T20 World Cup: టీ20 ప్రపంచ కప్'లో అమెరికాపై పాక్ విజయం
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ సత్తా చాటింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ అద్భుత బ్యాటింగ్‌తో జట్టు విజయానికి బాటలు వేసాడు. మంగళవారం జరిగిన గ్రూప్-ఎ మ్యాచ్‌లో పాక్ జట్టు 32 పరుగుల తేడాతో అమెరికాపై స్పష్టమైన ఆధిపత్యం చూపించింది. ఫర్హాన్ 41 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టును భారీ స్కోరుకు నడిపించాడు. అతడి ఇన్నింగ్స్‌లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లు ఉన్నాయి. మరోవైపు బాబర్ అజామ్ కూడా బాధ్యతాయుతంగా ఆడుతూ 32 బంతుల్లో 46పరుగులు సాధించాడు. ఈ ఇద్దరి సహకారంతో పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 190పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా జట్టుకు పాక్ బౌలర్లు గట్టి షాక్ ఇచ్చారు.ఉస్మాన్ తారిఖ్ మూడు వికెట్లు తీసి కీలకంగా నిలిచాడు.
వివరాలు
27బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసిన ఫర్హాన్
షాదాబ్ ఖాన్ రెండు వికెట్లతో దెబ్బతీశాడు. ఫలితంగా అమెరికా జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 158 పరుగులకే పరిమితమైంది.శుభమ్ రంజానే 30 బంతుల్లో 51 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన పాకిస్థాన్‌కు ఓపెనర్ ఫర్హాన్ ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశాడు. వరుసగా బౌండరీలు బాదుతూ స్కోరు వేగాన్ని పెంచాడు.సయిమ్ అయూబ్‌తో కలిసి తొలి వికెట్‌కు 51 పరుగులు జోడించాడు. ఆపై బాబర్‌తో మూడో వికెట్‌కు 81పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. ఫర్హాన్ కేవలం 27బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసి ఆకట్టుకున్నాడు. ప్రారంభంలో నెమ్మదిగా ఆడిన బాబర్ తర్వాత గేర్ మార్చి పరుగుల వర్షం కురిపించాడు.అయితే జోరు మీద ఉన్న సమయంలో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
వివరాలు
షాదాబ్ ఖాన్ వేగవంతమైన ఇన్నింగ్స్
16వ ఓవర్లో ఫర్హాన్ ఔట్ అయ్యే సరికి పాకిస్థాన్ స్కోరు 143కి చేరింది.అతడు నాలుగో వికెట్‌గా పెవిలియన్‌కు చేరాడు. చివరి దశలో పాక్ వరుసగా వికెట్లు కోల్పోయినా, షాదాబ్ ఖాన్ వేగవంతమైన ఇన్నింగ్స్‌తో స్కోరును మరింత పెంచాడు. 12 బంతుల్లో 30 పరుగులు చేసిన అతడు చివరి నాలుగు ఓవర్లలో 45 పరుగులు రాబట్టడంలో కీలక పాత్ర పోషించాడు. లక్ష్యాన్ని ఛేదించేందుకు అమెరికా చేసిన ప్రయత్నం పూర్తిగా ఫలించలేదు. శుభమ్ రంజానే,జహంగీర్,మిలింద్ కుమార్ పోరాటం చేసినప్పటికీ ఓటమి తేడాను తగ్గించడానికే పరిమితమైంది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన చేసిన సాహిబ్‌జాదా ఫర్హాన్‌కు 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డు దక్కింది.