IND vs SA:గతంలో ట్రోఫీ గెలిచాం.. ఇప్పుడు సూపర్-8లోనే దక్షిణాఫ్రికాను ఓడించేందుకు సిద్ధమైన భారత్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2024 గుర్తుండే ఉంటుంది. దాదాపు 17 ఏళ్ల నిరీక్షణకు తెరదిస్తూ ఇండియా క్రికెట్ జట్టు ఛాంపియన్‌గా అవతరించింది. చివరి బంతి వరకు ఉత్కంఠగా సాగిన ఫైనల్లో సౌతాఫ్రికాపై గెలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పుడు మళ్లీ ఈ రెండు జట్లు ఎదురెదురుగా నిలవబోతున్నాయి. అయితే ఈసారి ఫైనల్‌లో కాదు... టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలోనే 'నువ్వా? నేనా?' అన్న పోరు తేలనుంది. రెండేళ్ల క్రితం ఎదురైన ఓటమికి సఫారీ జట్టు ప్రతీకారం తీర్చుకుంటుందా? లేక మరోసారి భారత్ ఆధిపత్యం ప్రదర్శిస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. గత రెండేళ్లలో ఇరు జట్లలో వచ్చిన మార్పులు, కీలక ఆటగాళ్ల ఫామ్‌ను పరిశీలిద్దాం.
Details
మహా డేంజర్‌గా సఫారీ జట్టు
దక్షిణాఫ్రికా జట్టును ఎప్పుడూ తక్కువ అంచనా వేయలేం. భారత్ మాదిరిగానే సఫారీ టీమ్ కూడా గ్రూప్ దశలో నాలుగు మ్యాచ్‌ల్లోనూ గెలిచి సూపర్-8కు చేరింది. కెప్టెన్ అడమ్ మార్క్రమ్ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో 178 పరుగులు చేసి, రెండు అర్ధశతకాలు నమోదు చేశాడు. టోర్నీలో అత్యధిక ఫోర్లు (24) కొట్టిన బ్యాటర్ కూడా అతడే. ఇక ర్యాన్ రికెల్టన్, డేవిడ్ మిల్లర్లను తేలికగా తీసుకోవడం ప్రమాదకరం. 'నయా ఏబీడీ'గా పేరొందిన డెవాల్డ్ బ్రెవిస్ మ్యాచ్‌ను ఒంటిచేత్తో మలుపు తిప్పగలడు. ఇక క్వింటన్ డి కాక్, ట్రిస్టన్ స్టబ్స్ కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు కష్టాలు తప్పవు. ఆల్‌రౌండర్ మార్కో జాన్సన్‌ను నిర్లక్ష్యం చేయడం ప్రమాదమే. ఓపెనింగ్ బౌలింగ్‌తో పాటు లోయర్ ఆర్డర్‌లో భారీ షాట్లు ఆడగలడు.
Details
ఆ సిరీస్‌లు భారత్‌వే… కానీ
బౌలింగ్ విభాగంలో లుంగి ఎన్గిడి, క్వేనా మఫాకా, అన్రిచ్ నోర్ట్జే, కేశవ్ మహారాజ్‌లతో సఫారీ దళం సవాల్ విసురుతోంది. గత ప్రపంచకప్ తర్వాత భారత్, దక్షిణాఫ్రికా మధ్య రెండు టీ20 సిరీస్‌లు జరిగాయి. రెండింటినీ భారత్ సొంతం చేసుకుంది. డిసెంబర్ 2024లో సౌతాఫ్రికా పర్యటనకు వెళ్లిన టీమ్‌ఇండియా నాలుగు టీ20ల సిరీస్‌ను 3-1తో గెలిచింది. అనంతరం భారత పర్యటనకు వచ్చిన సఫారీ జట్టుపై ఐదు టీ20ల సిరీస్‌ను కూడా 3-1తో కైవసం చేసుకుంది. ఒక మ్యాచ్ వర్షం కారణంగా రద్దైంది. ఆ రెండు సిరీస్‌ల్లో తిలక్ వర్మ టాప్ బ్యాటర్‌గా, వరుణ్ చక్రవర్తి ప్రధాన బౌలర్‌గా నిలిచారు. ప్రస్తుతం కూడా వీరిద్దరూ మంచి ఫామ్‌లో ఉండటంతో అభిమానులు మళ్లీ అదే ప్రభావం ఆశిస్తున్నారు.
Details
ఆ ఒక్కడు కుదురుకుంటే…
భారత జట్టులో అభిషేక్ శర్మ మినహా మిగతా బ్యాటర్లు అందరూ ఫామ్‌లో ఉన్నారు. సూపర్-8లో అభిషేక్ నుంచి ఒక మెరుగైన ఇన్నింగ్స్ వస్తే జట్టు మరింత బలపడుతుంది. అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో వరుణ్ (9 వికెట్లు) రెండో స్థానంలో ఉన్నాడు. అత్యధిక పరుగుల జాబితాలో ఇషాన్ కిషన్ (176 పరుగులు) టాప్-5లో నిలిచాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్, హర్దిక్ పాండ్యా బ్యాట్ మెరిపిస్తే భారత్‌కు తిరుగుండదు. అయితే జట్టు కూర్పే కీలకం. ఫైనల్ XIలో ముగ్గురు స్పిన్నర్లకు చోటిస్తారా? లేక ఇద్దరు ప్రధాన పేసర్లతో బరిలోకి దిగుతారా? అన్నది ఆసక్తికరం.
Details
వీరి మధ్య పోరు కీలకం
ఇషాన్ కిషన్ - అభిషేక్ శర్మ vs మార్కో యాన్సెన్ సూర్యకుమార్ యాదవ్ vs కేశవ్ మహరాజ్ ఐదెన్ మార్‌క్రమ్ vs జస్పిత్ బుమ్రా డేవిడ్ మిల్లర్ vs వరుణ్ చక్రవర్తి డెవాల్డ్ బ్రెవిస్ vs అక్షర్ పటేల్ మొత్తానికి, సూపర్-8లో భారత్-దక్షిణాఫ్రికా పోరు మరోసారి హై వోల్టేజ్ సమరంగా మారనుంది. గత విజయాల జ్ఞాపకాలు ఒకవైపు... ప్రతీకార దీక్ష మరోవైపు... ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలి.