LOADING...
TG 20 League: టీజీ20 లీగ్‌లో నేడు ఆటగాళ్ల వేలం.. కీలక దశకు చేరుకున్న టోర్నీ
టీజీ20 లీగ్‌లో నేడు ఆటగాళ్ల వేలం.. కీలక దశకు చేరుకున్న టోర్నీ

TG 20 League: టీజీ20 లీగ్‌లో నేడు ఆటగాళ్ల వేలం.. కీలక దశకు చేరుకున్న టోర్నీ

వ్రాసిన వారు Moogati Shabari
Jun 07, 2026
09:49 am

ఈ వార్తాకథనం ఏంటి

తెలంగాణ యువ క్రికెటర్ల ప్రతిభకు మరింత ప్రోత్సాహం అందించాలనే ఉద్దేశంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ప్రారంభించిన టీజీ20 క్రికెట్ లీగ్ మరో ముఖ్యమైన ఘట్టానికి సిద్ధమైంది. లీగ్‌లో పాల్గొంటున్న ఎనిమిది ఫ్రాంఛైజీలు తమ జట్ల కోసం ఆటగాళ్లను ఎంపిక చేసుకునే వేలం ప్రక్రియ ఆదివారం హైదరాబాద్‌లోని రామోజీ ఫిలిం సిటీలో జరగనుంది. ప్రిన్సెస్ కన్వెన్షన్ సెంటర్‌లో ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఈ కార్యక్రమాన్ని ప్రముఖ వ్యాఖ్యాత చారు శర్మ నిర్వహించనున్నారు.

వివరాలు

ఒక్కో జట్టుకు రూ.60 లక్షల వ్యయ పరిమితి

ఈ వేలం కోసం తెలంగాణలోని పలు జిల్లాల నుంచి దాదాపు 1,300 మంది క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేయడం విశేషం. ప్రతి ఫ్రాంఛైజీ గరిష్ఠంగా 20 మంది ఆటగాళ్లను ఎంపిక చేసుకునే అవకాశం ఉండటంతో మొత్తం 160 స్థానాలు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఏ ఆటగాళ్లు ఫ్రాంఛైజీల దృష్టిని ఆకర్షిస్తారన్నదానిపై ఆసక్తి నెలకొంది. ఈ వేలం ప్రత్యక్ష ప్రసారం స్టార్ స్పోర్ట్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఆటగాళ్ల కొనుగోలుకు ప్రతి జట్టుకు గరిష్ఠంగా రూ.60 లక్షల బడ్జెట్ కేటాయించగా, కనీసం రూ.54 లక్షలు ఖర్చు చేయడం తప్పనిసరి.

వివరాలు

అందరి దృష్టి వారిద్దరిపైనే..

ఆటగాళ్లను ఐకాన్స్, ఎ+, ఎ, బి, సి1, సి2 అనే ఆరు విభాగాలుగా వర్గీకరించారు. వీటి కనీస ధరలు వరుసగా రూ.5 లక్షలు, రూ.4 లక్షలు, రూ.3 లక్షలు, రూ.2 లక్షలు, రూ.1 లక్ష, రూ.75 వేలుగా నిర్ణయించారు. టీమిండియాకు ప్రాతినిధ్యం వహించిన క్రికెటర్లు, ఐపీఎల్‌లో కనీసం 25 మ్యాచ్‌లు ఆడిన వారు, అలాగే హైదరాబాద్ తరఫున 70 లేదా అంతకంటే ఎక్కువ దేశవాళీ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు ఐకాన్స్ విభాగంలో ఉంటారు. మిగతా విభాగాల్లో ఆటగాళ్ల అనుభవం, ప్రదర్శనల ఆధారంగా వర్గీకరణ జరిగింది. భారత జట్టులో కొనసాగుతున్న హైదరాబాద్ ఆటగాళ్లు మహ్మద్ సిరాజ్, తిలక్ వర్మ ఈ వేలంలో ప్రధాన ఆకర్షణగా నిలవనున్నారు.

Advertisement

వివరాలు

'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' జట్టుపై ప్రత్యేక దృష్టి..

టీజీ20 తొలి సీజన్ ఈ నెల 21న ప్రారంభమవుతుంది. 21 రోజుల పాటు సాగే ఈ టోర్నీలో మొత్తం 32 మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. టీజీ20 లీగ్‌లో అత్యధికంగా రూ.7.5 కోట్ల బిడ్‌తో హైదరాబాద్ ఫ్రాంఛైజీ హక్కులను సొంతం చేసుకున్న ఉషోదయ ఎంటర్‌ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ (రామోజీ గ్రూప్) తమ జట్టుకు 'హైదరాబాద్ ఈ ఛాంపియన్స్' అనే పేరు ఖరారు చేసింది.

Advertisement

వివరాలు

21 రోజుల పాటు సాగనున్న టీజీ20 లీగ్‌..

తెలంగాణలో హైదరాబాద్ నగరానికి ఉన్న ప్రత్యేక గుర్తింపు, అభిమానుల ఆదరణ దృష్ట్యా ఈ జట్టుపై సహజంగానే ఎక్కువ ఆసక్తి కనిపిస్తోంది. వేలం అనంతరం ఈ జట్టులో ఎవరు చోటు దక్కించుకుంటారన్నది ఆసక్తికరంగా మారింది. ఇక లీగ్‌లోని ఇతర జట్ల పేర్లు కూడా ఖరారయ్యాయి. ప్రణవ రంగారెడ్డి రైజర్స్, వరంగల్ వారియర్స్, మెదక్ ఫాల్కన్స్, అనురాగ్ నల్గొండ నైట్స్, కరీంనగర్ డైమండ్స్, పాలమూరు స్ట్రైకర్స్, అన్విత ఖమ్మం ఏసెస్ జట్లు టీజీ20 తొలి సీజన్‌లో పోటీకి సిద్ధంగా ఉన్నాయి.

Advertisement