LOADING...
IND vs NZ: టీమిండియా vs కివీస్‌.. టీ20ల్లో ఎవరిది పైచేయి?
టీమిండియా vs కివీస్‌.. టీ20ల్లో ఎవరిది పైచేయి?

IND vs NZ: టీమిండియా vs కివీస్‌.. టీ20ల్లో ఎవరిది పైచేయి?

వ్రాసిన వారు Jayachandra Akuri
Mar 07, 2026
04:22 pm

ఈ వార్తాకథనం ఏంటి

ఐసీసీ మెన్స్ టీ20 ప్రపంచకప్ తుదిపోరు ఆదివారం అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా జరగనుంది. ఈ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా, న్యూజిలాండ్‌ జట్లు తలపడనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఈ మెగా టోర్నీలో బరిలోకి దిగిన టీమిండియా కొంత తడబడినా ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. జట్టులో కొన్ని సమస్యలు మాత్రం కనిపిస్తున్నాయి. అభిషేక్ శర్మ ఫామ్ లో లేకపోవడం, వరుణ్ చక్రవర్తి బౌలింగ్‌లో ఆశించిన స్థాయిలో ప్రభావం చూపకపోవడం, అలాగే శివం దూబే బంతితో ఎక్కువ పరుగులు ఇవ్వడం వంటి అంశాలు భారత జట్టును ఆందోళనకు గురి చేస్తున్నాయి. సెమీఫైనల్‌లో భారీ స్కోరు నమోదు చేసినప్పటికీ ఇంగ్లండ్‌పై భారత్ కేవలం 7 పరుగుల తేడాతోనే విజయం సాధించింది.

Details

టీ20ల్లో భారత్‌ ఆధిక్యం

ఈ కఠిన పోరు భారత శిబిరంలో కొంత ఆందోళనను కలిగించింది. మరోవైపు సెమీఫైనల్‌లో సౌతాఫ్రికాపై ఘన విజయం సాధించిన న్యూజిలాండ్ రెట్టించిన ఆత్మవిశ్వాసంతో ఫైనల్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు మొత్తం 30 టీ20 మ్యాచ్‌ల్లో తలపడ్డాయి. ఇందులో భారత్ 18 మ్యాచ్‌లు గెలవగా, న్యూజిలాండ్ 11 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. మరో మ్యాచ్ టైగా ముగిసింది. స్వదేశంలో భారత్ 11 మ్యాచ్‌ల్లో గెలిస్తే, కివీస్ 4 మ్యాచ్‌ల్లో మాత్రమే విజయం సాధించింది. అలాగే న్యూజిలాండ్ గడ్డపై భారత్ 7 మ్యాచ్‌లు, భారత గడ్డపై న్యూజిలాండ్ 5 మ్యాచ్‌లు గెలిచింది. తటస్థ వేదికల్లో కివీస్ 2 మ్యాచ్‌లు తమ ఖాతాలో వేసుకుంది.

Details

టీ20 వరల్డ్ కప్‌లో పరిస్థితి

అయితే టీ20 వరల్డ్ కప్ పోటీల్లో మాత్రం కివీస్‌కు పైచేయి ఉంది. ఈ టోర్నీలో ఇప్పటివరకు భారత్, న్యూజిలాండ్ జట్లు మూడు సార్లు తలపడగా, ఆ మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం న్యూజిలాండ్‌కే దక్కింది. న్యూజిలాండ్‌పై భారత్ చేసిన అత్యధిక స్కోరు 180పరుగులు, అత్యల్ప స్కోరు 79 పరుగులు. ఇక టీమిండియాపై న్యూజిలాండ్ చేసిన అత్యధిక స్కోరు 190పరుగులు, అత్యల్ప స్కోరు 111పరుగులు. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో న్యూజిలాండ్ టీమ్‌ఇండియాపై స్పష్టమైన ఆధిక్యాన్ని ప్రదర్శించింది. అయితే ఈసారి ఫైనల్‌లో భారత్ విజయం సాధించి ఆ పరాజయాలకు ప్రతీకారం తీర్చుకోవాలని అభిమానులు ఆశిస్తున్నారు. అదే సమయంలో వరుసగా రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను గెలిచి కొత్త రికార్డు సృష్టించాలని కూడా టీమిండియా లక్ష్యంగా పెట్టుకుంది

Advertisement