T20 World Cup: టీ20 చరిత్రలోనే అతి వేగవంతమైన అర్ధశతకం.. ఎవరూ టచ్ చేయలేని ఘనత ఇతనిదే..
ఈ వార్తాకథనం ఏంటి
ప్రపంచ క్రికెట్‌లో ప్రతిరోజూ ఏదో ఒక కొత్త రికార్డు నమోదవుతూనే ఉంటుంది. కానీ, కాలం గడిచినా చెరగని కొన్ని అరుదైన రికార్డులు మాత్రం చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాయి. అలాంటి అసాధారణ ఘనతే నేపాల్ స్టార్ ఆల్‌రౌండర్ దీపేంద్ర సింగ్ ఐరీ పేరిట ఉంది. ఎంతమంది పవర్‌హిట్టర్లు వచ్చినా, ఎన్ని సిక్సర్లు బాదినా.. ఈ రికార్డును ఇప్పటివరకు ఎవరూ అధిగమించలేకపోయారు. టీ20 వరల్డ్ కప్ 2026: నేపాల్‌పై ప్రపంచ క్రికెట్ దృష్టి ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచకప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు భారత్, శ్రీలంకలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మెగా టోర్నీలో మొత్తం 20 జట్లు బరిలోకి దిగనున్నాయి. వాటిలో నేపాల్ జట్టు అర్హత సాధించడం విశేషంగా నిలిచింది.
వివరాలు
గ్రూప్-Cలో నేపాల్..
రోహిత్ పౌడెల్ సారథ్యంలో, దీపేంద్ర సింగ్ ఐరీ, సందీప్ లామిచానే వంటి అనుభవజ్ఞులైన ఆటగాళ్లతో నేపాల్ ఈసారి బలమైన జట్లకు గట్టి సవాల్ విసిరే స్థాయిలో ఉంది. టీ20 వరల్డ్ కప్‌లో నేపాల్‌ను గ్రూప్-Cలో ఉంచారు. ఈ గ్రూప్‌లో ఇంగ్లండ్, వెస్టిండీస్, స్కాట్‌ల్యాండ్, ఇటలీ జట్లు ఉన్నాయి. నేపాల్ తమ లీగ్ మ్యాచ్‌లన్నింటినీ ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఆడనుంది. ఫిబ్రవరి 8న ఇంగ్లండ్‌తో జరిగే మ్యాచ్‌తో నేపాల్ ప్రచారం ప్రారంభమవుతుంది.
వివరాలు
టీ20 ఇంటర్నేషనల్స్‌లో దీపేంద్ర సింగ్ ఐరీ ప్రభావం
నేపాల్ తరఫున టీ20 ఇంటర్నేషనల్స్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా దీపేంద్ర సింగ్ ఐరీ నిలిచాడు. ఇప్పటివరకు 90 మ్యాచ్‌లు ఆడిన అతడు 1956 పరుగులు చేశాడు. 32.06 సగటుతో 1 సెంచరీ, 10 అర్ధశతకాలు అతని ఖాతాలో ఉన్నాయి. ఆ తర్వాత స్థానాల్లో కుశల్ భురతేల్ 70మ్యాచ్‌ల్లో 1807పరుగులు, ఆసిఫ్ షేక్ 68 మ్యాచ్‌ల్లో 1639 పరుగులు చేశారు. క్రికెట్ చరిత్రలోనే అతి వేగవంతమైన అర్ధశతకం దీపేంద్ర సింగ్ ఐరీ సాధించిన రికార్డు క్రికెట్ చరిత్రలో ప్రత్యేక అధ్యాయంగా నిలిచింది. 2023 ఆసియా గేమ్స్‌లో మంగోలియాతో జరిగిన టీ20 మ్యాచ్‌లో అతడు కేవలం 9బంతుల్లోనే అర్ధశతకం (50 పరుగులు) సాధించాడు. ఇది ఇప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలోనే వేగవంతమైన అర్ధశతకంగా రికార్డులకెక్కింది.
వివరాలు
ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు.. నేపాల్ భారీ స్కోర్
ఈ ఘనతను బద్దలు కొట్టడం ఇప్పటికీ ఎవరికీ సాధ్యం కాలేదు. విశేషం ఏమిటంటే.. ఏ ఆటగాడు వరుసగా 9 బంతుల్లో 9 సిక్సర్లు కొట్టినా,దీపేంద్ర రికార్డుకు సమం మాత్రమే అవుతాడు.కానీ, దానిని అధిగమించడం అసాధ్యమే. అదే మ్యాచ్‌లో దీపేంద్ర ఒకే ఓవర్‌లో ఆరు సిక్సర్లు బాదిన ఘనతను కూడా సాధించాడు. మంగోలియాతో జరిగిన ఆ మ్యాచ్‌లో నేపాల్ 3 వికెట్ల నష్టానికి 314 పరుగులు చేసింది. ఇది అప్పటివరకు టీ20 ఇంటర్నేషనల్ చరిత్రలోనే అత్యధిక స్కోర్ అయితే, అక్టోబర్ 2024లో జింబాబ్వే గాంబియాపై 344/4 స్కోర్ చేసి ఈ రికార్డును అధిగమించింది. అదే మ్యాచ్‌లో కుశల్ మల్ల 34 బంతుల్లోనే శతకం సాధించి, అప్పట్లో టీ20 ఇంటర్నేషనల్స్‌లో వేగవంతమైన సెంచరీగా రికార్డు నెలకొల్పాడు.
వివరాలు
టీ20 ఇంటర్నేషనల్స్‌లో నేపాల్ గణాంకాలు
ప్రస్తుతం ఈ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ (27 బంతులు) పేరిట ఉంది. బౌలింగ్ విభాగంలో సందీప్ లామిచానే నేపాల్‌కు కీలక ఆయుధంగా మారాడు. 67 మ్యాచ్‌ల్లో 129 వికెట్లు పడగొట్టిన అతడు 12.05 సగటుతో అద్భుత ప్రదర్శన కొనసాగిస్తున్నాడు. ఇక, కరణ్ కేసి 85 మ్యాచ్‌ల్లో 106 వికెట్లు, సోమపాల్ కామి 86 మ్యాచ్‌ల్లో 81 వికెట్లు సాధించారు. నేపాల్ ఇప్పటివరకు 112 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడింది. వాటిలో 65 విజయాలు సాధించగా, 41 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. మూడు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగియగా, మరో మూడు టైగా ముగిశాయి. టీ20 ఫార్మాట్‌లో నేపాల్ ఇప్పటికే వెస్టిండీస్, ఐర్లాండ్, నెదర్లాండ్స్ వంటి బలమైన జట్లను ఓడించడం విశేషంగా నిలుస్తోంది.