ఆ యువ ప్లేయర్ వల్లే మ్యాచ్‌ను గెలిచాం: రోహిత్ శర్మ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023లో ఎట్టకేలకు ముంబై ఇండియన్స్ ఖాతా తెరిచింది. వరుసగా రెండు మ్యాచ్‌లో పరాజయం పాలైన ముంబై.. మూడో మ్యాచ్‌లో చివరి బంతికి గెలుపు సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ 6 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ 45 బంతుల్లో 65 పరుగులు, తిలక్ వర్మ 29 బంతుల్లో 41 పరుగులు చేసి మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును రోహిత్ శర్మ అందుకున్నాడు. మ్యాచ్ అనంతరం ముంబై విజయంపై కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడారు. కీలకమైన మ్యాచ్‌లో విజయం సాధించడం చాలా సంతోషంగా ఉందని చెప్పారు.
తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడు
తొలి విజయం ఎప్పుడూ ప్రత్యేకమేనని, ఈ మ్యాచ్ కు ముందు తాము నెట్స్‌లో శ్రమించామని దాని ఫలితంగానే విజయం సాధించామని రోహిత్ చెప్పారు. ఇటీవల ఈ పిచ్ పై టెస్టు మ్యాచ్ ఆడామని, అప్పటికంటే ఇప్పుడు పిచ్ కాస్త భిన్నంగా ఉందన్నారు. ముఖ్యంగా ఛేజింగ్ లో తిలక్ వర్మ అద్భుతంగా రాణించాడని, అతను నమోదు చేసిన పరుగులే తమ విజయానికి కారణమని, యువ ఆటగాళ్లకు మరిన్ని మ్యాచ్‌లో అవకాశాలను కల్పిస్తామని వెల్లడించారు. ఏప్రిల్ 16న ముంబై ఇండియన్స్, కోల్ కత్తా నైట్ రైడర్స్‌తో తలపడనుంది.