Loading...
Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. నీరూ ధండా ఖాతాలో మరో స్వర్ణ పతకం
ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. నీరూ ధండా ఖాతాలో మరో స్వర్ణ పతకం

Asian Games 2026: ఆసియా క్రీడల్లో భారత్ జోరు.. నీరూ ధండా ఖాతాలో మరో స్వర్ణ పతకం

వ్రాసిన వారు Sirish Praharaju
Sep 30, 2026
12:46 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఆసియా క్రీడల్లో భారత్‌కు బుధవారం పతకాల పంట పండుతోంది. భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శనతో వరుస విజయాలు అందుకుంటున్నారు. గంటల వ్యవధిలోనే మూడు స్వర్ణ పతకాలు సాధించి దేశానికి గర్వకారణంగా నిలిచారు. ఇప్పటికే ఆర్చరీ టీమ్ ఈవెంట్‌లో తెలుగమ్మాయిలు అదరగొట్టగా.. తాజాగా షూటర్ నీరూ ధండా మరోసారి తన సత్తా చాటింది. నీరూ ధండా వరుసగా రెండో రోజూ తన విజయ పరంపరను కొనసాగించింది. కైనాన్ చెనైతో కలిసి ట్రాప్ మిక్స్‌డ్ షూటింగ్ టీమ్ విభాగంలో బరిలోకి దిగిన ఆమె అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పతకాన్ని సొంతం చేసుకుంది. దీంతో ఏషియాడ్‌లో భారత్ ఖాతాలో మరో పసిడి చేరింది.

వివరాలు 

బాక్సింగ్‌లో ప్రియా ఘంఘాస్‌కు కాంస్యం

అంతకుముందు ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణం సాధించి నీరూ ధండా ప్రత్యేక గుర్తింపు పొందింది.

ఆసియా క్రీడల ట్రాప్ ఈవెంట్‌లో స్వర్ణ పతకం గెలిచిన తొలి భారత మహిళా షూటర్‌గా ఆమె రికార్డు సృష్టించింది.

అంతేకాకుండా మహిళల ట్రాప్ షూటింగ్ టీమ్ ఈవెంట్‌లోనూ నీరూ రజత పతకాన్ని సాధించింది. ఈ టీమ్‌లో నీరూ ధండాతో పాటు ఆషిమా అహ్లావత్‌, మనీషా కీర్ ఉన్నారు.

మరోవైపు బాక్సింగ్‌లో భారత్‌కు మరో పతకం దక్కింది. మహిళల 60 కేజీల విభాగంలో పోటీపడిన ప్రియా ఘంఘాస్ కాంస్య పతకాన్ని సొంతం చేసుకుంది.

సెమీఫైనల్‌లో చైనాకు చెందిన యాంగ్‌తో తలపడిన ప్రియా.. ప్రత్యర్థి చేతిలో ఓటమి పాలైంది. దీంతో ఆమె సెమీఫైనల్‌తోనే తన ఏషియాడ్‌ ప్రయాణాన్ని ముగించాల్సి వచ్చింది.

వివరాలు 

లవ్లీనా ఫైనల్‌కు..

అయితే సెమీఫైనల్‌ చేరడం ద్వారా ఆమెకు కాంస్య పతకం ఖాయమైంది.

మహిళల బాక్సింగ్ 75 కేజీల విభాగంలో భారత్‌కు మరో పతకం ఖరారైంది.

ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బోర్గోహైన్ అద్భుత ప్రదర్శనతో ఫైనల్‌కు దూసుకెళ్లింది.

దీంతో ఆమెకు కనీసం రజత పతకం ఖాయమైంది. ఫైనల్‌లోనూ విజయం సాధిస్తే స్వర్ణ పతకం భారత్ ఖాతాలో చేరనుంది.

మొత్తంగా ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు షూటింగ్, ఆర్చరీ, బాక్సింగ్ విభాగాల్లో వరుసగా పతకాలు సాధిస్తూ దేశ పతకాల పట్టికను మరింత పటిష్ఠం చేస్తున్నారు.

ADVERTISEMENT