Virat Kohli: లింక్డిన్‌లోకి విరాట్ కోహ్లీ ఎంట్రీ.. తొలి పోస్ట్‌లో ఏం చెప్పాడంటే?
ఈ వార్తాకథనం ఏంటి
టీమిండియా స్టార్ క్రికెటర్, అభిమానులు ముద్దుగా 'కింగ్' అని పిలుచుకునే విరాట్ కోహ్లీ ఆటలోనే కాదు.. సంపదలోనూ తనదైన ముద్ర వేస్తున్నాడు. మైదానంలో పరుగుల వరద పారిస్తూనే వ్యాపార రంగంలోనూ సత్తా చాటుతున్నాడు. క్రికెట్‌తో పాటు పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ ముందుకు సాగుతున్న కోహ్లీ తాజాగా లింక్డిన్ (LinkedIn)లోకి అడుగుపెట్టాడు. ఈ వేదికపై ఖాతా తెరిచిన అతడు.. తన దార్శనికతను వివరిస్తూ సుదీర్ఘ పోస్ట్ పెట్టాడు. భారత క్రీడారంగ భవిష్యత్తు, అంతర్జాతీయ స్థాయిలో దేశం సాధించగల పురోగతిపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు.
వివరాలు
భారత క్రీడారంగంపై కోహ్లీ ఏమన్నాడంటే?
భారత్‌లో ప్రతి క్రీడనూ ఆదరించి, ఆస్వాదించే రోజులు రావాలని తాను ఎప్పటి నుంచో కోరుకుంటున్నట్లు విరాట్ కోహ్లీ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.
అలాంటి రోజులకు ఇప్పుడు మరింత దగ్గరవుతున్నట్లు అనిపిస్తోందని తెలిపాడు. మన దేశం ప్రపంచ స్థాయి క్రీడాకారులను తయారు చేయగలదని, అంతర్జాతీయ వేదికపై గుర్తింపు పొందే బ్రాండ్లను సృష్టించగలదని కొత్త తరం నిరూపిస్తోందని అభిప్రాయపడ్డాడు.
భారత్ ఒక సమగ్ర క్రీడా వేదికను నిర్మించగలదనే నమ్మకం కలుగుతోందని చెప్పాడు.
ఇకపై అంతర్జాతీయ వేదికలపై పాల్గొనడానికే పరిమితం కాకుండా.. అంతర్జాతీయ టోర్నీల భవిష్యత్తును సైతం తీర్చిదిద్దగలమని విశ్వసిస్తున్నట్లు కోహ్లీ వెల్లడించాడు.
తన కెరీర్‌లో నేర్చుకున్న పాఠాన్ని కూడా ఈ సందర్భంగా పంచుకున్నాడు.
వివరాలు
వ్యాపారాల్లోనూ కోహ్లీ ప్రత్యేక ముద్ర
సరిహద్దులను చెరిపేసి, ఉన్నత ప్రమాణాలతో విభిన్నమైన ప్రయత్నాలు చేయడానికి సాహసించినప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నాడు.
విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్‌కే పరిమితం కాలేదు. పలు వ్యాపారాల్లో పెట్టుబడులు పెడుతూ తన వ్యాపార కార్యకలాపాలను విస్తరిస్తున్నాడు.
స్పోర్ట్స్ బ్రాండ్ 'అజిలిటాస్'లో అతడు పెట్టుబడులు పెట్టాడు. అలాగే స్పోర్ట్స్‌వేర్ బ్రాండ్ 'వన్8వరల్డ్'కు సహవ్యవస్థాపకుడిగా వ్యవహరిస్తున్నాడు.
ఈ సంస్థల గురించి కూడా కోహ్లీ తన లింక్డిన్ పోస్ట్‌లో ప్రస్తావించాడు. వీటితో పాటు ఆరోగ్యం, పోషకాహారానికి సంబంధించిన పలు సంస్థల్లోనూ అతడికి పెట్టుబడులు ఉన్నాయి.
మరోవైపు రెస్టారెంట్లు, ఫ్యాషన్ బ్రాండ్ల వంటి వ్యాపారాలను కూడా నిర్వహిస్తున్నాడు.
మైదానంలో తన ఆటతో అభిమానులను అలరిస్తున్న కోహ్లీ.. వ్యాపార రంగంలోనూ కొత్త అవకాశాలను అందిపుచ్చుకుంటున్నాడు.