LOADING...
Praggnanandhaa: కార్ల్‌సన్‌,గుకేశ్‌లపై వరుస విజయాలు.. నార్వే చెస్ టైటిల్ పోరులో ప్రజ్ఞానంద
కార్ల్‌సన్‌, గుకేశ్‌లపై వరుస విజయాలు.. నార్వే చెస్ టైటిల్ పోరులో ప్రజ్ఞానంద

Praggnanandhaa: కార్ల్‌సన్‌,గుకేశ్‌లపై వరుస విజయాలు.. నార్వే చెస్ టైటిల్ పోరులో ప్రజ్ఞానంద

వ్రాసిన వారు Moogati Shabari
Jun 05, 2026
11:55 am

ఈ వార్తాకథనం ఏంటి

నార్వే చెస్ టోర్నీలో భారత చెస్ యువ గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటున్నాడు. వరుసగా మూడు విజయాలు నమోదు చేసి పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరుకున్నాడు. ఈ ప్రయాణంలో ప్రపంచ స్థాయి దిగ్గజ ఆటగాళ్లను ఓడిస్తూ తన సత్తా చాటాడు. ఇటీవల జరిగిన రౌండ్‌లో డి. గుకేశ్పై విజయం సాధించిన ప్రజ్ఞానంద, అంతకుముందు ప్రపంచ నంబర్ వన్ ఆటగాడు మాగ్నస్ కార్ల్‌సన్ను కూడా మట్టికరిపించాడు. దీంతో తొమ్మిది రౌండ్లు పూర్తయ్యేసరికి అతను 15 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచాడు.

వివరాలు

15.5 పాయింట్లతో అగ్రస్థానంలో వెస్లీ సో..

ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న వెస్లీ సో ఖాతాలో 15.5 పాయింట్లు ఉన్నాయి. ప్రజ్ఞానంద కంటే అతడికి కేవలం అర పాయింట్ మాత్రమే అధికంగా ఉండటం విశేషం. చివరి రౌండ్‌లో వెస్లీ సో పరాజయం పాలై, ప్రజ్ఞానంద విజయం సాధిస్తే టైటిల్‌ను కైవసం చేసుకునే అవకాశం ఉంది. తుదిరౌండ్‌లో ప్రజ్ఞానంద, విన్సెంట్ కీమర్తో పోటీ పడనుండగా, వెస్లీ సోకు అలిరెజా ఫిరూజా ప్రత్యర్థిగా ఉన్నాడు.

వివరాలు

మహిళల విభాగంలో భారత ఆటగాళ్లకు నిరాశ..

నార్వే చెస్ మహిళల విభాగంలో భారత క్రీడాకారిణులు టైటిల్ పోరులో నిలవలేకపోయారు. దివ్య దేశ్‌ముఖ్ ఐదో స్థానంలో కొనసాగుతుండగా, కోనేరు హంపి ఆరో స్థానంలో నిలిచింది. కజకిస్థాన్‌కు చెందిన బిబిసారా అస్సౌబయేవా 16.5 పాయింట్లతో అగ్రస్థానంలో దూసుకెళ్తోంది. ఆమె తర్వాతి స్థానంలో ఉన్న జు జినెర్ ఖాతాలో 13 పాయింట్లు మాత్రమే ఉన్నాయి. ఇద్దరి మధ్య పాయింట్ల తేడా గణనీయంగా ఉండటంతో, చివరి రౌండ్ ఫలితం ఎలా వచ్చినా బిబిసారా టైటిల్‌ను దాదాపు ఖాయం చేసుకున్నట్లే కనిపిస్తోంది.

Advertisement