Loading...
World Cup 2027 Format: 'హమ్మయ్య.. రెండో రౌండ్‌కు వెళ్తాం'.. పాక్‌పై పార్థివ్ పటేల్ సెటైర్లు
'హమ్మయ్య.. రెండో రౌండ్‌కు వెళ్తాం'.. పాక్‌పై పార్థివ్ పటేల్ సెటైర్లు

World Cup 2027 Format: 'హమ్మయ్య.. రెండో రౌండ్‌కు వెళ్తాం'.. పాక్‌పై పార్థివ్ పటేల్ సెటైర్లు

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 02, 2026
04:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

వన్డే ప్రపంచకప్‌ 2027 మెగా టోర్నీకి కౌంట్‌డౌన్ మొదలైంది. దక్షిణాఫ్రికా, నమీబియా, జింబాబ్వే సంయుక్తంగా ఆతిథ్యం ఇవ్వనున్న ఈ టోర్నీకి సంబంధించిన షెడ్యూల్‌ను అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా ప్రకటించింది. ఈసారి ప్రపంచకప్‌ ఫార్మాట్ గతంతో పోలిస్తే భిన్నంగా ఉండనుంది. మొత్తం 14 జట్లు పాల్గొనే ఈ టోర్నీ అక్టోబర్ 2న సూపర్ సిరీస్‌తో ప్రారంభమవుతుంది. ప్రధాన గ్రూప్‌ దశ అక్టోబర్ 7న మొదలవుతుంది. ఈ కొత్త ఫార్మాట్‌పై భారత మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ స్పందించారు. పాకిస్థాన్‌ జట్టును ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. 'ప్రపంచకప్‌ షెడ్యూల్‌, ఫార్మాట్‌ను చూసి తమ మైండ్‌సెట్‌కు అనుగుణంగా ఒక్కో జట్టు ఒక్కో రకంగా ఆలోచిస్తుంది.

వివరాలు

షెడ్యూల్‌ చూశాక కచ్చితంగా పాక్‌ సంతోషపడుతుంది

భారత్‌ తప్పనిసరిగా కనీసం సెమీస్‌ వరకైనా ఎలాంటి అడ్డంకులు లేకుండా చేరుకుంటామని అనుకుంటుంది.

అదే పాకిస్థాన్‌ ఆలోచన వేరేలా ఉంటుంది. 'మా జట్టు సూపర్-7కి కచ్చితంగా చేరుకుంటుంది.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూద్దాం' అనుకుంటుంది.

ఇప్పుడీ షెడ్యూల్‌ చూశాక కచ్చితంగా పాక్‌ సంతోషపడుతుంది. హమ్మయ్య.. తాము రెండో రౌండ్‌కు వెళ్తామని వారు భావిస్తారని పార్థివ్ పటేల్ వ్యాఖ్యానించారు.

ఇటీవల పాకిస్థాన్‌ జట్టు ప్రదర్శనను దృష్టిలో పెట్టుకుని పార్థివ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు తెలుస్తోంది.

వివరాలు

సెమీస్‌కు భారత్ సహా ఈ నాలుగు జట్లు: పార్థివ్

2027 వన్డే ప్రపంచకప్‌లో సెమీఫైనల్‌కు చేరే నాలుగు జట్లపైనా పార్థివ్ పటేల్ తన అంచనాను వెల్లడించారు.

భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లకు అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.

అదే సమయంలో డిఫెండింగ్ ఛాంపియన్‌ ఆస్ట్రేలియాకు ఈసారి కష్టాలు ఎదురుకావచ్చని అభిప్రాయపడ్డారు.

ADVERTISEMENT

వివరాలు

ప్రపంచకప్‌ ఫార్మాట్‌ ఎలా ఉంటుందంటే?

2027 వన్డే ప్రపంచకప్‌లో మొత్తం 14 జట్లు పాల్గొంటాయి. ఈసారి టోర్నీ మూడు దశల్లో సాగుతుంది. మొదట మూడు జట్లతో సూపర్ సిరీస్‌ నిర్వహిస్తారు.

2027 ప్రపంచకప్‌ క్వాలిఫయర్‌లో రెండో, మూడో, నాలుగో స్థానాల్లో నిలిచిన మూడు జట్లు సూపర్ సిరీస్‌లో రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో తలపడతాయి.

ఇందులో అగ్రస్థానంలో నిలిచిన జట్టు ప్రధాన గ్రూప్‌ దశకు అర్హత సాధిస్తుంది. ఆ తర్వాత ప్రధాన గ్రూప్‌ దశలో 12 జట్లు రెండు గ్రూపులుగా విడిపోతాయి.

ఒక్కో గ్రూప్‌లో ఆరు జట్లు ఉంటాయి. ప్రతి జట్టు తన గ్రూప్‌లోని మిగిలిన ఐదు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది.

ADVERTISEMENT

వివరాలు

సూపర్ 7కు అర్హత

రెండు గ్రూపుల్లోనూ టాప్‌-3లో నిలిచిన జట్లతో పాటు.. రెండు గ్రూపుల్లో నాలుగో స్థానాల్లో నిలిచిన జట్లలో మెరుగైన జట్టు సూపర్‌-7 దశకు చేరుకుంటుంది.

సూపర్‌-7 దశలో ఏడు జట్లు రౌండ్‌ రాబిన్‌ పద్ధతిలో ఆడతాయి. ప్రతి జట్టు మిగిలిన ఆరు జట్లతో ఒక్కో మ్యాచ్‌ ఆడుతుంది.

ఈ దశలో గ్రూప్‌ స్టేజ్‌లో సాధించిన పాయింట్లు కొనసాగవు. సూపర్‌-7లో టాప్‌-4లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్‌కు అర్హత సాధిస్తాయి.

సెమీఫైనల్‌లో సూపర్‌-7 పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నాలుగో స్థానంలో ఉన్న జట్టుతో, రెండో స్థానంలో ఉన్న జట్టు మూడో స్థానంలో ఉన్న జట్టుతో తలపడుతుంది.

సెమీఫైనల్స్‌లో విజయం సాధించిన రెండు జట్లు ఫైనల్‌లో తలపడతాయి.

వివరాలు

భారత్‌-పాకిస్థాన్‌ ఒకే గ్రూప్‌లో..

2027 ప్రపంచకప్‌లో భారత్‌, పాకిస్థాన్‌ జట్లు ఒకే గ్రూప్‌లో ఉన్నాయి. గ్రూప్‌-Aలో భారత్‌, ఆస్ట్రేలియా, పాకిస్థాన్‌, అఫ్గానిస్థాన్‌, జింబాబ్వే, క్వాలిఫయర్‌-A జట్లు ఉన్నాయి.

గ్రూప్‌-Bలో న్యూజిలాండ్‌, దక్షిణాఫ్రికా, శ్రీలంక, ఇంగ్లాండ్‌, బంగ్లాదేశ్‌, క్వాలిఫయర్‌-B జట్లు ఉన్నాయి. భారత్‌-పాకిస్థాన్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 10న జోహన్నెస్‌బర్గ్‌లో జరగనుంది.

అంతకుముందు అక్టోబర్‌ 7న కేప్‌టౌన్‌లో భారత్‌-ఆస్ట్రేలియా మ్యాచ్‌తో ప్రధాన గ్రూప్‌ దశ ప్రారంభమవుతుంది.

భారత్‌, పాకిస్థాన్‌ రెండూ తమ గ్రూప్‌ నుంచి సూపర్‌-7కు అర్హత సాధిస్తే అక్కడ మరోసారి తలపడే అవకాశం ఉంటుంది.

అంతేకాకుండా రెండు జట్లు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తే, ఫైనల్‌లోనూ తలపడే అవకాశం ఉంటుంది. అంటే టోర్నీ ఫలితాలను బట్టి భారత్‌-పాక్‌ మధ్య గరిష్ఠంగా మూడు మ్యాచ్‌లు జరిగే అవకాశం ఉంది.

ADVERTISEMENT