FIFA World cup: గుండె ఆగినా గెలుపు ఆగలేదు.. స్టాలే స్ఫూర్తిదాయక ప్రయాణం
ఈ వార్తాకథనం ఏంటి
ఫిఫా ప్రపంచకప్-2026 ఆసక్తికర పోరులు, సంచలన విజయాలు, ఆటగాళ్ల భావోద్వేగాలు, అనూహ్య పరిణామాలతో అభిమానులను ఉత్కంఠకు గురిచేస్తోంది. ఈ టోర్నీలో నార్వే జట్టును విజయపథంలో నడిపిస్తున్న హెడ్ కోచ్ స్టాలే సొల్‌బాకెన్ జీవితం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు మరణం అంచుల వరకు వెళ్లి తిరిగి జీవితాన్ని గెలుచుకున్న ఆయన... ఇప్పుడు నార్వే ఫుట్‌బాల్ చరిత్రలో కొత్త అధ్యాయాన్ని లిఖిస్తున్నారు. దాదాపు 25 సంవత్సరాల క్రితం జరిగిన ఓ ఫుట్ బాల్ శిక్షణా శిబిరంలో స్టాలే సొల్‌బాకెన్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అక్కడే ఉన్న వైద్యుడు డాక్టర్ ఫ్రాంక్ ఓడ్‌గార్డ్ వెంటనే అత్యవసర చికిత్స ప్రారంభించారు. ఆ సమయంలో స్టాలే గుండె సుమారు ఏడు నిమిషాల పాటు పనిచేయలేదు.
వివరాలు
33 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్ ఆటగాడిగా..
అనంతరం గుండె మళ్లీ స్పందించడం ప్రారంభించింది. ఈ ఘటనపై తర్వాత స్పందించిన డాక్టర్, "స్టాలే క్లినికల్‌గా మరణించిన పరిస్థితిలోకి వెళ్లాడు. గుండె పూర్తిగా ఆగిపోయింది. అలాంటి స్థితి నుంచి అతడు తిరిగి బతకడం నిజంగా అద్భుతమే" అని తెలిపారు. గుండె మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించినప్పటికీ స్టాలే వెంటనే కోలుకోలేదు. దాదాపు 26 గంటల తర్వాతే ఆయనకు స్పృహ వచ్చింది. అనంతర పరీక్షల్లో హృదయ సంబంధిత సమస్య ఉన్నట్లు గుర్తించిన వైద్యులు ఆయనకు పేస్‌మేకర్ అమర్చారు. దీంతో కేవలం 33 ఏళ్ల వయసులోనే ఫుట్‌బాల్ ఆటగాడిగా తన కెరీర్‌కు ముగింపు పలకాల్సి వచ్చింది.
వివరాలు
బతుకుతాడనే ఆశ లేదు..
తాను ఎదుర్కొన్న ఆ భయానక అనుభవాన్ని స్టాలే ఒక ఇంటర్వ్యూలో గుర్తు చేసుకుంటూ, "నాకు మాత్రం క్షణాల్లో చీకటి కమ్ముకుని మళ్లీ వెలుగు కనిపించినట్టే అనిపించింది. కానీ నా కుటుంబానికి అది అత్యంత భయంకరమైన సమయం. ముఖ్యంగా మా తల్లి నేను బతుకుతాననే ఆశనే పూర్తిగా వదిలేసింది" అని భావోద్వేగంగా చెప్పారు. ఆటగాడిగా రిటైర్ అయిన తర్వాత స్టాలే కోచింగ్ రంగంలో అడుగుపెట్టాడు. నార్వే, డెన్మార్క్, ఇంగ్లండ్‌కు చెందిన పలు క్లబ్ జట్లకు కోచ్‌గా సేవలందిస్తూ తన ప్రతిభను నిరూపించుకున్నాడు.
వివరాలు
ఫిఫా వరల్డ్ కప్‌లో నార్వే అద్భుత ప్రదర్శన..
1998 ఫిఫా ప్రపంచకప్‌కు అర్హత సాధించిన నార్వే జట్టులో ఆటగాడిగా సభ్యుడైన స్టాలే... ఇప్పుడు అదే దేశ జట్టుకు హెడ్ కోచ్‌గా వ్యవహరిస్తూ మరోసారి ప్రపంచకప్‌కు తీసుకువచ్చాడు. 1998 తర్వాత నార్వేకు ప్రపంచకప్ అర్హత లభించడం ఇదే తొలిసారి కావడం విశేషం. ప్రస్తుతం ఫిఫా వరల్డ్ కప్‌లో నార్వే అద్భుత ప్రదర్శనతో చరిత్ర సృష్టించింది. తమ ఫుట్‌బాల్ చరిత్రలో తొలిసారిగా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకున్న ఆ జట్టు, సెమీఫైనల్ బెర్త్ కోసం ఇంగ్లండ్‌తో తలపడనుంది. మరోవైపు నార్వేతో ఒకే గ్రూప్‌లో ఉన్న ఫ్రాన్స్ ఇప్పటికే సెమీఫైనల్‌లోకి ప్రవేశించింది. మరణాన్ని జయించి తిరిగి జీవితంలో నిలదొక్కుకున్న స్టాలే సొల్‌బాకెన్ నాయకత్వంలో నార్వే సాధిస్తున్న ఈ విజయగాథ ఇప్పుడు ప్రపంచ ఫుట్‌బాల్ అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటోంది.