Loading...
Jos Buttler: టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత.. రోహిత్ శర్మను అధిగమించిన జోస్ బట్లర్
టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత.. రోహిత్ శర్మను అధిగమించిన జోస్ బట్లర్

Jos Buttler: టీ20 క్రికెట్‌లో అరుదైన ఘనత.. రోహిత్ శర్మను అధిగమించిన జోస్ బట్లర్

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 16, 2026
12:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో ఇంగ్లండ్ స్టార్ బ్యాటర్ జోస్ బట్లర్ సరికొత్త మైలురాయిని అందుకున్నాడు. పురుషుల టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో టీమిండియా మాజీ కెప్టెన్ రోహిత్ శర్మను వెనక్కి నెట్టి రెండో స్థానానికి చేరుకున్నాడు. సౌతాంప్టన్ వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో బట్లర్ ఈ ఘనత సాధించాడు. ఈ మ్యాచ్‌కు ముందు బట్లర్ ఖాతాలో 4,212 పరుగులు ఉన్నాయి. రోహిత్ శర్మ 4,231 పరుగుల రికార్డును అధిగమించాలంటే అతనికి మరో 20 పరుగులు అవసరమయ్యాయి. అయితే శ్రీలంక బౌలర్లపై ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన బట్లర్.. కేవలం 44 బంతుల్లోనే 8 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో 80 పరుగులు చేశాడు.

వివరాలు 

బట్లర్ ఖాతాలో 4,292 పరుగులు

దీంతో రోహిత్ రికార్డును అధిగమించి టీ20 క్రికెట్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.

శ్రీలంకపై ఆడిన ఈ ఇన్నింగ్స్‌తో బట్లర్ అంతర్జాతీయ టీ20ల్లో తన మొత్తం పరుగుల సంఖ్యను 4,292కి పెంచుకున్నాడు.

ఇప్పటివరకు 161 మ్యాచ్‌లు ఆడిన అతను 34.33 సగటుతో ఈ పరుగులు సాధించాడు.

ఇందులో 2 సెంచరీలు,29 అర్ధ సెంచరీలు ఉన్నాయి.ఈ జాబితాలో పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం 4,596 పరుగులతో అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

మరోవైపు,బట్లర్ రెండో స్థానానికి చేరుకోవడంతో 159 మ్యాచ్‌ల్లో 4,231పరుగులు చేసిన రోహిత్ శర్మ మూడో స్థానానికి పడిపోయాడు.

గతంలో టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీని కూడా బట్లర్ అధిగమించిన విషయం తెలిసిందే.

వివరాలు 

ఇంగ్లండ్ బ్యాటర్ల పరుగుల సునామీ

శ్రీలంకతో జరిగిన ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ బ్యాటర్లు భారీ స్కోరు సాధించారు. బట్లర్‌తో పాటు యువ బ్యాటర్ హ్యారీ బ్రూక్ కూడా అద్భుతంగా రాణించాడు.

బ్రూక్ కేవలం 49 బంతుల్లోనే 114 పరుగులతో అజేయ శతకం నమోదు చేశాడు. వీరిద్దరూ కలిసి రెండో వికెట్‌కు 128 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

దీంతో ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 254 పరుగుల భారీ స్కోరు చేసింది.

అనంతరం లక్ష్య ఛేదనలో శ్రీలంక బ్యాటర్లు తడబడటంతో ఇంగ్లండ్ 119 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.

టీ20 ఫార్మాట్‌లో శ్రీలంకపై ఇంగ్లండ్‌కు ఇది వరుసగా 13వ విజయం కావడం విశేషం.

ADVERTISEMENT