ICC Mens T20 World Cup:మేం ఇప్పటికే పాక్‌ను ఓడించాం.. ఒత్తిడి అంతా ఆ జట్టుపైనే ఉంటుంది : యూఎస్ఏ ప్లేయర్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026లో భాగంగా కొలంబో వేదికగా మరికొన్ని గంటల్లో యూఎస్‌ఏ-పాకిస్థాన్ జట్ల మధ్య కీలక మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌కు ముందు యూఎస్‌ఏ క్రికెటర్ మహ్మద్ మోహ్సిన్ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఒత్తిడి మొత్తం పాకిస్థాన్‌పైనే ఉందని, దానికి కారణం టీ20 వరల్డ్‌కప్ 2024లో తమ జట్టే పాకిస్థాన్‌ను ఓడించడమేనని ఆయన స్పష్టం చేశాడు. మ్యాచ్‌కు ముందు నిర్వహించిన విలేకరుల సమావేశంలో మోహ్సిన్ మాట్లాడుతూ.. 'మేము ఇప్పటికే పాకిస్థాన్‌ను ఓడించాం. అందుకే ఒత్తిడి అంతా వారి మీదే ఉంటుంది. మేము మా బలాలను మరింత మెరుగుపర్చుకున్నాం. కాబట్టి మరోసారి వారిని ఓడిస్తామనే పూర్తి నమ్మకం మాకు ఉందని వ్యాఖ్యానించాడు.
Details
ముందుగా బౌలింగ్ చేసిన అమెరికా
2024 జూన్ 6న అమెరికా క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన విషయం తెలిసిందే. టీ20 వరల్డ్‌కప్ 2024లో డల్లాస్ వేదికగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్ టైగా ముగిసింది. అనంతరం జరిగిన సూపర్ ఓవర్‌లో అమెరికా 5 పరుగుల తేడాతో సంచలన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో టాస్ గెలిచిన అమెరికా ముందుగా బౌలింగ్‌ను ఎంచుకుంది. బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 159 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో అమెరికా కూడా 20 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 159 పరుగులే చేయడంతో మ్యాచ్ టై అయింది.
Details
'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా మోనాంక్ పటేల్
సూపర్ ఓవర్‌లో అమెరికా 1 వికెట్ నష్టానికి 18 పరుగులు చేయగా, పాకిస్థాన్ 1 వికెట్ కోల్పోయి కేవలం 13 పరుగులకే పరిమితమైంది. దీంతో అమెరికా 5 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో 38 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌తో 50 పరుగులు చేసిన మోనాంక్ పటేల్ 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు.