LOADING...
IND vs ZIM: ఎంతమంది స్టార్‌లు ఉన్నా సరే.. భారత్‌ను ఓడించేందుకు సిద్ధమేనంటున్న జింబాబ్వే!
ఎంతమంది స్టార్‌లు ఉన్నా సరే.. భారత్‌ను ఓడించేందుకు సిద్ధమేనంటున్న జింబాబ్వే!

IND vs ZIM: ఎంతమంది స్టార్‌లు ఉన్నా సరే.. భారత్‌ను ఓడించేందుకు సిద్ధమేనంటున్న జింబాబ్వే!

వ్రాసిన వారు Jayachandra Akuri
Feb 24, 2026
02:58 pm

ఈ వార్తాకథనం ఏంటి

టీ20 ప్రపంచకప్ 2026 సూపర్-8 దశలో జింబాబ్వేకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. వెస్టిండీస్‌తో జరిగిన మ్యాచ్‌లో 107 పరుగుల తేడాతో ఓటమి చవిచూసింది. ఆ మ్యాచ్‌లో కరీబియన్ జట్టు టోర్నీ చరిత్రలోనే రెండో అత్యధిక స్కోరు 254/6 నమోదు చేసింది. ఈ పరాజయం తమకు గట్టి పాఠం నేర్పిందని, భారత్‌తో జరిగే కీలక సూపర్-8 పోరుకు మరింత వ్యూహాత్మకంగా సిద్ధమవుతామని జింబాబ్వే హెడ్ కోచ్ జస్టిన్ సమన్స్ తెలిపారు. గురువారం చెన్నైలో టీమిండియాతో జరిగే మ్యాచ్‌పై స్పందించిన సమన్స్, భారత్ పూర్తి దూకుడుతో బరిలోకి దిగుతుందని పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా చేతిలో భారత్ 83 పరుగుల తేడాతో ఓడిన నేపథ్యంలో, ఆ జట్టు జింబాబ్వేపై ఎటువంటి వెనకడుగు వేయదని ఆయన అభిప్రాయపడ్డారు.

Details

ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో తెలుసు

మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ, "భారత్ ఎలా ఆడబోతుందో మాకు తెలుసు. వెస్టిండీస్ బ్యాటింగ్ చేసిన తీరు చూసాం. భారత్ కూడా అదే స్థాయిలో దూకుడుగా ఆడుతుంది. వాళ్లు ఏమాత్రం వెనుకడుగు వేయరని అన్నారు. అయితే, తమ జట్టు కూడా ఆ ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో నేర్చుకుందని ఆయన స్పష్టం చేశారు. ఆ మ్యాచ్‌ నుంచి చాలా విషయాలు గ్రహించాం. ఒత్తిడిలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటం కీలకం. పరిస్థితులకు అనుగుణంగా వేగంగా నిర్ణయాలు తీసుకోవాలి. ప్రత్యర్థి బ్యాట్స్‌మన్‌ల రిథమ్‌ను మార్చేందుకు వ్యూహాల్లో చిన్న మార్పులు చేయాల్సి ఉంటుందని వివరించారు.

Details

ఆ విషయంలో తెలివిగా వ్యవహరించాలి

వెస్టిండీస్ మ్యాచ్‌లో ముఖ్యంగా బౌలింగ్ విభాగం ఊహించదగ్గ విధంగా మారిందని సమన్స్ అంగీకరించారు. "ఆ విషయంలో మేం ఇంకా తెలివిగా వ్యవహరించాలి. చెన్నై మైదానం కొంచెం పెద్దది. అక్కడ మా బౌలింగ్ వ్యూహాలను మెరుగుపరుచుకునే అవకాశం ఉందని అన్నారు. ఈ వ్యాఖ్యలతో జింబాబ్వే జట్టు భారత్‌తో జరిగే కీలక పోరులో మరింత ఆలోచనాత్మకంగా, వ్యూహాత్మకంగా ఆడేందుకు సిద్ధమవుతోందన్న సంకేతాలు స్పష్టమయ్యాయి.

Advertisement