Loading...
Sourav Ganguly: సౌరబ్ గంగూలీ దంపతులకు వరుసగా బెదిరింపు లేఖలు.. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు
సౌరబ్ గంగూలీ దంపతులకు వరుసగా బెదిరింపు లేఖలు.. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

Sourav Ganguly: సౌరబ్ గంగూలీ దంపతులకు వరుసగా బెదిరింపు లేఖలు.. సీరియస్‌గా తీసుకున్న పోలీసులు

వ్రాసిన వారు Jayachandra Akuri
Aug 11, 2026
11:00 am

ఈ వార్తాకథనం ఏంటి

మాజీ భారత క్రికెట్‌ కెప్టెన్‌, బెంగాల్‌ క్రికెట్‌ సంఘం (CAB) అధ్యక్షుడు సౌరబ్ గంగూలీ, ఆయన భార్య డోనా గంగూలీకి గత ఆరు నెలలుగా వరుసగా బెదిరింపు లేఖలు వస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా సోమవారం గంగూలీ కార్యాలయానికి రెండు బెదిరింపు లేఖలు రావడంతో ఈ వ్యవహారం తీవ్ర కలకలం రేపింది. దీంతో కోల్‌కతా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. గంగూలీ మేనేజర్‌ ఠాకూర్‌పుకూర్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆరు నెలలుగా ఇలాంటి లేఖలు అందుతున్నప్పటికీ.. వాటిని తొలుత పెద్దగా పట్టించుకోలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సోమవారం వచ్చిన రెండు లేఖల్లో గంగూలీ దంపతులను చంపుతామని, వారి సన్నిహితులకు కూడా హాని చేస్తామని స్పష్టంగా బెదిరించడంతో పోలీసులను ఆశ్రయించారు.

వివరాలు

బెల్‌ఘరియా నుంచి లేఖలు?

ఈ బెదిరింపు లేఖలపై పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు.

ప్రాథమిక విచారణలో ఈ లేఖలు ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బెల్‌ఘరియా ప్రాంతానికి చెందిన వ్యక్తి కొరియర్‌ సర్వీస్‌ ద్వారా పంపి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

'ఫిర్యాదును తీవ్రంగా పరిగణిస్తున్నాం. లేఖలు, వాటి మూలం, కొరియర్‌ మార్గం తదితర వివరాలను పరిశీలిస్తున్నాం.

బెదిరింపు లేఖలు పంపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నామని ఓ సీనియర్‌ పోలీసు అధికారి తెలిపారు.

వివరాలు

సిమ్‌ కార్డు కదలికలపై నిఘా

బెదిరింపు లేఖలతో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఓ సిమ్‌ కార్డు కదలికలను కూడా పోలీసులు ట్రాక్‌ చేస్తున్నారు.

లేఖలు పంపేందుకు ఉపయోగించిన కొరియర్‌ సంస్థను సంప్రదించి.. ఆయా పార్సిళ్లకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నారు.

వాటి మూలాన్ని గుర్తించడం ద్వారా లేఖలు పంపిన వ్యక్తిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. కొరియర్‌ సంస్థకు చెందిన సిబ్బందితో మాట్లాడాం. ఒక మొబైల్‌ నంబర్‌ను గుర్తించాం. ప్రస్తుతం దాని కదలికలను ట్రేస్‌ చేసే ప్రయత్నం చేస్తున్నామని పోలీసు అధికారి వెల్లడించారు.

ఇప్పటివరకు గంగూలీ కార్యాలయానికి వచ్చిన అన్ని లేఖలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వాటిలో ఏమైనా ఒకే వ్యక్తి లేదా ఒకే మూలం నుంచి వచ్చాయా అనే విషయాన్ని పోల్చి చూస్తున్నారు. ఈ కేసులో ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదు.

ADVERTISEMENT