UEFA Champions League: ఛాంపియన్స్ లీగ్ సంబరాల్లో ఉద్రిక్తం.. పలు చోట్ల హింసాత్మక ఘటనలు
ఈ వార్తాకథనం ఏంటి
ఛాంపియన్స్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్‌లో పారిస్ సెయింట్ జర్మన్ (పీఎస్‌జీ) జట్టు విజేతగా నిలవడంతో అభిమానులు భారీగా సంబరాలు జరుపుకున్నారు. అయితే ఈ వేడుకలు కొన్ని ప్రాంతాల్లో హింసాత్మక ఘటనలకు దారితీశాయి. కొందరు అల్లరి మూకలు దుకాణాలు, వాహనాలను ధ్వంసం చేసి వాటికి నిప్పు పెట్టడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఘటనల నేపథ్యంలో పోలీసులు పలువురిని అరెస్టు చేశారు. హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లో జరిగిన ఛాంపియన్స్ లీగ్ ఫైనల్ మ్యాచ్‌ను వీక్షించేందుకు పారిస్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది పీఎస్‌జీ అభిమానులు తరలివచ్చారు. ముఖ్యంగా పార్క్ డెస్ ప్రిన్సెస్ స్టేడియంలో 40 వేల మందికి పైగా అభిమానులు గుమికూడారు.
వివరాలు
భారీ ఎల్ఈడీ తెరలు ఏర్పాటు..
మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసే అవకాశం లేని వారి కోసం అక్కడ భారీ ఎల్ఈడీ తెరలను ఏర్పాటు చేశారు. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్‌లో పీఎస్‌జీ విజయం సాధించడంతో అభిమానులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా కొందరు గుంపులుగా చేరి బాణసంచా పేల్చడంతో పాటు ఏర్పాటు చేసిన తెరలకు నిప్పంటించారు. పరిస్థితి అదుపు తప్పుతుండటంతో పోలీసులు వెంటనే జోక్యం చేసుకుని, జనాన్ని చెదరగొట్టేందుకు టియర్ గ్యాస్‌ను ప్రయోగించారు. ఇదే సమయంలో నగరంలోని పలు ప్రాంతాల్లో ఘర్షణలు చెలరేగాయి. అల్లరి మూకల్లో కొందరు దుకాణాలు, కార్లపై దాడులు చేసి వాటిని ధ్వంసం చేయడమే కాకుండా నిప్పంటించారు.
వివరాలు
201 మందికి గాయాలు..
ఒక పోలీస్ స్టేషన్‌పై కూడా దాడి చేసేందుకు ప్రయత్నించగా, పోలీసులు వెంటనే స్పందించి వారిని అడ్డుకున్నారు. ఈ ఘటనల్లో పలువురు పోలీసు సిబ్బంది గాయపడ్డారు. హింసాత్మక ఘటనలకు సంబంధించి సుమారు 130 మందిని పోలీసులు అరెస్టు చేయగా, మరికొందరిని అదుపులోకి తీసుకుని విచారణ కొనసాగిస్తున్నారు. ఇదిలా ఉండగా, గత ఏడాది జరిగిన ఛాంపియన్స్ లీగ్ టోర్నమెంట్‌లో పీఎస్‌జీ తొలిసారిగా టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఆ విజయానంతరం కూడా ఫ్రాన్స్ రాజధాని పారిస్‌లో ఇలాంటి ఘర్షణలు చోటుచేసుకున్నాయి. అప్పటి ఘటనల్లో మొత్తం 201 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు.