T20 World Cup: బ్యాటింగ్ బలహీనతలతో సూపర్-8లో భారత్.. సౌతాఫ్రికాను భారత్ ఎదుర్కోగలదా?
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో భారత్ వరుసగా నాలుగు విజయాలు సాధించి మంచి లయలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే లోతుగా పరిశీలిస్తే సూపర్-8దశకు ముందే పరిష్కరించాల్సిన కొన్ని కీలక లోపాలు బయటపడుతున్నాయి. ఈ టోర్నీలో 'ప్లేయర్ టు వాచ్'గా బరిలోకి దిగిన అభిషేక్ శర్మకు మాత్రం పరిస్థితులు అనుకూలంగా లేవు. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో డకౌట్ కావడం అతని ఫామ్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ప్రత్యర్థి జట్లు అతని టెక్నికల్ బలహీనతలను గుర్తించి స్పిన్ బౌలింగ్‌తో లక్ష్యంగా చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పవర్‌ప్లేలో స్పిన్నర్లకు అతను చిక్కిపోతున్నాడు. పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్లు ఈ లోపాన్ని సమర్థంగా వినియోగించుకున్నాయి. దక్షిణాఫ్రికాతో జరిగే కీలక పోరుకు ముందు అభిషేక్ తన టెక్నిక్‌తో పాటు ఆత్మవిశ్వాసాన్ని కూడా మెరుగుపరచుకోవాల్సిన అవసరం ఉంది.
Details
మిడిలార్డర్ బ్యాటర్లు రాణించాలి
ఇక మిడిల్ ఆర్డర్‌లో తిలక్ వర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ప్రదర్శన కూడా చర్చనీయాంశంగా మారింది. అమెరికాతో జరిగిన మ్యాచ్‌లో 84 పరుగులతో కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడిన సూర్యకుమార్ ఆ తర్వాత అదే జోరును కొనసాగించలేకపోయాడు. మూడు మ్యాచ్‌ల్లో 70 బంతుల్లో కేవలం 78 పరుగులే చేయడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు తిలక్ వర్మ ఈ సీజన్‌లో 120.45 స్ట్రైక్‌రేట్‌తోనే పరిమితమయ్యాడు. వీరిద్దరూ ముఖ్యంగా ఆఫ్‌స్పిన్నర్లకు ఇబ్బంది పడుతుండటం వల్ల మిడిల్ ఓవర్లలో భారత్ రన్‌రేట్ తగ్గుతోంది. అయితే జట్టుపై వస్తున్న విమర్శలను పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదని ఆల్‌రౌండర్ శివమ్ దూబే అభిప్రాయపడ్డాడు.
Details
జట్టు అవసరానికి అనుగుణంగా బాధ్యతలు తీసుకోవాలి
ఇది వరల్డ్ కప్ కావడంతో మ్యాచ్‌లు సులభం కావని, పరిస్థితులకు అనుగుణంగా తిలక్, సూర్యకుమార్ తమ ఆటను మార్చుకుంటారని విశ్వాసం వ్యక్తం చేశాడు. జట్టు అవసరానికి అనుగుణంగా వారు బాధ్యత తీసుకుంటారని, సూర్యకుమార్ యాదవ్ లాంటి ఆటగాడు జట్టును ఎక్కడికైనా తీసుకెళ్లగలడని దూబే పేర్కొన్నాడు. నాలుగు విజయాలు భారత్‌కు ఆత్మవిశ్వాసం ఇచ్చినా, మిడిల్ ఆర్డర్‌లో స్థిరత్వం లోపించడం, స్పిన్ బౌలింగ్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం వంటి అంశాలు సరిచేసుకుంటేనే సూపర్-8లో దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించే అవకాశం ఉంటుంది.