World Under-20 Athletics: భారత యువ స్ప్రింటర్ సంచలనం.. జాతీయ రికార్డును బద్దలుకొట్టిన అష్పాక్
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ అథ్లెటిక్స్ అండర్-20 (యూ20) ఛాంపియన్‌షిప్స్‌లో భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నారు. అమెరికాలోని యూజీన్‌లో జరుగుతున్న ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీలో స్ప్రింటర్ మహమ్మద్ అష్ఫాక్ జాతీయ రికార్డును బద్దలు కొట్టి సెమీఫైనల్‌కు అర్హత సాధించగా, హైజంపర్ బసంత్ ఫైనల్‌లోకి దూసుకెళ్లి భారత శిబిరంలో ఆనందాన్ని నింపాడు.
వివరాలు
400 మీటర్లలో అష్ఫాక్ మెరుపు
పురుషుల 400 మీటర్ల హీట్స్‌లో మహమ్మద్ అష్ఫాక్ అద్భుత పరుగుతో అందరినీ ఆకట్టుకున్నాడు.
అతడు రేసును కేవలం 45.81 సెకన్లలో పూర్తి చేసి తన పేరిటే ఉన్న 46.05 సెకన్ల భారత అండర్-20 జాతీయ రికార్డును బద్దలు కొట్టాడు.
తన హీట్‌లో రెండో స్థానంలో నిలిచినప్పటికీ, అత్యుత్తమ టైమింగ్ ఆధారంగా సెమీఫైనల్‌కు అర్హత సాధించాడు.
అంతేకాదు మొత్తం క్వాలిఫయర్స్‌లో పాల్గొన్న అథ్లెట్లలో 'నాలుగో అత్యుత్తమ సమయాన్ని' నమోదు చేయడం మరో విశేషం.
వివరాలు
హైజంప్‌లో బసంత్ ఫైనల్ బెర్త్
అష్ఫాక్ విజయంతో వచ్చిన ఉత్సాహం కొనసాగుతుండగానే, ఫీల్డ్ ఈవెంట్స్‌లోనూ భారత్‌కు మరో శుభవార్త అందింది.
పురుషుల హైజంప్ క్వాలిఫికేషన్‌లో యువ అథ్లెట్ బసంత్ ఫైనల్‌కు అర్హత సాధించాడు. బసంత్ 2.00 మీ., 2.05 మీ., 2.10 మీటర్ల ఎత్తులను తొలి ప్రయత్నంలోనే విజయవంతంగా దాటాడు.
అనంతరం 2.14 మీటర్ల ఎత్తును రెండో ప్రయత్నంలో క్లియర్ చేసి ఫైనల్‌లో తన స్థానాన్ని ఖాయం చేసుకున్నాడు.
వివరాలు
భారత శిబిరంలో ఆనందం
టోర్నీ ప్రారంభ దశలోనే ఇద్దరు భారత యువ అథ్లెట్లు అద్భుత ప్రదర్శన చేయడంతో భారత క్రీడా వర్గాల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
సెమీఫైనల్‌లో కూడా ఇదే జోరును కొనసాగించి మహమ్మద్ అష్ఫాక్ పతకం దిశగా అడుగులు వేయాలని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
అలాగే ఫైనల్‌లో బసంత్ కూడా మెరుగైన ప్రదర్శన చేసి భారత్‌కు మరో విజయాన్ని అందించాలని అందరూ ఎదురుచూస్తున్నారు.