T20 World Cup 2026: టీ20 వరల్డ్ కప్ నుంచి పాక్ మూలాలున్న బ్యాటర్ తొలగింపు
ఈ వార్తాకథనం ఏంటి
టీ20 ప్రపంచకప్-2026లో పాల్గొంటున్న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ జట్టులో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. పాకిస్తాన్ మూలాలున్న బ్యాటర్ మొహమ్మద్ జోహెబ్‌ను ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు అకస్మాత్తుగా స్వదేశానికి పంపించింది. బోర్డు విడుదల చేసిన ప్రకటనలో జోహెబ్ శాసన నియమావళిని ఉల్లంఘించాడని పేర్కొనగా, ఆ ఉల్లంఘన ఏంటన్న పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదు. ఈ వ్యవహారం క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఒక్కసారిగా ఓ ఆటగాడిని జట్టు నుంచి పంపించారంటే తప్పకుండా బలమైన కారణమే ఉండి ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. జోహెబ్ ఏ నియమాలను ఉల్లంఘించాడో తెలుసుకునేందుకు క్రికెట్ ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తోంది.
వివరాలు
పాకిస్తాన్ మూలాలవాడిననే కారణంతోనే నన్ను పక్కన పెట్టారు: జోహెబ్
ఇదిలా ఉండగా, తనపై తీసుకున్న చర్యను జోహెబ్ తీవ్రంగా వ్యతిరేకించాడు. ఇది పూర్తిగా జాతి వివక్ష కారణంగానే జరిగిందని అతడు ఆరోపించాడు. జట్టు మేనేజ్‌మెంట్‌లో ఎక్కువ మంది భారతీయ మూలాలవారే ఉన్నారని, తాను పాకిస్తాన్ మూలాలవాడినని కారణంతోనే తనను పక్కన పెట్టారని వ్యాఖ్యానించాడు. తనకు జరిగిన అన్యాయంపై అధికారిక విచారణ జరపాలని కూడా అతడు డిమాండ్ చేశాడు. అయితే, ఈ విషయంలో జోహెబ్ భారత్‌ను తప్పుబట్టడాన్ని భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సమస్య ఏదైనా ఉంటే అది యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ క్రికెట్ బోర్డుతోనే పరిష్కరించుకోవాలని, భారత మూలాలున్న వారిని అడ్డం పెట్టుకుని భారత్‌ను నిందించడం సరికాదని వారు హెచ్చరిస్తున్నారు.