LOADING...
TG20 League: టీజీ20లో ప్లే ఆఫ్స్‌ పోరు రసవత్తరం.. నల్గొండకు కీలక పరీక్ష
టీజీ20లో ప్లే ఆఫ్స్‌ పోరు రసవత్తరం.. నల్గొండకు కీలక పరీక్ష

TG20 League: టీజీ20లో ప్లే ఆఫ్స్‌ పోరు రసవత్తరం.. నల్గొండకు కీలక పరీక్ష

వ్రాసిన వారు Sirish Praharaju
Jul 06, 2026
10:50 am

ఈ వార్తాకథనం ఏంటి

టీజీ20 టోర్నీ లీగ్‌ దశ చివరి అంకానికి చేరుకుంది. అన్ని జట్లు ఇప్పటికే ఆరు మ్యాచ్‌లు పూర్తి చేశాయి. ఈ సీజన్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ అద్భుత ప్రదర్శనతో బరిలోకి దిగిన ప్రతి మ్యాచ్‌లో విజయం సాధించి ఇప్పటివరకు ఓటమి ఎరుగని ఏకైక జట్టుగా నిలిచింది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న ఈ జట్టు క్వాలిఫయర్‌-1లోనూ తన స్థానాన్ని ఖరారు చేసుకుంది. ఇప్పుడు లీగ్‌ దశను కూడా అజేయంగా ముగించాలనే లక్ష్యంతో బరిలోకి దిగుతోంది. ఇక ప్లే ఆఫ్స్‌కు సంబంధించిన మిగతా మూడు స్థానాలు ఇంకా ఖరారు కాకపోవడంతో చివరి నాలుగు లీగ్‌ మ్యాచ్‌లపై ఆసక్తి నెలకొంది.

వివరాలు 

ఈ మ్యాచ్‌లో నల్గొండ నైట్స్‌ విజయం కీలకం

ఈ నేపథ్యంలో సోమవారం జరిగే మ్యాచ్‌లో హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌కు నల్గొండ నైట్స్‌ గట్టి సవాల్‌ విసరనుంది. ప్రస్తుతం పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఉన్న నల్గొండ నైట్స్‌ ఆరు మ్యాచ్‌ల్లో ఎనిమిది పాయింట్లు సాధించింది. టాప్‌-4లో తన స్థానాన్ని మరింత బలపర్చుకోవాలంటే ఈ మ్యాచ్‌లో విజయం కీలకంగా మారింది. మరోవైపు ఖమ్మం ఏసెస్‌ కూడా ఎనిమిది పాయింట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది. కరీంనగర్‌ డైమండ్స్‌, రంగారెడ్డి రైజర్స్‌ చెరో ఆరు పాయింట్లతో వరుసగా నాలుగో, ఐదో స్థానాల్లో ఉన్నాయి. దీంతో ప్లే ఆఫ్స్‌ రేసు మరింత ఉత్కంఠగా మారింది. అయితే అద్భుత ఫామ్‌లో ఉన్న హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ను ఓడించి రెండు కీలక పాయింట్లు సాధించడం నల్గొండకు అంత సులభం కాదు.

వివరాలు 

మెదక్‌ ఫాల్కన్స్‌తో ఖమ్మం ఏసెస్‌ మ్యాచ్

ముఖ్యంగా భీకర ఫామ్‌లో ఉన్న అభిరథ్‌రెడ్డి సారథ్యంలో హైదరాబాద్‌ జట్టు ప్రత్యర్థులపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తోంది. అయినప్పటికీ టోర్నీ మొత్తం మంచి ప్రదర్శన కనబరిచిన నల్గొండ నైట్స్‌ ఈ కీలక పోరులో విజయం సాధించి ప్లే ఆఫ్స్‌ అవకాశాలను మరింత పటిష్ఠం చేసుకోవాలని పట్టుదలతో ఉంది. మరి హైదరాబాద్‌ ఈ ఛాంపియన్స్‌ లీగ్‌ దశను అజేయంగా ముగిస్తుందా? లేక చివరి దశలో నల్గొండ నైట్స్‌ సంచలన విజయంతో షాక్‌ ఇస్తుందా? అన్నది ఆసక్తికరంగా మారింది. ఇదే రోజు జరిగే మరో మ్యాచ్‌లో ఇప్పటికే టోర్నీ నుంచి నిష్క్రమించిన మెదక్‌ ఫాల్కన్స్‌తో ఖమ్మం ఏసెస్‌ తలపడనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధిస్తే ఖమ్మం ఏసెస్‌ ప్లే ఆఫ్స్‌లో టాప్‌-4 బెర్తును అధికారికంగా ఖరారు చేసుకుంటుంది.

Advertisement