Bangladesh: భారత్‌తో క్రికెట్ సంబంధాలు మెరుగుపర్చేందుకు బంగ్లాదేశ్ కొత్త ప్రయత్నం
ఈ వార్తాకథనం ఏంటి
బంగ్లాదేశ్ క్రికెట్‌లో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. మాజీ కెప్టెన్ తమీమ్ ఇక్భాల్ 11 మంది సభ్యులతో కూడిన తాత్కాలిక కమిటీకి అధ్యక్షుడిగా నియమించడం ద్వారా బోర్డుకు కొత్త ఆశలు కలిగాయి. ఆయన నాయకత్వంలో భారత్‌తో క్రికెట్ సంబంధాలను పునరుద్ధరించే ప్రయత్నాలు వేగవంతమయ్యాయి. భారత్ పర్యటనకు ఆసక్తి చూపడమే కాకుండా, ఈ ఏడాది ద్వైపాక్షిక సిరీస్ కోసం బీసీసీఐను బంగ్లాదేశ్‌కు ఆహ్వానించింది. ఇదే సమయంలో ప్రస్తుత ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ జరగనుంది. భారత్ బంగ్లాదేశ్ పర్యటనకు ఇప్పటికే షెడ్యూల్ అయి ఉండటం ఈ పరిణామానికి మరింత ప్రాధాన్యం తెచ్చింది.
వివరాలు
90 రోజుల్లో ఎన్నికలు..
ఇటీవల జరిగిన పరిణామాల నేపథ్యంలో రెండు దేశాల మధ్య క్రికెట్ సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ముఖ్యంగా భారత్‌లో జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ నుంచి భద్రతా కారణాలు చూపిస్తూ బంగ్లాదేశ్ వైదొలగడం సంబంధాలను దిగజార్చింది. వారి స్థానంలో స్కాట్లాండ్ జట్టును టోర్నమెంట్‌లో చేర్చారు. వేదిక మార్పు కోరిన బంగ్లాదేశ్ అభ్యర్థనను ఐసీసీ తిరస్కరించింది. ఇక బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) తాత్కాలిక కమిటీకి వచ్చే 90 రోజుల్లో కొత్త ఎన్నికలు నిర్వహించే బాధ్యత కూడా అప్పగించారు. బీసీబీ మాజీ అధ్యక్షుడు అమినుల్ ఇస్లాం బుల్బుల్ ను పదవి నుంచి తొలగించిన తర్వాత ఈ మార్పులు చోటుచేసుకున్నాయి.
వివరాలు
ఐసీసీకి బుల్బుల్ ఫిర్యాదు
పదవి నుంచి తొలగించిన తర్వాత బుల్బుల్, ఐసీసీకి లేఖ రాసి జోక్యం చేసుకోవాలని కోరారు. అయితే ఆయన ఫిర్యాదుకు పెద్దగా స్పందన లభించే అవకాశం లేదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రభుత్వ జోక్యం విషయంలో ఆయన వైఖరిలో విరుద్ధత ఉందని ఐసీసీ వర్గాలు భావిస్తున్నాయి. తన పదవీకాలంలో బంగ్లాదేశ్ జట్టు భారత్‌కు వెళ్లకపోవడానికి ప్రభుత్వ ఆదేశాలే కారణమని బుల్బుల్ ఐసీసీకి తెలిపిన విషయం గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పుడు తనను పదవి నుంచి తొలగించడం ప్రభుత్వ జోక్యమేనని ఆరోపించడం 'డబుల్ స్టాండర్డ్'గా భావిస్తున్నారు.
వివరాలు
పట్టించుకోని ఐసీసీ
ఐసీసీ డైరెక్టర్ ఒకరు మాట్లాడుతూ, "ఇటీవల జరిగిన టీ20 ప్రపంచకప్‌లో పాల్గొనకపోవడానికి ప్రభుత్వ ఆదేశాలను కారణంగా చూపిన అదే అధ్యక్షుడు, ఇప్పుడు అదే ప్రభుత్వ నిర్ణయంపై ఐసీసీ రక్షణ కోరడం ఆశ్చర్యకరం" అని వ్యాఖ్యానించారు. ఈ పరిణామాలతో బుల్బుల్ వాదన బలహీనపడినట్లు తెలుస్తోంది. ఆయన ఫిర్యాదుపై ఐసీసీ చర్యలు తీసుకునే అవకాశాలు తక్కువగా ఉన్నాయని సమాచారం.