IND vs SA : మేం గెలవడానికి అదే అసలు కారణం.. ఐడెన్ మార్‌క్రమ్ సంచలన వ్యాఖ్యలు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో దక్షిణాఫ్రికా జట్టు అద్భుత ఫామ్‌ను కొనసాగిస్తోంది. వరుస విజయాలతో సూపర్-8కు చేరిన ప్రోటీస్, తొలి మ్యాచ్‌లోనే భారత్‌పై సంచలన విజయం సాధించింది. ఏకంగా 76 పరుగుల భారీ తేడాతో టీమిండియాను ఓడించి టోర్నీలో తమ ఆధిపత్యాన్ని చాటుకుంది. ఈ విజయంపై దక్షిణాఫ్రికా కెప్టెన్ 'ఐడెన్ మార్క్రామ్' ఆనందం వ్యక్తం చేశాడు. ఈ మ్యాచ్‌లో గెలుపునకు డేవిడ్ మిల్లర్, డెవాల్డ్ బ్రెవిస్ భాగస్వామ్యమే కీలకమైందని పేర్కొన్నాడు. ఇరు జట్ల మధ్య అసలు తేడా అదే అని స్పష్టం చేశాడు.
Details
సౌతాఫ్రికా ఇన్నింగ్స్
మొదట బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది. డేవిడ్ మిల్లర్ 35 బంతుల్లో 63 పరుగులు చేయగా, డెవాల్డ్ బ్రెవిస్ 29 బంతుల్లో 45 పరుగులు సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 24 బంతుల్లో 44 నాటౌట్‌తో కీలకంగా నిలిచాడు. భారత్ బౌలర్లలో జస్‌ప్రీత్ బుమ్రా మూడు వికెట్లు తీసుకోగా, అర్షదీప్ సింగ్ రెండు వికెట్లు పడగొట్టాడు. వరుణ్ చక్రవర్తి, శివం దూబే తలో వికెట్ సాధించారు.
Details
టీమిండియా పరాజయం
188 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 18.5 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్లలో శివమ్ దూబె (37 బంతుల్లో 42; 1 ఫోర్, 3 సిక్సర్లు) మాత్రమే పోరాడాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో మార్కో జాన్సన్ నాలుగు వికెట్లు తీసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. కేశవ్ మహారాజ్ మూడు వికెట్లు సాధించగా, కార్బిన్ బాష్ రెండు వికెట్లు తీశాడు. కెప్టెన్ మార్క్రామ్ ఒక వికెట్ కూడా ఖాతాలో వేసుకున్నాడు.
Details
మ్యాచ్ అనంతరం మార్క్రామ్ వ్యాఖ్యలు
ఈ విజయం చాలా ప్రత్యేకమని మార్క్రామ్ తెలిపాడు. గతంలో ఇదే మైదానంలో ఆడినప్పుడు ఉన్న పిచ్‌తో పోలిస్తే ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా భిన్నంగా ఉన్నాయని అన్నాడు. అయితే తమ బౌలర్లు ముందుగానే వికెట్ స్వభావాన్ని అంచనా వేసి అద్భుతంగా బౌలింగ్ చేశారని ప్రశంసించాడు. టోర్నీ ఆరంభంలో కొంత కష్టంగా అనిపించినా, భారత్‌తో మ్యాచ్‌లో బౌలింగ్ విభాగం అసాధారణ ప్రదర్శన ఇచ్చిందని పేర్కొన్నాడు. బ్యాటింగ్‌లో మిల్లర్, బ్రెవిస్ కీలక భాగస్వామ్యం జట్టును నిలబెట్టిందని చెప్పాడు. పిచ్‌పై బంతి ఆగుతూ రావడంతో భారీ షాట్లకు బదులుగా ఖాళీల్లోకి నెట్టి పరుగులు సాధించామని వివరించాడు.
Details
భారత్ పై అన్ని విభాగాల్లో రాణిస్తాం
భారత్ బౌలర్లు ఇన్నింగ్స్ ప్రారంభంలో చివర్లో బాగా బౌలింగ్ చేసినా, మిడిల్ ఓవర్లలో తమ బ్యాటింగ్ ఇరు జట్ల మధ్య తేడాగా మారిందని వ్యాఖ్యానించాడు. యూఏఈతో జరిగిన మ్యాచ్‌లో తాము సమిష్టిగా ఆడలేకపోయామని, కానీ భారత్‌పై మాత్రం అన్ని విభాగాల్లో మెరుగైన ఆటతీరును ప్రదర్శించామని చెప్పాడు. అయితే ఫీల్డింగ్‌లో రెండు క్యాచ్‌లు వదిలేయడం మాత్రం నిరాశ కలిగించిందని అంగీకరించాడు. తదుపరి మ్యాచ్ గురించి మాట్లాడుతూ, టోర్నీకి ముందు వెస్టిండీస్‌తో ఇప్పటికే ఆడిన అనుభవం ఉందని, సోమవారం ఉదయం నుంచి ఆ మ్యాచ్‌పై పూర్తిగా దృష్టి సారిస్తామని తెలిపాడు. అది చాలా కీలకమైన మ్యాచ్ అని, గెలుపుకోసం శాయశక్తులా ప్రయత్నిస్తామని మార్క్రామ్ స్పష్టం చేశాడు.