LOADING...
Pakistan Jersey: మరో వివాదంలో పాకిస్థాన్.. ఐఎస్ఐ గుర్తు పోలికలతో పాక్ జెర్సీ 
మరో వివాదంలో పాకిస్థాన్.. ఐఎస్ఐ గుర్తు పోలికలతో పాక్ జెర్సీ

Pakistan Jersey: మరో వివాదంలో పాకిస్థాన్.. ఐఎస్ఐ గుర్తు పోలికలతో పాక్ జెర్సీ 

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 03, 2026
10:06 am

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్‌కు ముందే పాకిస్తాన్ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) మరో వివాదంలో చిక్కుకుంది. ఇప్పటికే భారత్‌తో జరగాల్సిన టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ను ఆడబోమని ప్రకటించి తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న పాకిస్తాన్ తాజాగా తీసుకున్న మరో నిర్ణయంతో మళ్లీ చర్చకు దారి తీసింది. ఈ వివాదాల నడుమ పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు టీ20 ప్రపంచకప్ జెర్సీని విడుదల చేయగా, అదికూడా వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ జెర్సీలో 'మార్ఖోర్' అనే జంతువు ఫొటోను ముద్రించడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. మార్ఖోర్ పాకిస్తాన్ జాతీయ జంతువు కావడం గమనార్హం. ఇదే ఫొటోను పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐ కూడా ఉపయోగిస్తుండటం వివాదానికి మరింత దారితీసింది. దీంతో క్రికెట్‌కు సంబంధం లేని అంశాలను జెర్సీలో చేర్చడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Details

పాకిస్థాన్ జెర్సీ ఆవిష్కరణ

టీ20 ప్రపంచకప్ కోసం రూపొందించిన పాకిస్తాన్ జెర్సీ ప్రధానంగా ఆకుపచ్చ రంగులో ఉంది. అయితే మధ్యలో నల్లటి గుర్తులు, డిజైన్లు ఉండటంతో అభిమానులు సోషల్‌ మీడియాలో జెర్సీని ట్రోల్ చేస్తున్నారు. ఈ జెర్సీలో మార్ఖోర్ గ్రాఫిక్స్‌ను స్పష్టంగా చూపించేలా డిజైన్ చేశారు. పాకిస్తాన్ జెర్సీపై ఈ తరహా జంతు ప్రతీకను ముద్రించడం ఇదే తొలిసారి కావడం విశేషం. మార్ఖోర్ అనేది అడవి మేక జాతికి చెందిన జంతువు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అడవి మేకగా గుర్తింపు పొందింది. హిమాలయాలు, కారకోరం పర్వత శ్రేణుల్లోని ఎత్తైన ప్రాంతాల్లో ఇది ఎక్కువగా కనిపిస్తుంది. పాకిస్తాన్‌తో పాటు జమ్మూ-కాశ్మీర్, ఆఫ్ఘనిస్తాన్ ప్రాంతాల్లో కూడా మార్ఖోర్ కనిపిస్తుంది.

Details

పాకిస్థాన్ వివాదాస్పద నిర్ణయం

ఇదిలా ఉండగా, పాకిస్తాన్ క్రికెట్‌ జట్టు ఇప్పటికే శ్రీలంకకు చేరుకుంది. అక్కడే తమ టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌లను ఆడనుంది. అయితే భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను ఆడేందుకు పాకిస్తాన్ నిరాకరించడం క్రికెట్‌ ప్రపంచంలో సంచలనంగా మారింది. ఈ నిర్ణయం వల్ల అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ)కు లక్షలాది రూపాయల ఆదాయ నష్టం వాటిల్లే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐసీసీ పాకిస్తాన్‌కు హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారత్‌తో జరిగే లీగ్ మ్యాచ్‌ను బహిష్కరిస్తే పాకిస్తాన్ కఠినమైన శిక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుందని స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. టీ20 ప్రపంచకప్ ప్రారంభానికి ముందే పాకిస్తాన్ తీసుకుంటున్న వరుస నిర్ణయాలు క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.

Advertisement