Loading...
Parthiv Patel: నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. ఉచిత సలహాలు ఇవ్వకు: పార్థివ్‌ పటేల్
నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. ఉచిత సలహాలు ఇవ్వకు:పార్థివ్

Parthiv Patel: నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. ఉచిత సలహాలు ఇవ్వకు: పార్థివ్‌ పటేల్

వ్రాసిన వారు Sirish Praharaju
Oct 09, 2026
01:55 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత్‌లో క్రికెట్‌కు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. ప్రతిభావంతులైన ఆటగాళ్లకు ఇక్కడ కొదవ లేదు. ఒకేసారి ఎంతోమంది నైపుణ్యం ఉన్న క్రికెటర్లు అందుబాటులోకి వచ్చినప్పుడు జాతీయ జట్టు ఎంపిక సెలక్టర్లకు సవాలుగా మారుతుంది. జట్టు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని అత్యుత్తమ ఆటగాళ్లతో కూర్పును సిద్ధం చేయాల్సి ఉంటుంది. అయితే, సెలక్షన్‌ ప్రక్రియలో పారదర్శకత లేదంటూ పలుమార్లు విమర్శలు వినిపిస్తుంటాయి. ఈ నేపథ్యంలో టీమిండియా మాజీ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ పార్థివ్‌ పటేల్‌ తన కెరీర్‌లో ఎదురైన ఓ చేదు అనుభవాన్ని తాజాగా గుర్తు చేసుకున్నాడు. క్రికెట్‌ను పక్కనపెట్టి వ్యాపారం చేసుకోవాలంటూ ఓ సెలక్టర్‌ తనకు సలహా ఇచ్చాడని వెల్లడించాడు. ఆ మాటలకు తాను కూడా గట్టిగానే బదులిచ్చినట్లు తెలిపాడు.

వివరాలు 

చిన్న వయసులోనే అంతర్జాతీయ అరంగేట్రం

గుజరాత్‌కు చెందిన పార్థివ్‌ పటేల్‌ 2002లోనే భారత జట్టు తరఫున అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు.

అప్పటికి అతడి వయసు కేవలం 17ఏళ్ల 152 రోజులు మాత్రమే.

అయితే, మహేంద్ర సింగ్‌ ధోనీ రాకతో పార్థివ్‌కు అవకాశాలు తగ్గిపోయాయి. జట్టులో స్థానం కోల్పోతూ తిరిగి చోటు దక్కించుకోవాల్సిన పరిస్థితి ఎదురైంది.

2008లో శ్రీలంకతో జరిగిన సిరీస్‌ సందర్భంగా పార్థివ్‌ పటేల్‌ మళ్లీ భారత జట్టులోకి వచ్చాడు.

అయితే, ఆ తర్వాత మరోసారి నిరాశ ఎదురైంది. అయినప్పటికీ, అతడు ప్రయత్నాలు ఆపలేదు.

2009-10 దేశవాళీ సీజన్‌లో అద్భుతమైన ఫామ్‌ కనబరిచాడు.

దీంతో 2010లో అప్పటి సెలక్టర్‌ను సంప్రదించి జాతీయ జట్టులో తనకు అవకాశం ఉందా అని అడిగాడు. అయితే, అక్కడి నుంచి ఊహించని సమాధానం ఎదురైంది.

వివరాలు 

ఐదు వరుస ఇన్నింగ్స్‌ల్లో 500కు పైగా పరుగులు

భారత మాజీ క్రికెటర్‌ ఆకాశ్‌ చోప్రాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పార్థివ్‌ ఈ విషయాలను వెల్లడించాడు.

ప్రదర్శన సరిగా లేనప్పుడు జట్టు నుంచి తప్పించడం సహజమేనని తనకు తెలుసని చెప్పాడు.

అయితే, 2009-10 సీజన్‌లో ఫస్ట్‌క్లాస్‌ క్రికెట్‌లో వరుసగా ఐదు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 500కు పైగా పరుగులు సాధించినట్లు గుర్తు చేసుకున్నాడు.

ఆ సమయంలో అది రికార్డుగా నిలిచిందని పార్థివ్‌ పేర్కొన్నాడు. సచిన్‌ టెండుల్కర్‌, విరాట్‌ కోహ్లి,సునిల్‌ గావస్కర్‌ వంటి దిగ్గజాలు సైతం ఐదు వరుస ఇన్నింగ్స్‌ల్లో ఈ స్థాయిలో పరుగులు చేయలేదని వివరించాడు.

అదే సమయంలో భారత జట్టు ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లాల్సి ఉంది. దీంతో తన ప్రదర్శనను పరిగణనలోకి తీసుకుని అవకాశం కల్పిస్తారని పార్థివ్‌ ఆశించాడు.

ADVERTISEMENT

వివరాలు 

'శ్రమిస్తూనే ఉండు.. ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది'

ఈ క్రమంలో అప్పటి చీఫ్‌ సెలక్టర్‌ దిలీప్‌ వెంగ్‌సర్కార్‌కు ఫోన్‌ చేసి తన అవకాశాల గురించి ఆరా తీశాడు.

పార్థివ్‌ ప్రశ్నకు దిలీప్‌ వెంగ్‌సర్కార్‌ స్పందిస్తూ.. ఈసారి కూడా జట్టులో చోటు దక్కడం లేదని చెప్పినట్లు అతడు వెల్లడించాడు.

'దురదృష్టవశాత్తూ నీకు ఈసారి కూడా అవకాశం లేదు. నువ్వు మాత్రం శ్రమిస్తూనే ఉండు. ఏదో ఒక రోజు అవకాశం వస్తుంది' అని వెంగ్‌సర్కార్‌ బదులిచ్చినట్లు గుర్తు చేసుకున్నాడు.

అయితే, ఆ సమాధానంతో పార్థివ్‌ తన ప్రయత్నాలను ఆపలేదు.

2011 నుంచి ప్రతి దేశవాళీ సీజన్‌లోనూ నిలకడగా 700-800 పరుగులు సాధించినట్లు తెలిపాడు.

మంచి ప్రదర్శనతో జాతీయ జట్టులోకి తిరిగి రావాలన్న లక్ష్యంతో ముందుకు సాగినట్లు వివరించాడు.

ADVERTISEMENT

వివరాలు 

'గుజరాతీవి కదా.. వ్యాపారం చేసుకో'

ఆ తర్వాత సెలక్షన్‌ కమిటీ మారింది. దీంతో వెస్ట్‌ జోన్‌ నుంచి కొత్తగా సెలక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన వ్యక్తిని పార్థివ్‌ సంప్రదించాడు.

అయితే, ఈసారి కూడా అతడికి నిరుత్సాహపరిచే సమాధానమే ఎదురైంది. 'నీకు 27-28 ఏళ్లు ఉంటాయి కదా! నువ్వు గుజరాతీవి. ఏదైనా వ్యాపారం గురించి ఆలోచించు. బిజినెస్‌ చేసుకో' అని ఆ సెలక్టర్‌ సలహా ఇచ్చినట్లు పార్థివ్‌ వెల్లడించాడు.

క్రికెట్‌లో కొనసాగాలనే పట్టుదలతో ఉన్న తనకు ఆ మాటలు నిరాశ కలిగించాయని చెప్పాడు.

వివరాలు 

'సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. నిరాశపరచొద్దు'

సెలక్టర్‌ మాటలకు పార్థివ్‌ వెంటనే బదులిచ్చాడు. తనను జట్టులోకి ఎంపిక చేయడం ఇష్టం లేకపోతే ఆ నిర్ణయం తీసుకోవచ్చని, అయితే ఇలాంటి మాటలతో నిరాశపరచడం సరికాదని స్పష్టం చేశాడు.

'నీకు నన్ను సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌. అంతేగానీ ఇలా నిరాశపరచడం తగదు. నీ ఆలోచన నీది. పర్లేదు. రెండేళ్లు పదవిలో ఉంటావు కదా! నీ హయాంలోనే నేను రీఎంట్రీ ఇస్తా చూడు' అని సవాల్‌ విసిరినట్లు పార్థివ్‌ గుర్తు చేసుకున్నాడు.

వివరాలు 

'సెలక్ట్‌ చేయడం ఇష్టం లేకుంటే మానెయ్‌.. నిరాశపరచొద్దు'

తాను చెప్పినట్లుగానే తిరిగి భారత జట్టులోకి వచ్చానని తెలిపాడు.

సెలక్టర్‌ నిరుత్సాహపరిచినా తన లక్ష్యాన్ని వదులుకోలేదని, నిలకడైన ప్రదర్శనతో పునరాగమనం సాధించానని వివరించాడు.

కాగా, పార్థివ్‌ పటేల్‌ 2018లో టీమిండియా తరఫున తన చివరి మ్యాచ్‌ ఆడాడు.

కెరీర్‌లో ఎదురైన ఇలాంటి అనుభవాలను తాజాగా గుర్తు చేసుకుంటూ తన పట్టుదల, పోరాట స్ఫూర్తిని మరోసారి వెల్లడించాడు.

ADVERTISEMENT