IND vs ZIM : ప్రత్యర్థిపై కాదు.. మా ఆటపైనే దృష్టి: బ్రాడ్ ఎవాన్స్
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో భాగంగా భారత్, జింబాబ్వే జట్ల మధ్య నేడు (గురువారం, ఫిబ్రవరి 26) కీలక పోరు జరగనుంది. చెన్నైలోని చెపాక్ స్టేడియం ఈ మ్యాచ్‌కు వేదికగా నిలవనుంది. సెమీఫైనల్ అవకాశాలను నిలబెట్టుకోవాలంటే ఈ మ్యాచ్‌లో తప్పనిసరిగా గెలవాలనే లక్ష్యంతో టీమిండియా బరిలోకి దిగుతోంది. అదే సమయంలో జింబాబ్వే కూడా సంచలన విజయం సాధించి సెమీస్ రేసులో కొనసాగాలనే పట్టుదలతో ఉంది. ఈ కీలక మ్యాచ్‌కు ముందు జింబాబ్వే స్టార్ ఆల్‌రౌండర్ బ్రాడ్ ఎవాన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. తమ దృష్టి పూర్తిగా మ్యాచ్‌పైనే ఉందని, ప్రత్యర్థి జట్టుపై కాదని ఆయన స్పష్టం చేశాడు. గెలుపే లక్ష్యంగా తమ శక్తి మొత్తాన్ని వినియోగిస్తామని పేర్కొన్నాడు.
వివరాలు
మా బలాలపైనే ప్రధానంగా దృష్టి..
'టీమిండియా ఒక గొప్ప జట్టు అనే విషయం మాకు బాగా తెలుసు. అయితే మేము వారి గురించి ఎక్కువగా ఆలోచించడం లేదు. మా బలాలపైనే ప్రధానంగా దృష్టి పెట్టాము. మా ప్రణాళికలను మైదానంలో సమర్థంగా అమలు చేయడమే మా లక్ష్యం. ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ విభాగాలపై విస్తృతంగా చర్చించుకున్నాం. ప్రత్యర్థి కంటే మా ఆటపై ఫోకస్ చేస్తున్నాం. వారు ప్రపంచంలోని అత్యుత్తమ జట్లలో ఒకటన్న విషయం తెలిసినా, మైదానంలో మా పూర్తి శక్తిని ప్రదర్శిస్తాం' అని ఎవాన్స్ వివరించాడు.
వివరాలు
వెస్టిండీస్ మ్యాచ్‌లో మా ప్రణాళికలు సరిగా అమలుకాలేదు: బ్రాడ్ ఎవాన్స్
ఇటీవల వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలవడంతో జింబాబ్వే నెట్‌రన్‌రేట్ తీవ్రంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్‌పై స్పందించిన ఎవాన్స్, తమ జట్టులోని పలువురు ఆటగాళ్లకు భారత్‌లో ఇదే తొలి టీ20 మ్యాచ్ అని వెల్లడించాడు. 'గత మ్యాచ్‌లో మా ప్రణాళికలు సరిగా అమలుకాలేదు. మా జట్టులో చాలా మందికి భారత్‌లో ఇదే తొలి టీ20 అనుభవం. అలాంటి పరిస్థితుల్లో ఎంతో అనుభవం ఉన్న జట్టును ఎదుర్కొన్నాం. ఫలితం అనుకూలంగా రాలేదు. అయినప్పటికీ మా శక్తి మేరకు పోరాడాం. ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకున్నాం. భారత్‌తో జరగబోయే మ్యాచ్‌లో మా అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం' అని బ్రాడ్ ఎవాన్స్ వెల్లడించాడు.