
ICC : టీ20లో నూతన పద్ధతి.. పవర్‌ప్లేకు ఇక బంతులే ప్రమాణం!
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 మ్యాచ్‌ల పట్ల అభిమానుల ఉత్సాహం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఫార్మాట్‌లో వర్షం ఆటకు ఆటంకం కలిగించినప్పుడు పవర్‌ప్లే ఓవర్లను ఎలా నిర్ణయించాలనే దానిపై గందరగోళం నెలకొనేది. ఇప్పటివరకు ఓవర్ల ప్రామాణికాన్ని ఆధారంగా తీసుకొని పవర్‌ప్లే గణన జరిగేది. కానీ తాజాగా ఐసీసీ ఈ విషయంలో నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. ఇకపై వర్షం కారణంగా ఓవర్లను తగ్గించినా, పవర్‌ప్లేను బంతుల ప్రామాణికం ఆధారంగా నిర్ణయించనున్నారు. ఉదాహరణకు, మ్యాచ్‌ను 5 ఓవర్లకు కుదిస్తే పవర్‌ప్లే 1.3 ఓవర్లకే పరిమితవుతుంది. గతంలో అయితే దీనిని 2 ఓవర్లుగా లెక్కించేవారు. అలాగే 6 ఓవర్లు అయితే 1.5, 7ఓవర్లు అయితే 2.1, 19 ఓవర్లు అయితే 5.4 ఓవర్ల పవర్‌ప్లే ఉంటుంది.
Details
వైడ్ నిబంధనలో మార్పులు
అంటే ఓవర్ల మధ్యలో కూడా పవర్‌ప్లే ముగిసినా ఎలాంటి ఇబ్బంది లేదని ఐసీసీ స్పష్టం చేసింది. పవర్‌ప్లే సమయంలో 30 గజాల సర్కిల్ వెలుపల కేవలం ఇద్దరు ఫీల్డర్లు మాత్రమే ఉండే నిబంధన యథావిధిగా కొనసాగుతుంది. వైడ్ బంతులపై కూడా ఐసీసీ కీలక మార్పులు చేసింది. ఇప్పటివరకు బ్యాటర్ ఆఫ్‌సైడ్‌కు కదిలినా, బంతి వైడ్ లైన్ దాటి వెళ్లితే అది వైడ్‌గా పరిగణించేది కాదు. కానీ తాజా మార్పు ప్రకారం బౌలర్ బంతిని విడుదల చేసే సమయంలో బ్యాటర్ కాళ్లు ఎక్కడ ఉన్నాయన్నదే ఆ బంతిని వైడ్‌గా పరిగణించాలా, వద్దా అన్న దానిపై నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఈనూతన వైడ్ నిబంధనను శ్రీలంక-బంగ్లాదేశ్ వన్డే సిరీస్(జూలై 2 నుంచి ప్రారంభం)నుంచే అమలులోకి తీసుకురానున్నారు.