
IND vs PAK: ఆర్థిక లాభాల కోసం భారత్-పాక్ మ్యాచ్‌లు వద్దు : అథర్టన్ కీలక వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
ఇప్పటి వరకు ఆర్థిక, దౌత్య కారణాల వల్ల ప్రతి ఐసీసీ టోర్నీలో భారత్-పాకిస్థాన్ (India vs Pakistan) మ్యాచ్ తప్పనిసరి అయ్యేది. అభిమానుల ఆసక్తి కూడా ఎప్పటికప్పుడు అధికంగానే ఉండేది. అయితే పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత్ ప్రభుత్వం పాకిస్థాన్‌తో ఎలాంటి సంబంధాలు పెట్టుకోకూడదని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అయినా ఏసీసీ నియమాల ప్రకారం ఆసియా కప్‌లో భారత జట్టు ఆడక తప్పలేదు. ఆ టోర్నీలో తొలి రెండు మ్యాచ్‌లలో వివాదాలు తలెత్తగా, ఫైనల్‌లో పాక్‌ను ఓడించి భారత్ విజేతగా నిలిచింది. ఇదే క్రమంలో మహిళల వన్డే ప్రపంచకప్‌లోనూ ఇరుజట్లు తలపడ్డాయి. ఈ నేపథ్యంలో ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైక్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
Details
పోటీలకు ముగింపు పలకాలి
ఆయన అభిప్రాయంలో ఇకపై ఐసీసీ షెడ్యూల్‌లో ప్రతిసారి భారత్-పాక్ మ్యాచ్‌లు పెట్టకూడదు. భారత్-పాక్ మ్యాచ్‌ల వెనక ఆర్థిక, దౌత్యపరమైన కారణాలున్నాయి. ఐసీసీ టోర్నమెంట్ల బ్రాడ్‌కాస్ట్ హక్కులు విపరీతమైన ఆదాయం తెస్తున్నాయి. 2023-27 సీజన్ హక్కుల విలువ సుమారు 3 బిలియన్ డాలర్లు. ద్వైపాక్షిక సిరీస్‌లు లేకపోవడంతో ఇరుజట్లు కేవలం ఐసీసీ ఈవెంట్లలోనే తలపడుతున్నాయి. ఐసీసీ బ్యాలెన్స్‌షీట్‌కు భారత్-పాక్ మ్యాచ్‌లే ప్రధాన ఆదారం. కానీ, ఇప్పుడు ఈ పోటీలకు ముగింపు పలకాల్సిన సమయం వచ్చింది. అభిమానుల్లో ఆసక్తి తగ్గిపోతోంది. ఒకప్పుడు క్రికెట్ దౌత్యానికి వేదికగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ఉద్రిక్తతలకు దారితీస్తోందని అథర్టన్ స్పష్టం చేశారు.