Loading...
INDW vs ENGW: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లాండ్‌పై 270 పరుగులతో ఘన విజయం
ఇంగ్లాండ్‌పై 270 పరుగులతో ఘన విజయం

INDW vs ENGW: లార్డ్స్‌లో చరిత్ర సృష్టించిన భారత మహిళలు.. ఇంగ్లాండ్‌పై 270 పరుగులతో ఘన విజయం

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 13, 2026
07:43 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత మహిళల క్రికెట్ జట్టు లార్డ్స్‌ మైదానంలో చరిత్ర సృష్టించింది. ప్రతిష్ఠాత్మక వేదికపై జరిగిన తొలి మహిళల టెస్టు మ్యాచ్‌లో టీమిండియా అద్భుత ప్రదర్శనతో ఇంగ్లాండ్‌ను 270 పరుగుల భారీ తేడాతో ఓడించింది. బ్యాటింగ్‌, బౌలింగ్‌ విభాగాల్లో సమష్టిగా రాణించిన భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ప్రత్యర్థిపై పూర్తి ఆధిపత్యం చాటింది. మొదటి ఇన్నింగ్స్‌లో భారత్‌ 285 పరుగులు చేయగా, ఇంగ్లాండ్‌ను 170 పరుగులకే కట్టడి చేసింది. ఆపై రెండో ఇన్నింగ్స్‌లో 341/7 వద్ద డిక్లేర్‌ చేసిన భారత్‌.. ఇంగ్లాండ్‌ ముందుకు 457 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ఆ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఆతిథ్య జట్టు 186 పరుగులకే ఆలౌటై పరాజయం పాలైంది.

వివరాలు 

ముందే డిసైడ్‌ అయిపోయింది..

మ్యాచ్‌ మూడో రోజు ముగిసే సమయానికే భారత జట్టు విజయానికి బలమైన పునాది పడింది.

నాలుగో రోజు ఓవర్‌నైట్‌ స్కోరు 130/6తో బ్యాటింగ్‌ ప్రారంభించిన ఇంగ్లాండ్‌ తొలి సెషన్‌లోనే మిగిలిన వికెట్లను కోల్పోయింది.

అమీ జోన్స్‌ తన వ్యక్తిగత స్కోరుకు మరో రెండు పరుగులు మాత్రమే జోడించి 54 పరుగుల వద్ద ఔటైంది.

మ్యాడీ 24 పరుగులకే వెనుదిరిగింది. లోయర్‌ ఆర్డర్‌లో సోఫీ ఎకెల్‌స్టోన్‌ (50) అర్ధశతకంతో కొంతసేపు ప్రతిఘటించినా, ఓటమి వ్యత్యాసాన్ని తగ్గించడం మినహా జట్టును గెలిపించే స్థాయిలో ఇన్నింగ్స్‌ను కొనసాగించలేకపోయింది.

భారత బౌలర్లలో స్నేహ్‌ రాణా నాలుగు వికెట్లు పడగొట్టగా, సయాలీ రెండు, క్రాంతి గౌడ్‌ రెండు, దీప్తి శర్మ రెండు వికెట్లు సాధించి ఇంగ్లాండ్‌ బ్యాటింగ్‌ను కుప్పకూల్చారు.

వివరాలు 

సచిన్‌, జై షా ప్రత్యేక ఆకర్షణ

లార్డ్స్‌లో భారత మహిళల తొలి టెస్టు మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు క్రికెట్‌ దిగ్గజం సచిన్‌ టెండూల్కర్‌ హాజరయ్యారు.

ఆయనతో పాటు ఐసీసీ ఛైర్మన్‌ జై షా కూడా స్టేడియంలో మ్యాచ్‌ను వీక్షించారు.

ఈ టెస్టు మ్యాచ్‌తో ఇంగ్లాండ్‌ క్రికెటర్లు టామీ బౌమౌంట్‌, హీథర్‌ నైట్‌ల అంతర్జాతీయ కెరీర్‌కు తెరపడింది.

ఇప్పటికే రిటైర్మెంట్‌ను ప్రకటించిన ఈ ఇద్దరూ తమ చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను లార్డ్స్‌ వేదికగానే ఆడారు.

ADVERTISEMENT

వివరాలు 

యస్తికా సెంచరీ.. క్రాంతి గౌడ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్

లార్డ్స్‌ వేదికగా జరిగిన ఈ చారిత్రక టెస్టులో భారత వికెట్‌కీపర్‌ బ్యాటర్‌ యస్తికా భాటియా 113 పరుగులతో అద్భుత సెంచరీ నమోదు చేసింది.

మరోవైపు స్టార్‌ ఓపెనర్‌ స్మృతి మంధాన రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ అర్ధశతకాలతో జట్టు విజయానికి కీలకంగా నిలిచింది.

బౌలింగ్‌లో క్రాంతి గౌడ్‌ తొలి ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు పడగొట్టి ఇంగ్లాండ్‌ను భారీగా దెబ్బతీసింది.

ఆమె ఆల్‌రౌండ్‌ ప్రభావవంతమైన ప్రదర్శనకు గుర్తింపుగా 'ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌' అవార్డు అందుకుంది.

సెంచరీ చేసిన యస్తికా భాటియాతో పాటు క్రాంతి గౌడ్‌ కూడా లార్డ్స్‌ ఆనర్స్‌ బోర్డులో తన పేరును లిఖించుకుని అరుదైన ఘనతను సొంతం చేసుకుంది.

ADVERTISEMENT