LOADING...
Mustafizur Rahman: ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌కు ఉద్వాసన.. టీ20 వరల్డ్‌కప్ వేదికలపై బంగ్లా అభ్యంతరం
ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌కు ఉద్వాసన.. టీ20 వరల్డ్‌కప్ వేదికలపై బంగ్లా అభ్యంతరం

Mustafizur Rahman: ఐపీఎల్‌ నుంచి ముస్తాఫిజుర్‌కు ఉద్వాసన.. టీ20 వరల్డ్‌కప్ వేదికలపై బంగ్లా అభ్యంతరం

వ్రాసిన వారు Jayachandra Akuri
Jan 04, 2026
10:25 am

ఈ వార్తాకథనం ఏంటి

బీసీసీఐ ఆదేశాల నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెటర్ ముస్తాఫిజుర్ రెహమన్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు నుంచి రిలీజ్ చేయడంతో ఈ పరిణామం అంతర్జాతీయ స్థాయిలో చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయంపై ఆలోచిస్తున్నట్లు సమాచారం. భారత్‌లో జరగనున్న 2026టీ20 ప్రపంచకప్‌లో బంగ్లాదేశ్ జట్టు ఆడాల్సిన మ్యాచ్‌ల వేదికలను మార్చాలని ఐసీసీని సంప్రదించాలని బీసీబీ భావిస్తోంది. భారత్-బంగ్లాదేశ్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ, మ్యాచ్‌ల వేదికల మార్పు అంశాన్ని ఐసీసీ దృష్టికి తీసుకెళ్లనున్నట్లు బీసీబీ అధికారి ఒకరు తెలిపారు. ముస్తాఫిజుర్‌ను కేకేఆర్ విడుదల చేయడంపై తాము ఎలాంటి వ్యాఖ్య చేయలేమని, అది ఆయా పక్షాల అంతర్గత వ్యవహారమని ఆయన స్పష్టం చేశారు.

Details

ఐసీసీతో వీలైనంత త్వరగా చర్చలు జరుపుతాం

అయితే, టీ20 ప్రపంచకప్ ఐసీసీ నిర్వహించే ఈవెంట్ కావడంతో, టోర్నీకి సంబంధించిన అన్ని అంశాలపై ఐసీసీతో వీలైనంత త్వరగా చర్చలు జరుపుతామని చెప్పారు. గతంలో 2025 ఛాంపియన్స్ ట్రోఫీ కోసం పాకిస్థాన్‌కు వెళ్లి ఆడేందుకు టీమిండియా నిరాకరించిన అంశాన్ని కూడా ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అన్ని పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. ఫిబ్రవరి 7 నుంచి ప్రారంభం కానున్న టీ20 ప్రపంచకప్‌కు భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న సంగతి తెలిసిందే. గ్రూప్ దశలో బంగ్లాదేశ్ ఆడాల్సిన నాలుగు మ్యాచ్‌లను భారత్‌లోనే షెడ్యూల్ చేశారు.

Details

బంగ్లాదేశ్ లో ఉద్రిక్త పరిస్థితులు

ఫిబ్రవరి 7న ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్‌తో, ఫిబ్రవరి 9న ఇటలీతో, ఫిబ్రవరి 14న ఇంగ్లాండ్‌తో అదే వేదికపై, ఫిబ్రవరి 17న ముంబయిలోని వాంఖడే స్టేడియంలో నేపాల్‌తో బంగ్లాదేశ్ జట్టు తలపడాల్సి ఉంది. ఇదిలా ఉండగా, బంగ్లాదేశ్‌లో హిందువులపై వరుస దాడులు జరగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ నేపథ్యంతోనే బంగ్లాదేశ్ ఆటగాడు ముస్తాఫిజుర్ రెహమన్‌ను ఐపీఎల్‌లో ఆడించడంపై భారత్‌లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఐపీఎల్ 2026 మినీ వేలంలో ముస్తాఫిజుర్‌ను కోల్‌కతా నైట్‌రైడర్స్ రూ.9.2 కోట్లకు కొనుగోలు చేసింది. అయితే, ఈ పరిస్థితులను పరిగణనలోకి తీసుకున్న బీసీసీఐ, ముస్తాఫిజుర్‌ను రిలీజ్ చేయాలని కేకేఆర్ ఫ్రాంఛైజీకి ఆదేశాలు జారీ చేసింది. దాంతో కోల్‌కతా నైట్‌రైడర్స్ అతడిని జట్టు నుంచి విడుదల చేసింది.

Advertisement