IPL : ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 83 వేల కోట్లు
ఐపీఎల్(IPL) మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 10 బిలియన్ల డాలర్ల బ్రాండ్ విలువను దాటి డెకాకార్న్ హోదాను దక్కించుకుంది. ప్రస్తుతం ఐపీఎల్ బ్రాండ్ విలువ 10.7 బిలియన్ డాలర్లు (సూమారు రూ.83,353 కోట్లు)తో సరికొత్త రికార్డు సృష్టించింది. 2022 పోలిస్తే ఆ విలువ 28 శాతం పెరగడం విశేషం. ఐపీఎల్ ఆరంభమైన 2008తో పోలిస్తే ఏకంగా 433శాతం వృద్ధిని సాధించింది. బ్రాండ్ విలువను లెక్కించే 'బ్రాండ్ ఫినాన్స్ రివీల్స్' ఈ నివేదికను వెల్లడించింది. మీడియా హక్కుల కింద రూ.48,390 కోట్లు రావడం, రెండు ఫ్రాంఛైజీలు కొత్తగా చేరడంతో బ్రాండ్ విలువ పెరిగిందని నివేదిక స్పష్టం చేసింది.
అత్యంత ఖరీదైన జట్టుగా ముంబై ఇండియన్స్
ఫ్రాంచేజీల విషయానికొస్తే ఐపీఎల్‌లో మోస్ట్ సక్సెస్ ఫుల్ టీమ్ అయిన ముంబయి ఇండియన్స్ అత్యంత ఖరీదైన జట్టుగా నిలిచింది. ముంబయి ఇండియన్స్ రూ.725 కోట్లు, చెన్నై సూపర్ కింగ్స్ రూ.675 కోట్లు, కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.655 కోట్లు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రూ.581 కోట్లు వరుసగా తొలి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. 15 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ చెరో ఐదు సార్లు టైటిల్స్ గెలిచాయి. కోల్‌కతా నైట్‌రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్(డెక్కన్ చార్జర్స్ 2009) రెండేసి సార్లు ఛాంపియన్‌గా నిలిచాయి.