Loading...
Womens champions trophy 2027: భారత్‌కు 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు రూ.188 కోట్ల నష్టం
భారత్‌కు 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు రూ.188 కోట్ల నష్టం

Womens champions trophy 2027: భారత్‌కు 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ.. శ్రీలంకకు రూ.188 కోట్ల నష్టం

వ్రాసిన వారు Moogati Shabari
Sep 03, 2026
02:03 pm

ఈ వార్తాకథనం ఏంటి

శ్రీలంక క్రికెట్‌కు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) భారీ షాక్ ఇచ్చింది. తొలిసారి నిర్వహించనున్న మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ-2027 ఆతిథ్య హక్కులను శ్రీలంక నుంచి వెనక్కి తీసుకుంది. ఈ ప్రతిష్ఠాత్మక టోర్నీని భారత్‌లో నిర్వహించాలని ఐసీసీ బోర్డు అధికారికంగా నిర్ణయించింది. దీంతో శ్రీలంక సుమారు 20 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.188 కోట్లు) ఆదాయాన్ని కోల్పోనుంది. శ్రీలంక క్రికెట్ (ఎస్‌ఎల్‌సీ) వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం కొనసాగుతుండటమే ఈ నిర్ణయానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఐసీసీ నిబంధనల ప్రకారం.. ప్రతి క్రికెట్ బోర్డుకు ఎన్నికైన పాలకవర్గం ఉండాలి. అయితే శ్రీలంకలో ప్రస్తుతం ప్రభుత్వం నియమించిన 'ట్రాన్స్‌ఫర్మేషన్ కమిటీ' బోర్డు వ్యవహారాలను పర్యవేక్షిస్తోంది. దీనిపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది.

వివరాలు

ట్రోఫీ ఆతిథ్య హక్కులను భారత్‌కు బదిలీ..

ఈ నేపథ్యంలోనే మహిళల ఛాంపియన్స్ ట్రోఫీ ఆతిథ్య హక్కులను భారత్‌కు బదిలీ చేసింది.

ఈ టోర్నీ 2027 ఫిబ్రవరి 14 నుంచి 28 వరకు ముంబై, వడోదర వేదికలుగా జరగనుంది.

'శ్రీలంక డైలీ మిర్రర్' కథనం ప్రకారం.. క్రికెట్ బోర్డులో రాజకీయ జోక్యాన్ని తొలగించి, ఎన్నికలు నిర్వహించకపోతే ఆతిథ్య హక్కులను కోల్పోతారని ఐసీసీ కొన్ని నెలల క్రితమే శ్రీలంక క్రికెట్‌ను హెచ్చరించింది.

అయితే ఈ విషయాన్ని మధ్యంతర కమిటీ అక్కడి క్రీడా మంత్రిత్వ శాఖకు లేదా అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే దృష్టికి తీసుకెళ్లలేదని ఆ కథనం పేర్కొంది.

తాజాగా ఆతిథ్య హక్కులు కోల్పోవడంతో పర్యాటకం, వాణిజ్య కార్యకలాపాల ద్వారా వచ్చే సుమారు 20 మిలియన్ డాలర్ల ఆదాయాన్ని శ్రీలంక కోల్పోనుంది.

వివరాలు

శ్రీలంక మెగా టోర్నీ ఆతిథ్యాన్ని కోల్పోవడం ఇది రెండోసారి..

లంక క్రికెట్‌లో ప్రభుత్వ జోక్యం కారణంగా శ్రీలంక మెగా టోర్నీ ఆతిథ్యాన్ని కోల్పోవడం ఇది రెండోసారి.

గతేడాది కూడా ఇదే కారణంతో 2024 పురుషుల అండర్-19 ప్రపంచకప్ ఆతిథ్యాన్ని ఐసీసీ శ్రీలంక నుంచి దక్షిణాఫ్రికాకు తరలించింది.

మూడేళ్ల వ్యవధిలో రెండు కీలకమైన ఐసీసీ టోర్నీల ఆతిథ్యాన్ని కోల్పోవడం శ్రీలంక క్రికెట్‌కు గట్టి ఎదురుదెబ్బగా విశ్లేషకులు భావిస్తున్నారు.

ప్రస్తుతం లంక క్రికెట్ బోర్డు రాజ్యాంగ సంస్కరణలు, కొత్త ఎన్నికల నిర్వహణపై దృష్టి సారించింది.

ఇక ఈ టోర్నీలో మొత్తం ఆరు జట్లు పాల్గొంటాయి. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, భారత్, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా ఇప్పటికే అర్హత సాధించాయి.

ఆరో స్థానం కోసం ఐసీసీ ర్యాంకింగ్స్‌లో ఆరో, ఏడో స్థానాల్లో ఉన్న వెస్టిండీస్, శ్రీలంక పోటీ పడనున్నాయి.

ADVERTISEMENT