్లైన ఇషాన్, అభిషేక్, తిలక్‌లపై ఆఫ్‌స్పిన్నర్లను ప్రయోగిస్తూ ప్రత్యర్థి జట్లు భారత్‌ను ఇబ్బంది పెట్టాయి.
వివరాలు
సుందర్ స్థానంలో అక్షర్
అందుకే కుడిచేతి బ్యాటర్ అయిన శాంసన్‌ను తీసుకోవడం ద్వారా ఆ వ్యూహాన్ని ఎదుర్కోవచ్చని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది. ఇక వాషింగ్టన్ సుందర్ స్థానంలో అక్షర్ పటేల్‌కు అవకాశం దక్కడం ఖాయమనే సంకేతాలు ఉన్నాయి. బౌలింగ్‌లో బుమ్రా అద్భుత ఫామ్‌లో ఉండటం భారత్‌కు పెద్ద బలంగా మారింది. అతనితో పాటు అర్ష్‌దీప్, హార్దిక్, వరుణ్ చక్రవర్తి, అక్షర్‌లతో కూడిన దాడిని ఎదుర్కోవడం జింబాబ్వేకు సవాలే అవుతుంది.
వివరాలు
జింబాబ్వేను తక్కువ అంచనా వేయొద్దు
తొలి సూపర్-8 మ్యాచ్‌లో వెస్టిండీస్ చేతిలో ఓడిపోయినప్పటికీ జింబాబ్వేను సులభ ప్రత్యర్థిగా చూడటం ప్రమాదకరం. గ్రూప్ దశలో ఆ జట్టు ఆస్ట్రేలియా, శ్రీలంకలకు షాక్ ఇచ్చి అజేయంగా నిలిచింది. కోల్పోయేదేమీ లేకుండా స్వేచ్ఛగా ఆడే జింబాబ్వే బ్యాటింగ్‌లో బెనెట్, కెప్టెన్ సికందర్ రజా, మరుమాని కీలకులు. బౌలింగ్‌లో ముజరబాని, ఎవాన్స్‌లు ప్రధాన బలాలు.
వివరాలు
పిచ్ పరిస్థితి ఎలా ఉంది?
మ్యాచ్ జరుగుతున్న చెపాక్ మైదానం సాధారణంగా స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది. కానీ ఈ ప్రపంచకప్‌లో మాత్రం ఇది బ్యాటర్లకు స్వర్గధామంగా మారింది. స్పిన్నర్లకు పెద్దగా సహకారం లభించలేదు. పేసర్లు కూడా ప్రభావం చూపడంలో ఇబ్బంది పడ్డారు. వికెట్లు తీయడం, పరుగులను నియంత్రించడం కష్టమైంది. ఇక్కడ అఫ్గానిస్థాన్‌పై 183 పరుగుల లక్ష్యాన్ని న్యూజిలాండ్ 17.5 ఓవర్లలోనే చేధించింది. అందువల్ల ఈ మ్యాచ్‌లో కూడా బ్యాటర్లకు అనుకూల పరిస్థితులే ఉండే అవకాశముంది. వర్షం ముప్పు మాత్రం లేదు.
వివరాలు
తుది జట్లు (అంచనా)
భారత్: అభిషేక్ శర్మ, సంజు శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్, తిలక్ వర్మ, దూబె, హార్దిక్, అక్షర్ పటేల్, అర్ష్‌దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా. జింబాబ్వే: మరుమాని, బెనెట్, మయర్స్, ర్యాన్ బర్ల్, సికందర్ రజా, మున్యోంగా, ముసెకివా, ఎవాన్స్, క్రీమర్, ముజరబాని, ఎంగరవ.