Mohammed Siraj: న్యూజిలాండ్ టెస్టు సిరీస్‌కు ముందు సిరాజ్ సత్తా.. నాలుగు వికెట్లతో అద్భుత ప్రదర్శన
ఈ వార్తాకథనం ఏంటి
క్రైస్ట్‌చర్చ్ వేదికగా భారత్-ఏ, న్యూజిలాండ్-ఏ జట్ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక టెస్టులో ఆతిథ్య జట్టు తొలి ఇన్నింగ్స్‌లో కీలక ఆధిక్యాన్ని సాధించింది. ముకేశ్ కుమార్, మహ్మద్ సిరాజ్ అద్భుతంగా బౌలింగ్ చేసినప్పటికీ.. న్యూజిలాండ్-ఏ జట్టు 78 పరుగుల ఆధిక్యాన్ని సంపాదించింది. మూడో రోజు ఆటలో భారత-ఏ జట్టు తొలి ఇన్నింగ్స్ స్కోరు 346 పరుగులకు సమాధానంగా న్యూజిలాండ్-ఏ 424 పరుగులకు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో ఆ జట్టుకు 78 పరుగుల ఆధిక్యం లభించింది.
వివరాలు
సిరాజ్ అద్భుత బౌలింగ్
ఈ మ్యాచ్‌లో మహమ్మద్ సిరాజ్ కొత్త బంతితో ఆకట్టుకున్నాడు. మంచి ఫామ్‌లో ఉన్న ఓపెనర్ రైస్ మారియును కేవలం నాలుగు పరుగులకే పెవిలియన్‌కు పంపించాడు.
దీంతో న్యూజిలాండ్-ఏ జట్టు 13 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో మాథ్యూ బాయిల్, డీన్ ఫాక్స్‌క్రాఫ్ట్ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు.
వీరిద్దరూ భారీ భాగస్వామ్యాన్ని నెలకొల్పి జట్టు స్కోరును 200 పరుగులు దాటించారు. బాయిల్ 110 పరుగులతో సెంచరీ సాధించగా.. ఫాక్స్‌క్రాఫ్ట్ 93పరుగులు చేశాడు.
అయితే కీలక సమయంలో సిరాజ్ ఈ ఇద్దరినీ పెవిలియన్‌కు పంపి భారత్-ఏ జట్టుకు మళ్లీ ఆశలు కల్పించాడు.
అనంతరం బ్రెట్ రాండెల్ (5)ను కూడా ఔట్ చేశాడు. చివరకు న్యూజిలాండ్-ఏ జట్టు 424 పరుగులకు ఆలౌటైంది.
వివరాలు
ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సిరాజ్‌కు 23వ నాలుగు వికెట్ల ఘనత
ఈ మ్యాచ్‌తో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సిరాజ్ తన వికెట్ల సంఖ్యను 329కి చేర్చుకున్నాడు. 97 మ్యాచ్‌లు ఆడిన అతడు సుమారు 27 సగటుతో ఈ వికెట్లు సాధించాడు.
క్రిక్‌ఇన్ఫో గణాంకాల ప్రకారం.. ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో సిరాజ్‌కు ఇది 23వ సారి నాలుగు వికెట్లు తీసిన ఘనత.
అంతేకాకుండా ఈ ఫార్మాట్‌లో అతడు 10 సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన కూడా నమోదు చేశాడు.
వివరాలు
టెస్టుల్లోనూ సిరాజ్ కీలక ప్రదర్శన
సిరాజ్ ఇప్పటివరకు 48 టెస్టు మ్యాచ్‌లు ఆడి 29.63 సగటుతో 144 వికెట్లు పడగొట్టాడు.
ఇందులో ఎనిమిది సార్లు నాలుగు వికెట్లు, ఐదు సార్లు ఐదు వికెట్లు తీసిన ప్రదర్శనలు ఉన్నాయి.
ఈ నెల చివర్లో న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్టుల సిరీస్‌లో సిరాజ్ ఆడనున్న నేపథ్యంలో.. ప్రస్తుత అనధికారిక టెస్టులో అతడి ప్రదర్శన ప్రాధాన్యం సంతరించుకుంది.