Loading...
Shubman Gill: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు వీరికే.. గిల్‌కు ఐదోసారి, షెఫాలీకి రెండోసారి!
ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు వీరికే.. గిల్‌కు ఐదోసారి, షెఫాలీకి రెండోసారి!

Shubman Gill: ఐసీసీ ప్లేయర్ ఆఫ్ ద మంత్ అవార్డులు వీరికే.. గిల్‌కు ఐదోసారి, షెఫాలీకి రెండోసారి!

వ్రాసిన వారు Jayachandra Akuri
Oct 13, 2026
01:17 pm

ఈ వార్తాకథనం ఏంటి

భారత క్రికెటర్లు శుభ్‌మన్ గిల్‌, షెఫాలీ వర్మ అరుదైన ఘనత సాధించారు. సెప్టెంబర్‌ 2026కు సంబంధించి ప్రకటించిన ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డులను వీరిద్దరూ సొంతం చేసుకున్నారు. పురుషుల విభాగంలో గిల్‌ ఐదోసారి ఈ పురస్కారాన్ని అందుకోగా.. మహిళల విభాగంలో షెఫాలీ వర్మ రెండోసారి అవార్డును గెలుచుకుంది. ఆసియా కప్‌, ఆసియా క్రీడల్లో షెఫాలీ అద్భుత ప్రదర్శన చేయగా.. వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో గిల్‌ పరుగుల వరద పారించాడు.

వివరాలు

గిల్‌ రికార్డు.. ఐదోసారి అవార్డు

వెస్టిండీస్‌తో జరిగిన వన్డే సిరీస్‌లో శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా రాణించాడు. తిరువనంతపురంలో జరిగిన తొలి వన్డేలో 110 పరుగులు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు.

ఆ తర్వాతి మ్యాచ్‌లో మరింత దూకుడుగా ఆడి 133 బంతుల్లోనే 223 పరుగులు సాధించాడు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో అత్యంత వేగంగా డబుల్‌ సెంచరీ చేసిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు.

గిల్‌ విధ్వంసకర ఇన్నింగ్స్‌తో భారత్‌ 406 పరుగుల భారీ లక్ష్యాన్ని మరో 39 బంతులు మిగిలి ఉండగానే ఛేదించింది.

ఈ ప్రదర్శనలే సెప్టెంబర్‌ నెలకు గానూ అతడికి ఐసీసీ పురుషుల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును అందించాయి.

వివరాలు

షెఫాలీ వర్మకు రెండోసారి పురస్కారం

గతంలో గిల్‌ 2023 జనవరి, సెప్టెంబర్‌, 2025 ఫిబ్రవరి, జులై నెలల్లో ఈ అవార్డును గెలుచుకున్నాడు. తాజాగా ఐదోసారి ఈ పురస్కారాన్ని అందుకొని తన ఘనతను మరింత పెంచుకున్నాడు.

వెస్టిండీస్‌ కెప్టెన్‌ హేలీ మాథ్యూస్‌ కూడా ఐదుసార్లు ఈ అవార్డును గెలుచుకుంది. మహిళల విభాగంలో భారత ఓపెనర్‌ షెఫాలీ వర్మ తన బ్యాటింగ్‌ ప్రదర్శనతో ఆకట్టుకుంది.

ఆసియా కప్‌లో భారత జట్టు విజయానికి కీలకంగా నిలిచింది. ఆ టోర్నీలో 360 పరుగులు చేయడంతో పాటు ఆరు వికెట్లు కూడా పడగొట్టింది. 184.61 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు సాధించి తన సత్తా చాటింది. ఆసియా క్రీడల్లోనూ షెఫాలీ అద్భుతంగా రాణించింది.

ADVERTISEMENT

వివరాలు

తాజాగా రెండోసారి ఘనత

బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీఫైనల్లో అజేయంగా 100 పరుగులు చేసింది. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 48 పరుగులు సాధించింది.

ఇలా కీలక మ్యాచ్‌ల్లో నిలకడగా రాణించినందుకు ఆమెకు సెప్టెంబర్‌ నెల ఐసీసీ మహిళల ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు లభించింది.

గతేడాది నవంబరులో జరిగిన మహిళల వన్డే ప్రపంచకప్‌ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై భారత్‌ విజయంలో కీలకమైన ఇన్నింగ్స్‌ ఆడినందుకు షెఫాలీ తొలిసారి ఈ అవార్డును అందుకుంది.

తాజాగా రెండోసారి ఈ ఘనత సాధించింది.

ADVERTISEMENT

వివరాలు

ఒకేసారి రెండు అవార్డులు.. భారత ఆటగాళ్లకు మూడోసారి

ఒకే దేశానికి చెందిన ఆటగాళ్లు పురుషుల, మహిళల విభాగాల్లో ఒకే నెలలో ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డులను గెలుచుకోవడం ఇది ఐదోసారి.

భారత క్రికెటర్లు ఈ ఘనత సాధించడం మాత్రం మూడోసారి. 2024 జూన్‌లో జస్ప్రీత్‌ బుమ్రా, స్మృతి మంధాన ఈ అవార్డులను గెలుచుకున్నారు.

2025 సెప్టెంబర్‌లో అభిషేక్‌ శర్మ, స్మృతి మంధాన కూడా ఒకేసారి పురుషుల, మహిళల విభాగాల్లో పురస్కారాలు అందుకున్నారు.

తాజాగా శుభ్‌మన్‌ గిల్‌, షెఫాలీ వర్మ ఈ జాబితాలో చేరారు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులు వేసిన ఓట్లతో పాటు మాజీ అంతర్జాతీయ క్రికెటర్లు, మీడియా ప్రతినిధులతో కూడిన నిపుణుల కమిటీ నిర్ణయం ఆధారంగా ఐసీసీ ఈ అవార్డు విజేతలను ఎంపిక చేసింది.

ADVERTISEMENT