ఐసీసీ నెంబర్.1 టెస్టు బౌలర్‌గా అశ్విన్
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఇండియన్ ప్లేయర్స్ అదరగొడుతున్నారు. గతవారం ఐసీసీ నెంబర్ వన్ 1 టెస్టు బౌలర్ గా అవతరించిన జేమ్స్ అండర్సన్ న్యూజిలాండ్‌తో జరిగిన రెండో టెస్టులో రాణించలేకపోయాడు. దీంతో రెండో స్థానంలో ఉన్న రవిచంద్రన్ అశ్విన్ 864 పాయింట్లతో మొదటి స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. గతవారం రేటింగ్స్ లో రెండో స్థానంలో అశ్విన్ కి, టాప్ లో ఉన్న జేమ్స్ అండర్సన్ కి 2 పాయింట్లు తేడా మాత్రమే ఉండేది. న్యూజిలాండ్‌తో రెండు టెస్టు ముగిసిన తరువాత జేమ్స్ అండర్సన్ 7 పాయింట్లు కోల్పోవడంతో అశ్విన్ టాప్ లోకి వచ్చాడు. టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌లో మూడో స్థానంలో పాట్ కమిన్స్, నాలుగో స్థానంలో జస్ప్రిత్ బుమ్రా కొనసాగుతున్నారు.
అల్ రౌండర్ జాబితాలో రవీంద్ర జడేజా అగ్రస్థానం
ఐసీసీ టెస్టు బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో మార్నస్ లబుషేన్ మొదటి స్థానంలో కొనసాగుతుండగా స్టీవ్ స్మిత్ రెండో స్థానంలో ఉన్నాడు. న్యూజిలాండ్‌తో జరిగిన టెస్టులో సెంచరీతో చెలరేగిన జో రూట్ టాప్ 3లోకి దూసుకొచ్చాడు. టెస్టు ఆల్ రౌండర్ల జాబితాలో రవీంద్ర జడేజా 460 పాయింట్లతో మొదటి స్థానంలో కొనసాగుతుండగా.. రవిచంద్రన్ అశ్విన్ రెండో స్థానంలో, అక్షర్ పటేల్ టాప్ 5లో ఉన్నాడు. టీ20ల్లో సూర్యకుమార్ యాదవ్ టాప్ ప్లేస్‌లో ఉండగా వన్డేల్లో మహ్మద్ సిరాజ్ నెం.1 బౌలర్‌గా ఉన్నాడు. టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్‌లో టాప్ 10లో టీమిండియా నుంచి ఒక్క బౌలర్ కూడా లేకపోవడం గమనార్హం.