Rinku Singh: జింబాబ్వే మ్యాచ్‌కు ముందే జట్టుతో కలవనున్నరింకు సింగ్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ సూపర్-8 దశలో భాగంగా గురువారం జింబాబ్వేతో టీమ్ ఇండియా పోరుకు సిద్ధమవుతోంది. చెన్నైలో ఈ మ్యాచ్ నిర్వహించనున్నారు. కుటుంబంలో అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో జట్టును విడిచిన రింకు సింగ్ ఈరోజు సాయంత్రానికే మళ్లీ జట్టుతో చేరతాడని భారత బ్యాటింగ్ కోచ్ సితాన్షు కోటక్ తెలిపారు. జింబాబ్వేతో జరగనున్న మ్యాచ్‌కు ముందు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. "జింబాబ్వే మ్యాచ్‌కు ముందే రింకు సింగ్ తిరిగి జట్టుతో కలుస్తాడు. అతని తండ్రి ఆరోగ్యం క్షీణించడంతో వెంటనే ఇంటికి వెళ్లాల్సి వచ్చింది. ఈ సాయంత్రానికి చెన్నై చేరుకుంటాడని భావిస్తున్నాం" అని సితాన్షు కోటక్ చెప్పారు.
వివరాలు
తుది జట్టులో చోటు దక్కుతుందా?
రింకు తండ్రి ఖాన్‌చంద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని, పరిస్థితి తీవ్రంగా ఉండటంతో రింకు అత్యవసరంగా వెళ్లాడని బీసీసీఐ వర్గాలు తెలియజేశాయి. ప్రస్తుతం ఆరోగ్యం కొంత మెరుగుపడటంతో జట్టులో చేరాలని రింకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈరోజు ప్రాక్టీస్ సెషన్‌లో పాల్గొననున్న రింకు సింగ్‌కు జింబాబ్వేతో జరిగే మ్యాచ్‌లో తుది జట్టులో స్థానం లభిస్తుందా అన్నదానిపై చర్చ కొనసాగుతోంది. చెన్నై మైదానం స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉండే అవకాశముండటంతో అదనపు స్పిన్నర్‌ను తీసుకోవాలనే ఆలోచన మేనేజ్‌మెంట్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పరిస్థితిలో కుల్‌దీప్ యాదవ్‌ను జట్టులో చేర్చితే రింకు సింగ్ బెంచ్‌కే పరిమితమయ్యే అవకాశముంది. మరోవైపు, ఇప్పటివరకు ఆడిన ఐదు మ్యాచ్‌ల్లో రింకు కేవలం 24 పరుగులు మాత్రమే సాధించాడు.