LOADING...
Smriti Mandhana: మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ కావాలి: స్మృతి మంధాన
మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ కావాలి: స్మృతి మంధాన

Smriti Mandhana: మహిళల క్రికెట్‌కు మరింత ఆదరణ కావాలి: స్మృతి మంధాన

వ్రాసిన వారు Moogati Shabari
Jun 03, 2026
05:44 pm

ఈ వార్తాకథనం ఏంటి

మహిళల టీ20 ప్రపంచకప్ జూన్ 12 నుంచి ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో జూన్ 14న బర్మింగ్‌హామ్ వేదికగా భారత్-పాకిస్థాన్ జట్లు తలపడనున్నాయి. ఈ హై-వోల్టేజ్ పోరుపై ఇప్పటికే అభిమానుల్లో భారీ ఆసక్తి కనిపిస్తోంది. అయితే ఈ ఒక్క మ్యాచ్‌పైనే దృష్టి కేంద్రీకరించకుండా, మొత్తం టోర్నీకి ప్రాచుర్యం కల్పించాలని భారత మహిళల జట్టు వైస్ కెప్టెన్ స్మృతి మంధాన కోరింది. ఈ సందర్భంగా మంధాన మాట్లాడుతూ, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో బర్మింగ్‌హామ్‌లో జరిగిన భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభించిందని గుర్తుచేసింది. ఆ మ్యాచ్‌కు సంబంధించిన టిక్కెట్లు పూర్తిగా అమ్ముడయ్యాయని తెలిపింది. అదే తరహాలో మహిళల టీ20 ప్రపంచ కప్ మొత్తం అభిమానుల దృష్టిని ఆకర్షించాలని ఆమె అభిప్రాయపడింది.

వివరాలు

అన్ని మ్యాచ్‌లకు ఆదరణ అవసరం..

కేవలం భారత్-పాకిస్థాన్ మ్యాచ్‌కే ప్రత్యేక ప్రచారం అవసరం లేదని, ఆ పోరుకు ఇప్పటికే తగినంత గుర్తింపు లభించిందని మంధాన పేర్కొంది. టోర్నీలోని అన్ని మ్యాచ్‌లకు సమానంగా ఆదరణ లభించాలని ఆశిస్తున్నట్లు తెలిపింది. అభిమానులు తమకు అండగా నిలుస్తారని విశ్వాసం వ్యక్తం చేసిన ఆమె, వారి మద్దతుతో జట్టు మెరుగైన ప్రదర్శన కనబరుస్తుందని నమ్మకం వ్యక్తం చేసింది.

వివరాలు

జూన్ 14న పాక్‌తో మ్యాచ్..

టీ20 ప్రపంచకప్‌లో గ్రూప్-ఏలో ఉన్న భారత్ తన లీగ్ దశ ప్రయాణాన్ని జూన్ 14న పాకిస్థాన్‌తో ప్రారంభించనుంది. అనంతరం జూన్ 17న నెదర్లాండ్స్, జూన్ 21న దక్షిణాఫ్రికా, జూన్ 25న బంగ్లాదేశ్, జూన్ 28న ఆస్ట్రేలియాతో పోటీ పడనుంది. ఇక భారత జట్టు తాజా ఫామ్ విషయానికి వస్తే, ఇటీవల ఇంగ్లాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో తొలి పోరులో విజయం సాధించింది. అయితే తరువాతి రెండు మ్యాచ్‌ల్లో పరాజయం పాలవడంతో సిరీస్‌ను కోల్పోయింది.

Advertisement