
Saina Nehwal - Kashyap: ఏడేళ్ల వివాహ బంధానికి సైనా, కశ్యప్ గుడ్ బై
ఈ వార్తాకథనం ఏంటి
భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్, ఆమె భర్త పారుపల్లి కశ్యప్ తమ వివాహ జీవితానికి ముగింపు పలికారు. ఈ విషయాన్ని స్వయంగా సైనా నెహ్వాల్ ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. సుదీర్ఘంగా ఆలోచించి, పరస్పరంగా చర్చించుకున్న అనంతరం విడిపోయే నిర్ణయం తీసుకున్నట్లు ఆమె తెలిపింది. ''జీవితం కొన్ని సందర్భాల్లో మనల్ని భిన్న దారుల్లోకి నడిపిస్తుంది. ఎన్నో ఆలోచనలు, చర్చల అనంతరం నేను, కశ్యప్ విడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాం. మనసుకి శాంతిని కోరుతూ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సమయంలో మా ప్రైవసీకి మీరు గౌరవం ఇస్తారని ఆశిస్తున్నాం'' అని సైనా తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. అయితే ఈ విషయంపై కశ్యప్ ఇంకా స్పందించలేదు.
వివరాలు
కోచింగ్ రంగంలో కశ్యప్
బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ పొందుతున్న సమయంలో సైనా,కశ్యప్‌ల మధ్య స్నేహం ఏర్పడింది. ఆ స్నేహమే క్రమంగా ప్రేమగా మారింది. 2018లో ఈ జంట వివాహబంధంతో ఒక్కటయ్యారు. గత కొంతకాలంగా వరుస గాయాల బారిన పడిన సైనా తన ఆటతీరును కోల్పోయింది. ఆమె చివరిసారి ప్రొఫెషనల్ బ్యాడ్మింటన్ సర్క్యూట్‌లో 2023 జూన్‌లో పాల్గొంది. గడిచిన ఏడాదిలో తాను ఆర్థరైటిస్‌తో బాధపడుతున్నట్లు వెల్లడించిన సైనా, త్వరలో తన కెరీర్ విషయంలో కీలక నిర్ణయం తీసుకోనుందని చెప్పింది. ఇక మరోవైపు, కశ్యప్ కాంపిటీటివ్ బ్యాడ్మింటన్‌కు రిటైర్మెంట్ ప్రకటించి, కోచింగ్ రంగంలో కొనసాగుతున్నాడు.